సమీర్ వాంఖడే.. బాలీవుడ్‌లో చాలా మంది సెలబ్రిటీలకు మింగుడు పడని పేరిది. మాదక ద్రవ్యాల ‘తెర’చాటు వ్యవహారాలపై ఆయనో సింహస్వప్నం. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) ముంబయి జోనల్ డైరెక్టర్ అయిన సమీర్.. బాలీవుడ్‌లో డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు చేస్తూ డ్రగ్స్ డీలర్లు, సినీ ప్రముఖుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. కేవలం రెండేళ్ల వ్యవధిలో రూ. 17వేల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుకున్నారంటే ఆయన ఎంతటి నిఖార్సైన ఆఫీసరో అర్థం చేసుకోవచ్చు. ఆ మధ్య సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంతో సంబంధమున్న డ్రగ్స్ కేసు నుంచి.. తాజాగా నటుడు షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ అరెస్టు వరకు ఆయన చర్యలన్నీ సంచలనమే. విధి నిర్వహణలో భాగంగా ప్రపంచకప్ ట్రోఫీనే అడ్డుకున్న వ్యక్తి ఈయన..!
*** ఎవరీ సమీర్ వాంఖడే..
40ఏళ్ల సమీర్ వాంఖడే స్వస్థలం ముంబయి. తండ్రి కూడా పోలీసు అధికారే. 2008 బ్యాచ్ ఐఆర్‌ఎస్ అధికారి అయిన సమీర్.. ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ డిప్యూటీ కమిషనర్, జాతీయ దర్యాప్తు సంస్థ అదనపు ఎస్పీగా పనిచేశారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలెజెన్స్ జాయింట్ కమిషనర్‌గానూ వ్యవహరించారు. ఆ తర్వాత నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకు మారి ప్రస్తుతం ముంబయి జోనల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. వృత్తి పట్ల చాలా నిజాయతీగా ఉండే సమీర్.. నిర్భయంగా, క్రమశిక్షణగా పనిచేస్తారని తనతో పాటు పనిచేసిన అధికారులు చెబుతుంటారు. సినిమాలు, క్రికెట్‌ను అమితంగా ఇష్టపడే ఆయన.. విధి నిర్వహణకు వచ్చేసరికి మాత్రం అవేవీ పట్టించుకోరు.
*** సెలబ్రిటీలతో పన్నులు కట్టించి..
2010లో సమీర్ మహారాష్ట్ర సర్వీస్ టాక్స్ విభాగంలో పనిచేస్తున్న సమయంలో పన్నులు ఎగ్గొట్టిన 2500 మందిపై కేసులు పెట్టారు. అందులో 200 మంది సెలబ్రిటీలు కూడా ఉన్నారు. అక్కడ పనిచేసిన రెండేళ్లలో ఖజానాకు రూ.87కోట్ల పన్నులు రప్పించారు. ఆ తర్వాత కస్టమ్స్ విభాగంలో పనిచేసినప్పుడు కూడా కఠిన నిర్ణయాలే తీసుకున్నారు. విదేశాల నుంచి సెలబ్రిటీలు తెచ్చుకున్న వస్తువులకు పన్నులు చెల్లించేవరకు కస్ట్సమ్ క్లియరెన్స్ ఇచ్చేవారు కాదు. 2013లో విదేశీ కరెన్సీతో వస్తున్న ప్రముఖ సింగర్ మికా సింగ్‌ను అరెస్టు చేయడంతో అప్పట్లో ఆయన పేరు మార్మోగింది. పన్ను ఎగవేత కేసుల్లో అనురాగ్ కశ్యప్, వివేక్ ఒబెరాయ్, రామ్ గోపాల్ వర్మ సహా చాలా మంది సినీ ప్రముఖల ఇళ్లల్లో సోదా చేశారు.
*** ప్రపంచ కప్ ట్రోఫీని వదిలిపెట్టలేదు..
2011లో భారత క్రికెట్ జట్టు ప్రపంచ కప్ గెలిచి స్వదేశానికి తిరిగొచ్చిన సమయంలో ఆ ట్రోఫీని ముంబయి ఎయిర్‌పోర్టులో అడ్డుకున్నారు. ప్రపంప కప్ ట్రోఫీని పూర్తిగా బంగారంతో చేస్తారు. అందువల్ల దానికి కస్టమ్స్ సుంకం చెల్లించాల్సి ఉంటుంది. ఆ సుంకం చెల్లించిన తర్వాతే ట్రోఫీని తీసుకెళ్లేందుకు అనుమతినిచ్చారు. ఎన్‌సీబీలో చేరిన తర్వాత డ్రగ్స్ డీలర్లపై సమీర్ ఉక్కుపాదం మోపారు. గత రెండేళ్లలో ఆయన నేతృత్వంలో ఎన్‌సీబీ బృందం అనేక చోట్ల దాడులు జరిపి రూ.17వేల కోట్ల విలువైన మాదకద్రవ్యాలను పట్టుకుంది. నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంతో సంబంధమున్న డ్రగ్స్ కేసును బయటకు తీసుకొచ్చింది కూడా ఈయనే. ఆ సమయంలో సినీ నటి రియా చక్రవర్తిని స్వయంగా ఆయనే విచారించినట్లు కూడా సమాచారం. గతేడాది ఓ డ్రగ్ డీలర్ ముఠాను పట్టుకునే క్రమంలో నిందితులు చేసిన దాడిలో గాయపడ్డారు. తాజాగా ముంబయి తీరంలోని కార్డెలియో క్రూజ్ ఎంప్రెస్ నౌకపై జరిగిన రేవ్ పార్టీకి సమీర్ వాంఖడే తన సిబ్బందితో కలిసి ప్రయాణికుల మాదిరిగా వెళ్లి.. రెడ్ హ్యాండెడ్‌గా నిందితులను పట్టుకున్నారు. ప్రముఖ నటుడు షారూక్‌ఖాన్ కుమారుడు ఆర్యన్ సహా 9 మందిని అరెస్టు చేశారు.
అన్నట్టు.. సమీర్‌కు బాలీవుడ్‌తో వృత్తి పరంగానే కాదండోయ్, వ్యక్తిగతంగానూ ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన సతీమణి కూడా హీరోయినే. మరాఠీ నటి క్రాంతీ రేద్కర్‌ను సమీర్ 2017లో వివాహం చేసుకున్నారు. క్రాంతి రేద్కర్ పలు బాలీవుడ్ సినిమాల్లో నటించారు. 2003లో వచ్చిన గంగాజల్ సినిమాలో అజయ్ దేవగణ్‌తో కలిసి నటించారు.