Agriculture

ఇక్రిశాట్ మరో ఘనత. హేమ ఫోటోలు మార్ఫింగ్-తాజావార్తలు

ఇక్రిశాట్ మరో ఘనత. హేమ ఫోటోలు మార్ఫింగ్-తాజావార్తలు

* ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారి ఆలయంలో గురువారం నుంచి దసరా శరన్నవరాత్రి వేడుకలు ప్రారంభం కానున్నాయి. 15వ తేదీ వరకు వేడుకలు జరగనున్నాయి. మొదటి రోజు (రేపు) సన్నపనది కార్యక్రమాల అనంతరం ఉదయం 9 గంటల నుంచి అమ్మవారి దర్శనం ఉంటుంది. వివిధ అలంకరణలో భక్తులకు దుర్గమ్మ దర్శనమివ్వనున్నారు. 7వ తేదీన స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తారు. 8న బాలా త్రిపుర సుందరీ దేవిగా.. 9న గాయత్రీదేవిగా, 10న లలితా త్రిపుర సుందరీ దేవిగా.., 11న అన్నపూర్ణాదేవిగా.., అదే రోజు సాయంత్రం మహాలక్ష్మిదేవిగా దర్శనమిస్తారు. 12న సరస్వతీదేవిగా.., 13న దుర్గాదేవిగా.., 14న మహిషాసురమర్ధినిగా.., 15న రాజారాజేశ్వరి దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. కాగా 12వ తేదీన సరస్వతి దేవి అలంకరణ రోజున సీఎం జగన్మోహన్ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.

* కరవు ప్రాంతాల్లో వాతావరణ మార్పులను తట్టుకుని పండే 3 రకాల శనగ వంగడాలను విడుదల చేసినట్లు ఇక్రిశాట్‌ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ‘భారత వ్యవసాయ పరిశోధన మండలి’ (ఐసీఏఆర్‌) అనుబంధ సంస్థలతో కలిసి వీటిపై పరిశోధనలు చేసి సత్ఫలితాలు సాధించినట్లు వెల్లడించింది. ఈ విత్తనాలు పశ్చిమ, ఉత్తర భారత రాష్ట్రాల భూముల్లో పండేరకాలని స్పష్టం చేసింది. ఈ 3 రకాల విత్తనాల పేర్లు ‘బీజీఎం-4005, ఐపీసీఎల్‌4-14, ఐపీసీఎంబీ19-3. వీటి పంట సాగు కాలం 106 నుంచి 133 రోజులు. ఐపీసీఎల్‌4-14 రకం పంట హెక్టారుకు 16 క్వింటాళ్లు, ‘బీజీఎం-4005 హెక్టారుకు 17, ఐపీసీఎంబీ19-3 రకం పంట 21 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఎన్నో ఏళ్లుగా రైతులు పండిస్తున్న పాత రకాల విత్తనాల్లో జన్యువుల మార్పిడి ద్వారా కొత్త వంగడాలను సృష్టించారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వీటిని పండించగా.. పాత వంగడాలకన్నా 11 నుంచి 14.76 శాతం అధిక దిగుబడి వచ్చిందని ఐసీఏఆర్‌కు చెందిన శాస్త్రవేత్త డాక్టర్‌ ఎన్‌.పి.సింగ్‌ వివరించారు.

