Politics

చంద్రబాబు మోసాలపై ధ్వజమెత్తిన జగన్-తాజావార్తలు

చంద్రబాబు మోసాలపై ధ్వజమెత్తిన జగన్-తాజావార్తలు

* నేటి నుంచి ఈ నెల 18 వరకు ‘వైఎస్సార్‌ ఆసరా’ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ‘వైఎస్సార్‌ ఆసరా’ రెండో విడత కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ అందరి బాధలు చూశానన్నారు. పొదుపు సంఘాలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని సీఎం అన్నారు. రెండో విడత కింద రూ.6,439.52 కోట్లు జమ చేస్తున్నాం. నాలుగు విడతల్లో రూ.25,512 కోట్లు జమ చేస్తాం. కోడ్‌ దృష్ట్యా వైఎస్సార్‌ జిల్లాలో నవంబర్‌ 6 నుంచి 15 వరకు ఆసరా పథకం అమలు చేస్తామన్నారు. రుణ మాఫీ చేస్తామన్న చంద్రబాబు.. డ్వాక్రా మహిళలను మోసం చేశారు. చంద్రబాబు మాట నమ్మి డ్వాక్రా మహిళలు అప్పుల్లో కూరుకుపోయారని సీఎం అన్నారు.

* ఆదిత్య బిర్లా ఏఎమ్‌సీ ఐపీఓ వాటాల కేటాయింపు గురువారం జ‌రిగే అవ‌కాశం ఉంది. సెప్టెంబరు 29న మొదలైన ‘ఆదిత్య బిర్లా ఏఎమ్‌సీ ఐపీఓ’ అక్టోబ‌ర్ 1న ముగిసింది. ఐపీఓ ముగిసే స‌మ‌యానికి 5.25 రెట్లు ఓవ‌ర్ సబ్‌స్క్రైబ్‌ అయ్యింది. ₹2,768 కోట్ల ప్రారంభ వాటా విక్ర‌య ఆఫ‌ర్‌లోని 2,77,99,200 షేర్ల‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. వాటికిగాను 14,59,97,120 షేర్ల‌ బిడ్‌లు దాఖలయ్యాయి. ఏఎమ్‌సీ ప‌బ్లిక్ ఇష్యూకు స‌బ్‌స్క్రైబ్ చేసుకున్న బిడ్డ‌ర్లు తమ దర‌ఖాస్తు స్థితిని బీఎస్ఈ వెబ్‌సైట్‌లో, ఐపీఓ అధికారిక రిజిస్ట్రార్ వెబ్‌సైట్ కె-ఫిన్‌ టెక్‌ ప్రైవేట్ లిమిటెడ్‌లో త‌నిఖీ చేసుకోవచ్చు. ఈక్విటీ షేర్లు కేటాయించిన త‌ర్వాత అక్టోబ‌ర్ 8 లోపు బిడ్డ‌ర్ల ఖాతాలో షేర్లు జ‌మ అవుతాయ‌ని తెలుస్తోంది. 11వ తేదీన ఆదిత్య బిర్లా ఏఎంసీ షేర్లు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో లిస్ట్‌ అవుతాయని సమాచారం.

* సాహిత్య రంగంలో ప్రతిష్ఠాత్మక నోబెల్‌ బహుమతి టాంజానియా నవలా రచయిత అబ్దుల్‌ రజాక్‌ గర్నాను వరించింది. వలసవాదంపై ఆయన రాజీలేని పోరాటంతో పాటు, శరణార్థుల వ్యథను కళ్లకు కట్టినందుకు గానూ రజాక్‌కు ఈ పురస్కారాన్ని అందిస్తున్నట్లు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ వెల్లడించింది.

