* కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శన టికెట్లు ఉంటేనే తిరుమలకు అనుమతిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) స్పష్టం చేసింది. ఈ మేరకు తితిదే ప్రకటన విడుదల చేసింది. కొవిడ్ టీకా ధ్రువపత్రం, ఆర్టీపీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్ ఉండాలని తెలిపింది. చాలా మంది దర్శన టికెట్లు లేకుండా అలిపిరి నుంచి వెనుదిరుగుతున్నారని పేర్కొంది. ఆన్లైన్లో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఉచిత సర్వదర్శనం, వర్చువల్ సేవలు, శ్రీవాణి ట్రస్టు ద్వారా జారీ చేసే దర్శన టికెట్లు కలిగిన భక్తులకు మాత్రమే తిరుమలకు అనుమతిస్తామని తితిదే పేర్కొంది. దీంతో పాటుగా ఈ నెల 7 నుంచి 15 వరకు జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులు కొవిడ్ వ్యాక్సినేషన్ ధ్రువపత్రం, లేదా 72 గంటలకు ముందు చేయించుకున్న ఆర్టీపీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా తీసుకురావాలని సూచించింది.
* తీన్మార్ మల్లన్న జైలు నుంచి విడుదల కాగానే భాజపాలోకి ఆహ్వానిస్తామని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ వెల్లడించారు. చంచల్‌గూడ జైలులో ఉన్న తీన్మార్ మల్లన్నను ములాఖత్ ద్వారా కలిసిన అర్వింద్ అక్కడే మీడియాతో మాట్లాడారు. పెట్టిన కేసులే మళ్లీ మళ్లీ పెట్టొద్దని హైకోర్టు చీవాట్లు పెట్టినా ప్రభుత్వం తీరు మార్చుకోవడం లేదని అగ్రహం వ్యక్తం చేశారు. గత 37 రోజులుగా మారుమూల సెల్లో ఒక్కడినే ఉంచారని.. అయినా మల్లన్న ఆత్మ విశ్వాసంతో ఉన్నారని ఎంపీ తెలిపారు. మల్లన్నను జైలులో మానసికంగా వేధిస్తున్నారన్నారు. జైలు అధికారులు తీవ్రవాదిలా చూస్తున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అవినీతి గురించి మాట్లాడితే అక్రమంగా కేసులు బనాయించి జైలులో పెట్టారని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్ అప్రజాస్వామికంగా నియంతల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. హుజూరాబాద్ ప్రజలు కేసీఆర్‌కు బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
* ప్రపంచంలో అందరూ జీవితా రాజశేఖర్‌ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థం కావటం లేదని, తాము ఎవరూ చేయని తప్పులు చేశామా? అని ప్రశ్నించారు. అక్టోబరు 10న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జనరల్ సెక్రటరీగా ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు జీవిత విలేకరులతో మాట్లాడారు. ‘‘తప్పులు చేయడం మానవ సహజం. వాటిని మేము సరిదిద్దుకున్నాం. సినీ కళాకారుల సంఘానికి తోచిన సాయం చేశాం. ఎవరు ఏ ప్యానెల్లో ఉంటారన్నది వాళ్ల ఇష్టం. ఇదే విషయం మోహన్‌బాబుగారితో చెప్పాను. 24గంటలు పాటు బండ్ల గణేశ్ నా గురించి మాట్లాడారు. అందుకే ఆయనపై మాట్లాడాల్సి వచ్చింది. పృథ్వీ కూడా నాపై ఈసీకి ఫిర్యాదు చేశారు. ఆయన ఆరోపణలు హాస్యాస్పదం. అంతా జీవితా రాజశేఖర్‌నే టార్గెట్ చేస్తున్నారు. మంచి చేయడమే మేం చేస్తున్న తప్పా? గతంలో ‘మా’ ఎన్నికల్లో పాల్గొనాలని నరేశ్‌గారే మమ్మల్ని కలిశారు. ఆయన చెప్పిన మాటలు విని ఎన్నికల్లో పోటీ చేశాం. ఆయన ఎవరిని తిడితే వాళ్లను తిట్టాం. నరేశ్‌కు మద్దతుగా నిలిచాం. అయితే, ఈ ఆరోపణలు ఎన్నికల వరకే పరిమితం చేయాలని నరేశ్‌కు రాజశేఖర్‌గారు సూచించారు. ఆయన కూడా సరే అన్నారు. ఈ విషయంలోనే మాకూ నరేశ్‌కూ విభేదాలు తలెత్తాయి. డైరీ విడుదల కార్యక్రమం సందర్భంగా ఏం జరిగిందో మీరంతా చూశారు. అప్పటి నుంచే మా మధ్య విభేదాలు మొదలయ్యాయి. ‘మా’ కోసం నరేశ్ పనులు చేయలేదని నేను ఎక్కడా చెప్పలేదు’’ అని జీవిత అన్నారు.
