తిరుమల తిరుపతి దేవస్థానం జంబో బోర్డుకు చుక్కెదురైంది. ఇంత పెద్ద బోర్డు టీటీడీ నిబంధనలకు విరుద్దమని పిటీషన్ దాఖలు కావడంతో ఈమేరకు ఇచ్చిన జీవోను ఏపీ హైకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది హైకోర్టు. కొత్తగా నియమితులైన టీటీడీ బోర్డు సభ్యుల్లో 18మందికి నోటీసులు జారీ చేసింది రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం. దీంతో ప్రత్యేక ఆహ్వానితుల వ్యవహారం సందిగ్దంలో పడింది. టీటీడీ బోర్డులో సభ్యులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ భారతీయ జనతా పార్టీ నేత భానుప్రకాశ్‌రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ప్రస్తుతం బోర్డు నియమించిన 24 మంది సభ్యుల్లో 14 మందిపై నేరారోపణలు ఉన్నాయని కోర్డుకు నివేదించారు. అంతేకాకుండా రాజకీయ నేపథ్యం ఉన్న నలుగురిని సభ్యులుగా నియమించారని పిటిషనర్ తరఫు న్యాయవాది అశ్విన్ కుమార్ వాదనలు వినిపించారు. 18 మంది సభ్యులను ఇంప్లీడ్ చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. పిటిషనర్ విజ్ఞప్తిని అంగీకరించిన ధర్మాసనం 18 మంది సభ్యులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణనను దసరా సెలవుల తర్వాత చేపడతామని తెలిపింది.
18మంది తితిదే బోర్డు సభ్యులకు ఏపీ హైకోర్టు నోటీసులు
Related tags :