Kids

NEET…ఏ ర్యాంకుకు ఎక్కడ సీటు వస్తుంది?

NEET…ఏ ర్యాంకుకు ఎక్కడ సీటు వస్తుంది?

ఎంబీబీఎస్, బీడీఎస్‌ సీట్ల భర్తీకి జాతీయ స్థాయిలో నిర్వహించిన నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (నీట్‌) ఇటీవలే ముగిసింది. మన రాష్ట్రం నుంచి మొత్తం 59 వేల మందికిపైగా నీట్‌ రాశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అభ్యర్థుల ఆందోళన అంతా తమకొచ్చే ర్యాంకుకు సీటు వస్తుందో, రాదోననే. మన రాష్ట్రంలో 11 ప్రభుత్వ, 15 ప్రైవేటు, 2 మైనార్టీ కాలేజీల్లో కన్వీనర్, యాజమాన్య, ప్రవాస భారతీయ కోటా.. ఇలా అన్నీ కలిపి 5,010 ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలల వరకు మాత్రమే చూస్తే ఎంబీబీఎస్‌ సీట్ల సంఖ్య 2,180. అభ్యర్థుల్లో అందరి దృష్టి ప్రభుత్వ కళాశాలలపైనే ఉంది. దీనికోసం ఎన్ని మార్కులు వస్తే.. ఎంత ర్యాంకు వస్తుంది, ఎంత ర్యాంకు సాధిస్తే ప్రభుత్వ కాలేజీల్లో సీటు వస్తుందో తెలుసుకునే పనిలో ప్రస్తుతం అభ్యర్థులంతా తలమునకలై ఉన్నారు. ఈ ఏడాది నీట్‌లో భౌతిక శాస్త్రం (ఫిజిక్స్‌) కొంచెం కష్టంగా వచ్చింది. దీంతో ఫిజిక్స్‌లో బాగా పట్టున్న వారు, ఆ సబ్జెక్టు బాగా రాసిన వారు సీటు వస్తుందన్న ఆశతో ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఎంబీబీఎస్‌ సీట్లలో 15 శాతం జాతీయ కోటా కింద నేషనల్‌ పూల్‌లో భర్తీ చేస్తారు. మిగతా 85 శాతం సీట్లను రాష్ట్రమే భర్తీ చేస్తుంది. కాగా, 2 ప్రభుత్వ డెంటల్‌ కాలేజీల్లో 140, 14 ప్రైవేటు డెంటల్‌ కాలేజీల్లో 1,300 బీడీఎస్‌ సీట్లు ఉన్నాయి.

ఏయూ పరిధిలో ఓపెన్‌ కేటగిరీలో 343 మార్కులకు డెంటల్‌ సీటు గతేడాది ఆంధ్రా విశ్వవిద్యాలయం పరిధిలో ఎస్టీ కేటగిరీలో 162 మార్కులు సాధించిన వ్యక్తికి ప్రభుత్వ కళాశాలలో దంత వైద్య సీటు లభించింది. జాతీయ స్థాయిలో 6,31,277 ర్యాంకు సాధించిన అభ్యర్థికి 162 మార్కులు వచ్చాయి. అదే ఓపెన్‌ కేటగిరీలో చివరి సీటు 343 మార్కులు (ర్యాంకు 2,57,671) వచ్చినవారికి దక్కింది. ఎస్సీ కేటగిరీలో 310 మార్కులు వచ్చిన వారికి చివరి సీటు లభించింది. అదే శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో చూస్తే ఎస్టీ కేటగిరీలో 359 మార్కులు (2,35,606 ర్యాంకు) వచ్చిన వారికి కూడా సీటు దక్కింది. దీన్ని బట్టి చూస్తే ఒకే రాష్ట్రంలో రెండు యూనివర్సిటీల పరిధిలో ఎంత వ్యత్యాసం ఉందో అంచనా వేయొచ్చు.