* రాష్ట్రంలో ఎక్కడా మాదక ద్రవ్యాల సరఫరా లేకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. కాలేజీలు, యూనివర్సిటీల్లో మాదక ద్రవ్యాల ఆనవాళ్లే ఉండకూడదన్నారు. ఆ దిశగా తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో పర్యవేక్షణ ఉండాలన్నారు. ఎవరు పంపిణీ చేస్తున్నారు? ఎక్కడ నుంచి వస్తున్నాయ్.. అనే విషయాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. దీన్ని ఒక సవాల్‌గా తీసుకోవాలని సీఎం అన్నారు. అక్రమ మద్యం తయారీ, రవాణా సహా ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల అంశంపై సీఎం జగన్ సమీక్షించారు. ‘దిశ’ అమలు, మహిళలు, చిన్నారులపై నేరాల విచారణకు ప్రత్యేక కోర్టులు, పోలీసు బలగాల బలోపేతం, మాదకద్రవ్యాల నిరోధం తదితర అంశాలపై సీఎం ప్రధానంగా చర్చించారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, సీఎస్, డీజీపీ ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు.
* రెండు రోజుల క్రితం తన వాహనానికి చలాన్ విధించిన ట్రాఫిక్ ఎస్ఐ ఐలయ్యను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు. రాంగ్ రూట్లో వచ్చిన మంత్రి వాహనానికి సైతం నిబంధనల ప్రకారం చలాన్ విధించిన ట్రాఫిక్ సిబ్బందిని తన కార్యాలయానికి పిలిపించుకొని మరీ అభినందించారు. సామాన్య ప్రజలు, అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులకు ఒకే రకమైన నిబంధనలు వర్తిస్తాయని ఈ సందర్భంగా కేటీఆర్ స్పష్టం చేశారు.
* మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’ సిగ్గుపడేలా నటుడు నరేశ్ ప్రవర్తిస్తున్నారని ప్రకాశ్‌రాజ్ ఆరోపించారు. నరేశ్ అహంకారి అని.. ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రకాశ్‌రాజ్ ప్రచార కార్యక్రమాల్లో జోరుపెంచారు. ఇందులో భాగంగా అసోసియేషన్ సభ్యులతో తాజాగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో విష్ణు ప్యానల్, నరేశ్‌లపై ఆయన మండిపడ్డారు. ఈ సారి జరగనున్న ‘మా’ ఎన్నికల్లో పెద్దల ఆశీర్వాదం తనకి వద్దని.. పెద్దవాళ్లను సైతం ప్రశ్నించే సత్తా ఉన్నవాడే ‘మా’ అధ్యక్షుడిగా గెలవాలని పేర్కొన్నారు. ఆ సత్తా తనకి ఉందని.. అందుకే తాను ఈ సారి ఎన్నికల్లో గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాను తెలుగు వాడిని కాదంటూ నరేశ్ చేసిన వ్యాఖ్యలపై కూడా ప్రకాశ్‌రాజ్ మండిపడ్డారు.