* దేశ న్యాయవ్యవస్థలో మహిళలకు 50శాతం రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. న్యాయ కళాశాలల్లోనూ ఇదే తరహా రిజర్వేషన్ అవసరమని పేర్కొన్నారు. ప్రధాన న్యాయమూర్తి సహా నూతనంగా నియమితులైన తొమ్మిది మంది జడ్జిలకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయగా.. మహిళా న్యాయమూర్తులను ఉద్దేశించి జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడారు. ‘రిజర్వేషన్ మీ హక్కు.. దాన్ని డిమాండ్ చేయడానికి మీరు అర్హులు’ అని వెల్లడించారు. జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ..‘దిగువ కోర్టుల్లో మహిళా న్యాయమూర్తులు 30శాతం కంటే తక్కువే. హైకోర్టుల్లో అది 11.5 శాతం. సుప్రీంకోర్టులో 11-12 శాతం మాత్రం మాత్రమే ఉన్నారు. న్యాయవ్యవస్థలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ అవసరం. ఇది వేల సంవత్సరాల అణచివేతకు సంబంధించిన సమస్య’ అని అన్నారు. ‘దేశంలోని 1.7 మిలియన్ల న్యాయవాదులు ఉండగా.. అందులో 15శాతమే మహిళలు. రాష్ట్ర బార్ కౌన్సిళ్లలో ఎన్నికయ్యే మహిళా ప్రజాప్రతినిధులు 2శాతమే. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేషనల్ కమిటీలో ఒక్క మహిళా ప్రతినిధి కూడా ఎందుకు లేరని నేను ప్రశ్నిస్తున్నా’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ సమస్యలు త్వరితగతిన పరిష్కారం కావాలని ఆశించారు. మహిళా న్యాయవాదులు ఎదుర్కొనే సమస్యలపైనా జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడారు. అసౌకర్యమైన పని వాతావరణం. మహిళా వాష్‌రూమ్‌లు, బేబీ కేర్ సెంటర్ల గురించి చర్చించారు. ఆయా సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. నేడు కుమార్తెల దినోత్సవం సందర్భంగా మహిళకు శుభాకాంక్షలు తెలియజేశారు.
* సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌ను ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 30వ తేదీన ఉద్యోగ విరమణ చేసిన అనంతరం ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా బాధ్యతలు చేపట్టనున్నారు. దిల్లీలోని ఏపీ భవన్ నుంచి ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తారు. ముఖ్య సలహాదారుగా నియమితులైన ఆదిత్యనాథ్ దాస్‌కు కేబినెట్ మంత్రి హోదా కల్పిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
* తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల తేదీలను తిరుమల తిరుపతి దేవస్థానం ఖరారు చేసింది. అక్టోబర్ 7వ తేదీ నుంచి 15 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నట్లు తెలిపింది. కొవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ఏడాది కూడా ఏకాంతంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తితిదే పేర్కొంది. ఈ మేరకు అక్టోబర్ 5న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని జరపనున్నట్లు వెల్లడించింది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారి వాహనసేవల వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.
* ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్ర పరిశ్రమను ఇబ్బంది పెడుతోందన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్‌పై ద్వేషంతో ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆన్‌లైన్ టికెట్ల అమ్మకాలపై సినీ పెద్దల వినతిని ఆమోదిస్తే ప్రభుత్వంపై విషం చిమ్మడమేంటని ప్రశ్నించారు. సినిమా పరిశ్రమను ఇబ్బంది పెట్టే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. అందుకు తాజాగా విడుదలైన లవ్‌స్టోరీ సినామనే ఉదాహరణగా పేర్కొన్నారు. సినీ పరిశ్రమ గురించి పవన్ కల్యాణ్ నిజాలు తెలుసుకోవాలని పేర్ని నాని అన్నారు. ‘‘తెలంగాణలో 519 థియేటర్లుకు గాను 419 థియేటర్లు మాత్రమే తెరిచారు. ఏపీలో 1100 థియేటర్లలో 800 థియేటర్లు నడస్తున్నాయి. ఏపీలో 3రోజులుగా 510 థియేటర్లలో లవ్ స్టోరీ సినిమా ఆడుతోంది. ఈ సినిమాకు తెలంగాణలో కంటే ఏపీలోనే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. నిర్మాతలకు తెలంగాణ కంటే ఏపీలోనే ఎక్కువ షేర్ వస్తోంది. పవన్ మాటలు జగన్ మీద విషం చిమ్మే ప్రయత్నమని లవ్‌స్టోరి చిత్ర నిర్మాత నారంగ్ చెప్పాలి. యుద్ధవీరుడు, పోరాట యోధుడు పీకే వాస్తవాలు గ్రహించాలి. జగన్ మోహన్‌రెడ్డి సినీ పరిశ్రమను ఏం ఇబ్బంది పెట్టారో చెప్పాలి. జగన్‌పై విషం చిమ్మేందుకే పవన్ అవాకులు, చెవాకులు పేలారు’’ అని పేర్ని నాని విమర్శించారు..