* హైదరాబాద్ నగరం బోరబండ ప్రాంతానికి చెందిన తిరుపతి అనూష కిర్గిజీస్తాన్ హెల్త్ యూనివర్సిటీలో ఎంబిబిఎస్ చదువుతుంది. అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆమె భారతదేశానికి తిరిగి వచ్చింది. ప్రస్తుతం తాను చదువుతున్న వైద్య విద్య కోర్సులో మొదటి మూడు సంవత్సరాల్లో 95 శాతం మార్కులతో ఉత్తమ ప్రతిభ కనబరిచింది. అయితే కరోనా నేపద్యంలో చదువును కొనసాగించే పరిస్థితులు లేకపోవడంతో తన తల్లి తో కలిసి కూరగాయలు అమ్మడం ప్రారంభించింది. పేద గిరిజన కుటుంబానికి చెందిన అనూష తండ్రి వాచ్మెన్ గా పని చేస్తున్నారు. తన వైద్య విద్య కోర్సు  ఫీజుల కోసం ఇబ్బందులు పడుతున్న విషయం మంత్రి దృష్టికి వచ్చింది. తన పేదరిక పరిస్థితుల నేపథ్యంలోనూ ఎంతో ఛాలెంజింగ్గా, వైద్య విద్య పై మక్కువతో విదేశాలకు వెళ్లి చదువుకునే ప్రయత్నం చేస్తున్న అనూష కి కేటీఆర్ అండగా నిలిచేందుకు నిర్ణయం తీసుకొన్నారు. ఈరోజు ఆమె వైద్య విద్యను కొనసాగించేందుకు అవసరమైన ఆర్థిక సహాయం చేశారు. అనూష ఎంబీబీఎస్ ఫీజుల బాధ్యత తీసుకుంటానని తెలిపిన కేటీఆర్, కోర్సు పూర్తి చేసుకొని డాక్టర్ గా తిరిగి రావాలన్నారు. ఈ సందర్భంగా అనూష కి ఆల్ ద బెస్ట్ చెప్పిన మంత్రి, ఆమె కు అన్నివిధాలుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అనూష వైద్య విద్యకు అండగా నిలిచిన మంత్రి కేటీఆర్ కి ఆమె కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.

* కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమయింది. బుధవారం సాయంత్రం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. పుట్టమన్ను సేకరించి నవధాన్యాలు విత్తి వేడుకలకు అంకురార్పణ చేస్తారు. ఈ నెల 15 వరకు ఉత్సవాలు కొనసాగున్నాయి. గురువారం సాయంత్రం మీన లగ్నంలో ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ధ్వజారోహణంతో ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలుకనున్నారు. రేపు రాత్రి నిర్వహించనున్న పెదశేష వాహన సేవతో స్వామివారికి వాహన సేవలు ప్రారంభమవుతాయి. తొమ్మిది రోజులపాటు వివిధ వాహనాలపై శ్రీవారు విహరించనున్నారు. ఈ నెల 15న రాత్రి ధ్వజారోహ‌ణ‌తో బ్రహ్మోత్సవాలు ముగియ‌నున్నాయి. క‌రోనా కార‌ణంగా శ్రీవారి బ్రహ్మోత్సవాల‌ను ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలను టీటీడీ అధికారులు రద్దు చేశారు.

* రైతుల హక్కులను ఊడలాక్కుంటున్నారని, ఒక పద్ధతి ప్రకారం వారిపై దాడులు జరుపుతున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. నలుగురు రైతులతో సహా ఎనిమిది మందిని పొట్టనపెట్టుకున్న లఖింపూర్ హింసాత్మక ఘటనలో బాధిత కుటుంబాలను పరామర్శించి, సంఘీభావం తెలిపేందుకు రాహుల్ ప్రతినిధి బృందం బుధవారం ఆ ప్రాంతంలో పర్యటించనుంది. ఢిల్లీ నుంచి లక్నో బయలుదేరే ముందు రాహుల్ మీడియాతో మాట్లాడుతూ, 144 సెక్షన్ ప్రకారం నలుగురు లేదా ఐదుగురు గుమిగూడరాదని, అందుకు అనుగుణంగానే తమలో ముగ్గురు అక్కడ పర్యటిస్తారని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుపిస్తూ, ఒక పద్ధతి ప్రకారం రైతుల హక్కులను దోచుకుంటున్నారని అన్నారు.

