Movies

జగన్‌కు అల్లు అరవింద్ విన్నపం

జగన్‌కు అల్లు అరవింద్ విన్నపం

చిత్ర పరిశ్రమలో అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించాలని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని కోరారు. ‘రాజు తలుచుకుంటే వరాలకు కొదవా? దయచేసి నా విన్నపాన్ని ఇండస్ట్రీ విన్నపంగా మన్నించి సమస్యలు పరిష్కరించండి’ అని అన్నారు. అఖిల్‌, పూజా హెగ్డే జంటగా, ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ తెరకెక్కించిన చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. గోపీసుందర్‌ స్వరాలు సమకూర్చారు. జీఏ ఆర్ట్స్‌ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పకులుగా వ్యవహరిస్తుండగా, బన్నీ వాస్‌, వాసు వర్మ నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబరు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. గురువారం థియేట్రికల్ ట్రైలర్‌ విడుదల వేడుక జరిగింది. ఈ సందర్భంగా అల్లు అరవింద్‌ మాట్లాడుతూ.. ‘‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌కు ఇది మొదటి ఫంక్షన్‌. దీని తర్వాత ప్రీరిలీజ్‌ వేడుక, విడుదలైన తర్వాత సక్సెస్‌మీట్‌ తప్పకుండా ఉంటుంది. గీతాఆర్ట్స్‌లో విజయవంతమైన చిత్రాలు మేము కాదు ఇచ్చింది.. ప్రేక్షకులు మాకు ఇచ్చారు. తెలుగు ప్రేక్షకులు ఇచ్చిన ధైర్యాన్ని చూసి, బాలీవుడ్‌ సినిమాలు కూడా విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ వేదికగా ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిగారిని కోరేది ఏంటంటే.. ఫిల్మ్‌ ఇండస్ట్రీ అనేక ఇబ్బందుల్లో ఉంది. రాజు తలుచుకుంటే, వరాలకు కొదవా? దయచేసి మీరు తలుచుకుని, పరిశ్రమలో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపమని ఈ వేదికగా కోరుతున్నా. మీరు చిత్ర పరిశ్రమను ఎంత ప్రోత్సహిస్తారో, అన్ని సినిమాలు విడుదలకు సిద్ధమవుతాయి. నేను చేసే విన్నపాన్ని ఇండస్ట్రీ విన్నపంగా తీసుకోండి. ఒక మెస్సేజ్‌ను ఎంటర్‌టైనింగ్‌ రూపంలో ఈ సినిమా ద్వారా చెప్పారు. సినిమా విషయంలో ఎక్కడా రాజీపడకుండా చేశారు’’ అని అన్నారు.