* ‘గుల్-ఆబ్’ తుపాను పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆరా తీశారు. ఆంధ్రప్రదేశ్‌లో తుపాను పరిస్థితిపై ముఖ్యమంత్రి జగన్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కేంద్రం నుంచి సహాయాన్ని తక్షణం అందేటట్లు చూస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. అందరూ క్షేమంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్టు ప్రధాని ట్విటర్ ద్వారా వెల్లడించారు.
* ప్రతిదీ పారదర్శకంగా జరగాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఎలా తప్పు అవుతుందని ఏపీ జలవనరులశాఖ మంత్రి అనిల్‌కుమార్ ప్రశ్నించారు. ‘రిపబ్లిక్’ సినిమా ప్రీరిలీజ్ వేడుక సందర్భంగా సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ చేసిన వ్యాఖ్యల పట్ల ఏపీ మంత్రులు వరుసగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలో అనిల్‌కుమార్ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వానికి పెద్ద హీరో అయినా, చిన్న హీరో అయినా ఒకటేనని, పేర్కొన్నారు.
* పలు రాష్ట్రాల్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అన్ని వర్గాల వారిని మచ్చిక చేసుకునే ప్రయత్నాల్లో ఆయా రాష్ట్రాలు నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం కేబినెట్ విస్తరణకు సిద్ధమైంది. దాదాపు ఏడు నుంచి ఎనిమిది మంది కొత్తవారికి అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ మధ్యే కాంగ్రెస్ నుంచి భాజపాలో చేరిన జితిన్ ప్రసాదకు కేబినెట్‌లో స్థానం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
* మూడు రోజుల అమెరికా పర్యటన ముగించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం భారత్ చేరుకున్నారు. ఈ సందర్భంగా భాజపా జాతీయాధ్యక్షుడు జె.పి నడ్డాతో సహా పార్టీకి చెందిన పలువురు నేతలు ఆయనకు స్వాగతం పలికారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా మోదీ వివిధ దేశాధినేతలతో సమావేశమయ్యారు. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంతోపాటు క్వాడ్ సదస్సులో ఆయన పాల్గొన్న విషయం తెలిసిందే.
* ఏటా పండుగ సీజన్‌లో ప్రత్యేక విక్రయాలు చేపట్టే ఈ-కామర్స్ సంస్థలు.. ఈసారి నిర్వహణ తేదీల్లో పోటాపోటీగా ముందుకు సాగుతున్నాయి. ఫ్లిప్‌కార్ట్ ఏటా నిర్వహించే ‘బిగ్ బిలియన్ డేస్’ను అక్టోబరు 7-10 తేదీల్లో నిర్వహించనున్నట్లు తొలుత ప్రకటించింది. దీంతో వినియోగదారులను ముందుగానే ఆకట్టుకునే ఎత్తుగడతో అమెజాన్ ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ను అక్టోబర్ 4న ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.
* మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లా వశి తాలుకాలో ఆకాశం నుంచి అరుదైన రాయి కింద పడింది. స్థానిక రైతు ప్రభు నివృతి మాలి శుక్రవారం ఉదయం 6.30 గంటలకు పొలంలో పని చేసుకుంటున్నారు. సరిగ్గా అదే సమయంలో ఈదురు గాలుల మధ్య భారీ శబ్దంతో ఓ రాయి ఆయనకు ఎనిమిది అడుగుల దూరంలో పడింది. వెంటనే తహసీల్దార్ నర్సింగ్ జాదవ్‌కు ప్రభు సమాచారం ఇచ్చారు.
* మెదక్ జిల్లాలోని ఏడుపాయల వన దుర్గ భవాని ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. సింగూర్ ప్రాజెక్టు నుంచి నీటిని దిగువకు విడుదల చేయడంతో మంజీర నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో మధ్యతరహా ఏడుపాయల వనదుర్గ ప్రాజెక్టు పొంగి పొర్లుతోంది. అప్రమత్తమైన ఆలయ సిబ్బంది గుడిని మూసివేశారు. ఆలయం వైపు భక్తులు వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. మంజీర పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నీటి శాఖ అధికారులు సూచించారు. భక్తుల దర్శనార్థం రాజగోపురం వద్ద అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
* గులాబ్ తుపాను తీరాన్ని తాకే ప్రక్రియ ప్రారంభమైందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. తీరాన్ని తాకే ప్రక్రియ మరో మూడు గంటల్లో పూర్తవుతుందని తెలిపింది. శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నానికి 25 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమైనట్లు ప్రకటించింది. ప్రస్తుతం తీర ప్రాంతాల్లో 75 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నట్లు పేర్కొంది. తుపాను తీరం దాటే వేళలో 95 కి.మీ.వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది.