కరోనాతో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఆర్థిక పరిస్థితులు తారుమరయ్యాయి. వైరస్ కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్ కారణంగా చాలా మంది ఉపాధి కోల్పోయారు. ఫలితంగా అన్ని దేశాల్లో నిరుద్యోగత భారీగా పెరిగింది. ఎంతలా అంటే కేవలం ఒక్క ఫ్యూన్ పోస్ట్ ఏకంగా 15 లక్షల మంది అప్లై చేశారంటే.. నిరుద్యోగిత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మన దాయాది దేశం పాకిస్తాన్‌లో ఈ పరిస్థితి తలెత్తింది. ఇటీవల పాకిస్తాన్ కోర్టులో ఒక్క ప్యూన్ పోస్ట్ కోసం దరఖాస్తులు కోరగా.. 15 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, వారిలో ఎంఫిల్ చేసిన వ్యక్తులు కూడా ఉన్నారని పాకిస్తాన్ వార్తాపత్రిక డాన్ ఒక కథనాన్ని ప్రచురించింది. పాకిస్తాన్‌లో నిరుద్యోగం గరిష్ట స్థాయికి చేరుకున్నది. కరోనా వ్యాప్తి సమయంలో దాదాపు 2 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం పాక్‌లో నిరుద్యోగిత రేటు 16 శాతం దాటిందని పాకిస్తాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ ఎకనామిక్స్ (పీఐడీఈ) కొత్త గణాంకాలను బట్టి తెలుస్తున్నది. ప్రస్తుతం చదువుకున్న యువతలో 24 శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నారు. పాకిస్తాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ ఎకనామిక్స్ తన సర్వే వివరాలను సెనేట్ స్టాండింగ్ కమిటీకి వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం దేశంలో 40 శాతం గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్లు నిరుద్యోగులుగా ఉన్నారు. వీరిలో ఎంఫిల్ చదివిన వారు కూడా చాలా మంది ఉన్నారు. వీరిని కూడా గణాంకాల్లో చేర్చినట్లయితే నిరుద్యోగిత రేటు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. మరో నివేదిక పాకిస్తాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ లేబర్ ఫోర్స్ సర్వే (ఎల్‌ఎఫ్‌ఎస్) ప్రకారం, పాకిస్తాన్‌లో నిరుద్యోగం 2017-18లో 5.8శాతం నుంచి 2018-19లో 6.9 శాతానికి పెరిగింది. పురుషుల్లో నిరుద్యోగం 5.1 శాతం నుంచి 5.9 శాతానికి పెరగగా.. మహిళా నిరుద్యోగం 8.3 శాతం నుంచి 10 శాతానికి పెరిగింది. ఇక ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో కార్మికులు ఉన్న దేశాల్లో పాకిస్థాన్ 9 వ స్థానంలో ఉన్నదని ఎకనామిక్ సర్వే నివేదిక పేర్కొన్నది.
గుమాస్తా ఉద్యోగానికి 15లక్షల మంది దరఖాస్తు
Related tags :