* జపాన్‌కు చెందిన ఏసీల తయారీ దిగ్గజ సంస్థ డైకిన్ ఇండస్ట్రీస్ అనుబంధ డైకిన్ ఎయిర్ కండిషనింగ్ ఇండియా ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో 75 ఎకరాలలో కొత్త ప్లాంటు నెలకొల్పనుంది. ఇప్పటికే సంస్థకు దేశంలో 2 ప్లాంట్లు ఉండగా, ఇది మూడోది. శ్రీసిటీలో భూమి లీజు హక్కు పత్రాలపై డైకిన్ ప్రతినిధులు సంతకాలు చేశారు. డైకిన్ ఇండియా ఎండీ, సీఈవో కన్వల్జిత్ మాట్లాడుతూ.. దక్షిణ అమెరికా, ఆఫ్రికా మార్కెట్లకు ఏసీలు, విడిభాగాలను ఎగుమతి చేసేందుకు ఇది ప్రాంతీయ కేంద్రంగా ఉపయోగపడేలా చేయాలన్నదే తమ ప్రణాళికన్నారు. దేశంలో కెల్లా వ్యాపార అనుకూల వాతావరణం, ఉత్తమ మౌలిక, రవాణా వసతులు ఉన్న శ్రీసిటీని తమ పెట్టుబడి గమ్యంగా ఎంచుకున్నామని తెలిపారు. 2023లో ఉత్పత్తి ప్రారంభించే ఈ యూనిట్ ద్వారా 3 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు వివరించారు. శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ.. రిఫ్రిజిరేటర్, ఏసీ రంగంలో ప్రఖ్యాతిగాంచిన డైకిన్ గ్రూపు సంస్థ దక్షిణ భారతదేశంలో తొలి ఉత్పత్తి కేంద్రాన్ని శ్రీసిటీలో నెలకొల్పడం హర్షణీయమన్నారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) కింద లబ్ధి పొందేందుకూ డైకిన్ దరఖాస్తు చేసింది. ఈ ప్లాంటుపై సంస్థ రూ.800-1000 కోట్లు పెట్టుబడి పెడుతుందని అంచనా.
* గోదావరి బయోరిఫైనరీస్ అనే కంపెనీ ఐపీఓకి దరఖాస్తు చేసుకుంది. ఈ మేరకు సంబంధిత పత్రాలను సెబీకి సమర్పించింది. ఇష్యూలో భాగంగా రూ.370 కోట్లు విలువ చేసే తాజా షేర్లతో పాటు…65,58,278 ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) కింద విక్రయించనున్నారు. ఓఎఫ్ఎస్లో భాగంగా సామిర్ శాంతిలాల్ సోమయ, సోమయ ఏజెన్సీస్ చెరో ఐదు లక్షల షేర్లు, మండల క్యాపిటల్ 49.27 లక్షల షేర్లు, ఫిల్మీడియా కమ్యూనికేషన్ సిస్టమ్స్ మూడు లక్షల షేర్లు, సోమయ ప్రాపర్టీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ 1.31 లక్షల షేర్లు, లక్ష్మీవాడీ మైన్స్ అండ్ మినరల్స్ రెండు లక్షల షేర్లను విక్రయించనుంది. అయితే కంపెనీ ప్రీ-ఐపీఓ ప్లేస్‌మెంట్‌కి కూడా ప్రయత్నాలు చేస్తోంది. ఒకవేళ అందులో సఫలమైతే.. ఐపీఓకి వచ్చే తాజా షేర్ల సంఖ్య తగ్గే అవకాశం ఉంది.
* పెట్రోల్ బ్యాంకులో ఫ్యూయల్, లూబ్రికెంట్ ఆయిల్ నింపుకుని ఫాస్టాగ్ కోడ్ ద్వారా పెట్రోల్ బిల్లు చెల్లించొచ్చు. కేంద్ర పెట్రోలియం సంస్థ హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) ఇందుకోసం ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంకుతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఫాస్టాగ్ ద్వారా పెట్రోల్ బిల్లుల చెల్లింపులను అనుమతించిన తొలిసంస్థగా హెచ్‌పీసీఎల్ నిలిచింది.
* భారత్ క్యాపిటల్ మార్కెట్ల చరిత్రలో మరో అద్భుతమైన ఘట్టం శుక్రవారం ఆవిష్కృతమయ్యింది. బీఎస్ఈ సెన్సిటివ్ ఇండెక్స్ (సెన్సెక్స్) తొలిసారిగా 60,000 పాయింట్ల శిఖరాన్ని అధిరోహించింది. అన్ని వైపుల నుంచి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నక్రమంలో బీఎస్ఈ సెన్సెక్స్ ట్రేడింగ్ ప్రారంభసమయంలోనే 60,000 పాయింట్లస్థాయిని దాటేసి 60,333 పాయింట్ల వద్ద కొత్త రికార్డును నెలకొల్పింది. చివరకు 163 పాయింట్ల లాభంతో 60,048 పాయింట్ల వద్ద ముగిసింది. మరో సూచి నిఫ్టీ 17,948 పాయింట్ల వద్ద నూతన గరిష్ఠస్థాయికి చేరింది. తుదకు 30 పాయింట్ల లాభంతో 17,853 పాయింట్ల వద్ద క్లోజయ్యింది.