* రైతుల పొట్టిగొట్టి కేంద్రం తీసుకువచ్చే చట్లాలు చాలా ప్రమాదకరమైనవని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ ఆనాడు సోనియా, రాహుల్ గాంధీలు పార్లమెంట్‌లో వ్యతిరేకించారన్నారు. అప్పటి నుంచి రైతులు దీక్షలు, ధర్నాలు చేస్తున్నా కేంద్రంలో చలనం రాలేదన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రైతులను బయటకు రానివ్వడం లేదని, పోలీసులతో అడ్డుకుంటున్నారని విమర్శించారు. యూపీ ఘటనలో కేంద్రమంత్రి కొడుకును ఇప్పటి వరకు పోలీసులు అరెస్ట్ చేయలేదని మండిపడ్డారు. పార్లమెంట్‌లో రైతుల కోసం రాహుల్ గాంధీ పోరాటం చేస్తుంటే.. ఇక్కడ టీఆర్ఎస్, బీజేపీ డ్రామాలు ఆడుతున్నాయని, బీజేపీ, కేసీఆర్, జగన్ ముగ్గురూ ఒక్కటేనని జగ్గారెడ్డి విమర్శించారు.

* చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలకు పార్టీ రంగులు తొలగిస్తున్నట్లు హైకోర్టులో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రమాణపత్రం దాఖలు చేసింది. భవిష్యత్తులో ఏ ప్రభుత్వ భవనానికీ పార్టీ రంగులు వేయబోమంటూ రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఈ మేరకు పంచాయతీరాజ్‌ ముఖ్య కార్యదర్శి జి.కె.ద్వివేది ప్రమాణపత్రం దాఖలు చేశారు. పార్టీ రంగులు తొలగించి ప్రమాణపత్రం దాఖలు చేయాలని గతంలో కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు నేడు ప్రభుత్వం ప్రమాణ పత్రం దాఖలు చేసింది. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేస్తున్నారంటూ జై భీమ్‌ జస్టిస్‌ కృష్ణా జిల్లా అధ్యక్షుడు కోర్టులో పిల్‌ వేశారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాది జడ శ్రావణ్‌ కుమార్‌ వాదనలు వినిపించారు.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం భారీ నష్టాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ట్రేడింగ్‌ ప్రారంభించిన సూచీలు కొద్దిసేపటికే నేలచూపులు చూశాయి. అక్కడి నుంచి మధ్యాహ్నం వరకు ఊగిసలాట ధోరణిలో సాగి.. ఐరోపా మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో పూర్తిగా నష్టాల్లోకి జారుకున్నాయి. అమెరికా ఫ్యూచర్‌ మార్కెట్లు సైతం భారీ నష్టాల్లో ట్రేడవుతుండడంతో దేశీయ సూచీల సెంటిమెంటు దెబ్బతింది. చమురు ధరలు పెరుగుతుండడం ఐరోపా మార్కెట్లపై ప్రభావం చూపుతోంది. మరోవైపు దేశీయంగా నేడు ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే, కొవిడ్‌ సంక్షోభం నేపథ్యంలో ఇప్పటి వరకు అవలంబించిన సర్దుబాటు ధోరణికి ఆర్‌బీఐ స్వస్తి పలకనుందనే సంకేతాలు మదుపర్లను కలవపెట్టాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే దేశీయ సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ భారీగా పతనమై రూ.75.02 వద్ద ఆరు నెలల కనిష్ఠ స్థాయి వద్ద ముగిసింది.

* సీపీఐ జాతీయ మహాసభలు వచ్చే ఏడాది అక్టోబర్ 14 నుంచి 18 వరకు విజయవాడలో జరగనున్నట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రకటించారు. ఈ ఏడాది ఏప్రిల్‌, మే నెలల్లో మహాసభలు జరగాల్సి ఉండగా కొవిడ్‌ వల్ల నిర్వహించలేకపోయినట్లు తెలిపారు. గ్రామస్థాయి నుంచి కేంద్ర స్థాయి వరకు అంశాలను మహాసభల్లో చర్చించనున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌ సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో చాడ వెంకట్‌ రెడ్డి, అజీజ్‌ పాషాతో కలిసి నారాయణ మీడియాతో మాట్లాడారు.

