Business

చైనాలో మరో సంక్షోభం. ఏపీ బాండ్లు వేలం-వాణిజ్యం

చైనాలో మరో సంక్షోభం. ఏపీ బాండ్లు వేలం-వాణిజ్యం

* రిజర్వ్ బ్యాంక్ దగ్గర బాండ్లను వేలం వేయడం ద్వారా మరో వెయ్యి కోట్ల బుణాన్ని సమీకరించిన ఏపీ ప్రభుత్వం.ఇప్పటికే కేంద్రం అదనపు బుణపరిమితిలో రూ.6000 కోట్ల మేర ఏపీ బుణం.6.94 శాతం వడ్డీ రేటుతో 20 ఏళ్లకు రూ.500 కోట్లు.6.93 శాతం వడ్డీ రేటుతో 17 ఏళ్లకు మరో రూ.500 కోట్లు సమీకరించిన ఏపీ.

* కరోనా కారణంగా అంతర్జాతీయ ప్రయాణికుల విమాన సర్వీసులపై విధించిన నిషేధాన్ని మరోసారి పొడిగించింది డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్.ఈ మేరకు అక్టోబర్ 31 వరకు నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు మంగళవారం వెల్లడించింది.అయితే కొన్ని ఎంపిక చేసిన మార్గాల్లో అధికారుల అనుమతితో అంతర్జాతీయ ప్రయాణాలను అనుమతించనున్నట్లు డీజీసీఏ స్పష్టం చేసింది.

* కరోనా సంక్షోభం నుంచి పరిస్థితులు క్రమంగా చక్కబడుతుండడంతో భారత్‌లో బంగారానికి గిరాకీ పుంజుకుంటోంది. భారత్‌లో ఇప్పటికీ ఆభరణాల దుకాణాలకు వెళ్లి బంగారం కొనేవాళ్లే ఎక్కువ. కానీ, కరోనా సమయంలో ఆన్‌లైన్‌లో పుత్తడిని కొనే ట్రెండ్ పెరిగింది. దీంతో ఆభరణాల దుకాణాల యజమానులు సైతం తమ పంథాను మార్చారు.తనిష్క్‌, కల్యాణ్‌ జువెల్లర్స్‌ ఇండియా లిమిటెడ్‌, పీసీ జువెల్లర్‌ లిమిటెడ్‌, సెంకో గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ ఆన్‌లైన్‌లో గోల్డ్‌ను అమ్మడం ప్రారంభించాయి. పైగా రూ.100లకు కూడా బంగారం అందిస్తుండడంతో చాలా మంది కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. నేరుగా వెబ్‌సైట్‌ లేదా డిజిటల్‌ గోల్డ్‌ ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా ఈ సంస్థలు ఆన్‌లైన్ విక్రయాలు జరుపుతున్నాయి. అయితే, కనీసం ఒక గ్రామ్‌ బంగారానికి సరిపడా డబ్బు చెల్లించగానే డెలివరీ అందజేస్తున్నారు.భారత్‌లో డిజిటల్‌ బంగారు విక్రయాలు కొత్తేమీ కాదు. మొబైల్‌ వ్యాలెట్లు, ఆగ్మంట్‌ గోల్డ్‌ ఫర్‌ ఆల్‌, సేఫ్‌ గోల్డ్‌ వంటి సంస్థలు ఇప్పటికే ఆన్‌లైన్‌లో పసిడిని విక్రయిస్తున్నాయి. అయితే, ఆభరణాల దుకాణాలు మాత్రం ఈ ప్రోడక్టులను విక్రయించడానికి ఇప్పటి వరకు వెనుకాడాయి. కానీ, కరోనా సంక్షోభంతో పంథాను మార్చుకోవాల్సి వచ్చింది.పండుగ సీజన్ నేపథ్యంలో భారత్‌లో బంగారు విక్రయాలు ఊపందుకున్నాయి. యువకులు డిజిటల్ గోల్డ్‌ వైపు మొగ్గుచూపుతుండడంతో.. ఆన్‌లైన్‌లోనూ విక్రయాలు పెరిగాయి. గత ఏడాది ఫిబ్రవరి తర్వాత ఆన్‌లైన్‌లో విక్రయాలు 200 శాతం పెరిగినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా రూ.3,000-4,000 మధ్య ఉండే నాణేలు, బిస్కట్లపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

* ప్రపంచవ్యాప్తంగా మ‌దుప‌రుల ఆద‌ర‌ణ‌ పొందిన పెట్టుబ‌డి మార్గాల్లో బంగారం కూడా ఒక‌టి. స్థిరమైన పెట్టుబడి సాధానంగా భావించి బంగారంలో ఎక్కువగా పెట్టుబడి పెట్టడానికి ప్రాధాన్యం ఇస్తుంటారు. బంగారంలో పెట్టుబ‌డులకు కేవలం భౌతిక రూపంలోనే బంగారం కొనుగోలు చేయాల్సిన అవ‌స‌రం లేదు. డిజిట‌ల్ రూపంలోనూ, కాగిత రూపంలోనూ కొనుగోలు చేయొచ్చు. ఆభ‌ర‌ణాలు, కాయిన్లు, బార్లు రూపంలో భౌతిక బంగారం ల‌భిస్తుంది. పేటీఎం, గూగుల్‌ పే వంటి మొబైల్‌ వ్యాలెట్లలో డిజిట‌ల్ గోల్డ్‌ను కొనుగోలు చేయొచ్చు. ఇవి కాకుండా గోల్డ్ బాండ్లు, గోల్డ్ ఈటీఎఫ్‌ల ద్వారా కాగిత రూపంలో కూడా బంగారాన్ని కొనుగోలు చేయొచ్చు. అయితే, బంగారం ఏ రూపంలో కొనుగోలు చేసినా పన్ను కట్టాల్సి ఉంటుంది. అయితే, ఏ రూపంలో కొనుగోలు చేస్తున్నాం? ఎంత కాలం పెట్టుబ‌డులు కొన‌సాగిస్తున్నాం? అనే అంశంపై ప‌న్ను ఆధార‌ప‌డి ఉంటుంది. ఉదాహరణకు భౌతిక బంగారంపైనా, గోల్డ్‌ బాండ్లపైనా ఒకేరకంగా పన్ను ఉండదు. కాబట్టి పెట్టుబడులు పెట్టేముందు ఏ రూపంలో బంగారం కొనుగోలు చేస్తే ఎంత పన్ను వర్తింస్తుందో తెలుసుకకోవడం మంచిది.

* ప్రపంచ కర్మాగారంగా పేరొందిన చైనాలో ఏ సంక్షోభమొచ్చినా అది ప్రపంచాన్ని కలవరపెడుతోంది. దివాలా అంచున ఉన్న స్థిరాస్తి సంస్థ ఎవర్‌గ్రాండ్‌ సమస్య ఇంకా సమసిపోకముందే.. మరో సంక్షోభం వచ్చి వాలింది. తీవ్ర విద్యుత్తు కొరత ఇప్పుడు డ్రాగన్‌ను పట్టిపీడిస్తోంది. కొన్ని ప్రధాన నగరాల్లో ట్రాఫిక్‌ లైట్లు సైతం వెలగడం లేదంటే పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. దీంతో ఐరోపా సహా ఆసియా దేశాలకు ప్రధాన ఎగుమతిదారుగా ఉన్న చైనాలో ఉత్పత్తి దెబ్బతినే అవకాశం ఉంది. ఇదే జరిగితే.. అంతర్జాతీయ సరఫరా గొలుసు దెబ్బతిని కనీసం కొన్ని నెలల పాటైనా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి..!