* మూవీ ఆర్టిస్స్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికల నేపథ్యంలో రోజుకో వివాదం తెరపైకి వస్తోంది. ఒకవైపు ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌, మరోవైపు మంచు విష్ణు ప్యానెల్‌ ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి దిగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం సినీ నటి హేమ ‘మా’ మాజీ అధ్యక్షుడు నరేశ్‌, నటి కరాటే కళ్యాణిలపై ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు లేఖ రాశారు. ఫొటోలు మార్ఫింగ్‌ చేసి, తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ‘‘ఈ నెల 10న జరుగుతున్న ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. నిన్న నాపై కుమారి కళ్యాణి అలియాస్‌ కరాటే కళ్యాణి, వి.నరేశ్‌లు కొన్ని అవాంఛితమైన, పరువుకు భంగం కలిగించే వ్యాఖ్యలతో ఒక వీడియోను విడుదల చేశారు. సినీ రంగానికి చెందిన నటీమణుల ఫొటోలను మార్ఫింగ్‌ చేసి, వాటికి అసభ్యకరమైన వ్యాఖ్యలను జోడించి, కొన్ని యూట్యూబ్‌ ఛానళ్లలో పోస్ట్ చేస్తున్నారు. గతంలో ఈ విషయమై నేను సైబర్‌సెల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశా. ఆ తరువాత ఇలాంటి ఘటనలు తగ్గాయి. తాజాగా ఆ ఘటనకు సంబంధించిన విషయాన్ని కళ్యాణి ప్రస్తావిస్తూ ‘నేను పోలీసుల వద్దకు వెళ్లినప్పుడు వారు నాకు సంబంధించిన కొన్ని అసభ్యకరమైన ఫొటోలను ముందుగా సోషల్‌మీడియా నుంచి తొలగించమని సలహా ఇచ్చినట్లు’ వ్యాఖ్యానించారు. కళ్యాణి వ్యాఖ్యలను నరేశ్‌ కూడా సమర్థించారు. నేను అమర్యాదకరమైన ఫొటోలను గ్రూపుల్లో పెట్టి, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నట్లు కూడా తాజా వీడియోలో పేర్కొన్నారు. అంతేకాకుండా అందుకు ఆధారాలున్నాయని, వాటిని బయటపెడతామని బెదిరించారు. నరేశ్‌ వైఖరి నన్ను అగౌరవ పరిచేలా, నా వ్యక్తిత్వాన్ని కించరిచేలా ఉంది. నాపై అసభ్యకరమైన ప్రచారాలు చేయకుండా కట్టడి చేయాలని మిమ్మల్ని కోరుతున్నా. మా ఎన్నికల ప్రచార సమయంలో సంస్థ ప్రతిష్ఠ దిగజారకుండా చూడాల్సిన బాధ్యత సభ్యులందరిపైనా ఉంది. వీరి వల్ల సంస్థకు చెడ్డ పేరు రావటమే కాకుండా, కొందరు సభ్యులు కూడా వీరి ధోరణిని అనుసరించే ప్రమాదం ఉంది. అందువల్ల వారికి ఈసారి ఓటు హక్కు లేకుండా క్రమశిక్షణ చర్యలు తీసుకొమ్మని కోరుతున్నా. కృతజ్ఞతలతో హేమ’’ అని లేఖలో పేర్కొన్నారు. తనపై నరేశ్‌, కళ్యాణిలు చేసిన వ్యాఖ్యల వీడియోలను తొలగించాల్సిందిగా ఆయా యూట్యూబ్‌ యాజమాన్యాల పైనా సైబర్‌ క్రైమ్‌ పోలీసులు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు హేమ తెలిపారు.