* అమెరికా ప్రపంచంలోనే అత్యంత విలువైన నాణెన్ని ముద్రించనుంది. దీని విలువ ఒక ట్రిలియన్‌ డాలర్లు.. అంటే దాదాపు రూ.75లక్షల కోట్లు. అమెరికా రుణ నియంత్రణ సంక్షోభాన్ని ఈ కాయిన్‌తో ఎదుర్కోవాలని భావిస్తోంది. దీనిని ముద్రించేందుకు బైడెన్‌ సర్కార్‌ వడివడిగా అడుగులు వేస్తోంది. కానీ, ఆర్థిక రంగ నిపుణులు మాత్రం అమెరికా కరెన్సీ విలువ దెబ్బతింటుందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

* ఓవైపు తైవాన్‌ గగనతలంలోకి చైనా యుద్ధ విమానాల దూకుడు పెరుగుతున్న వేళ.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. చివరకు చైనాతో అగ్రరాజ్యం యుద్ధం చేసేలా ఉందని వ్యాఖ్యానించారు. అమెరికాలోని ప్రస్తుత బలహీన, అవినీతి ప్రభుత్వాన్ని చైనా ఏమాత్రం గౌరవించడం లేదని అన్నారు. త్వరలో చైనా, అమెరికా ఉన్నతస్థాయి అధికారులు స్విట్జర్లాండ్‌లో సమావేశం కానున్నారన్న వార్తల నేపథ్యంలో ట్రంప్‌ ఈ వ్యాఖలు చేయడం గమనార్హం. అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరిగిందని మరోసారి ట్రంప్‌ ఆరోపించారు. అవినీతి ప్రభుత్వం దేశాన్ని ఏలుతోందని విమర్శించారు. అఫ్గానిస్థాన్‌ నుంచి అమెరికా సేనల ఉపసంహరణ సమయంలో బైడెన్‌ ప్రభుత్వం అనుసరించిన తీరును కూడా ట్రంప్‌ తప్పుపట్టారు. ‘‘8,500 కోట్ల డాలర్ల విలువైన అత్యాధునిక సైనిక పరికరాలను అఫ్గాన్‌లో వదిలేసి వచ్చాం. ఇప్పుడు వాటిని చైనా, రష్యా రివర్స్‌ ఇంజినీరింగ్‌ ద్వారా సొంతంగా తయారుచేసుకుంటాయి’’ అని ట్రంప్‌ చెప్పారు.

* రాష్ట్రంలో సేంద్రియ సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి శాసనమండలిలో వెల్లడించారు. సేంద్రియ సాగు ప్రోత్సహాకాలపై ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. 2017-18 నుంచి మూడేళ్లుగా పథకం అమలు చేస్తున్నామని మంత్రి వివరించారు. 584 క్లస్టర్లు, 29,200 ఎకరాల విస్తీర్ణంలో సేంద్రియ సాగు అభివృద్ధి చేశామన్నారు. బడ్జెట్‌లో సేంద్రియ సాగుకు రూ.72 కోట్లు కేటాయించి రూ.25.98 కోట్లు వ్యయం చేశామని వివరించారు. రసాయన కూరగాయలు తినవద్దనే అవగాహన ప్రజల్లో పెరిగిందని పునరుద్ఘాటించారు. హైదరాబాద్‌ పరిధిలో మూడేళ్లలోనే 26వేల మిద్దె తోటలు పెరగడమే అందుకు నిదర్శమని వెల్లడించారు. జనగామ జిల్లా లింగాల ఘన్‌పూర్‌ మండలం ఎనబాదిలో మహిళలు 150 నుంచి 200 ఎకరాల్లో సేంద్రియ కూరగాయలు పండిస్తున్నారని సహజ పేరుతో విక్రయిస్తూ లాభాలు ఆర్జిస్తున్నారని మంత్రి నిరంజన్‌ రెడ్డి తెలిపారు. తనకు 37 ఎకరాల్లో సర్టిఫైడ్ అర్గానిక్‌ తోట ఉందని మండలిలో చెప్పడంతో ప్రజాపతినిధులకు మరింత అవగాహన కల్పించాలని ప్రొటెం ఛైర్మన్‌ భూపాల్‌ రెడ్డి మంత్రికి సూచించారు.

* ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమ్మను గవర్నర్‌ బిశ్వభూషణ్‌ దంపతులు దర్శించుకున్నారు. గవర్నర్ దంపతులకు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారికి గవర్నర్‌ తొలిపూజలు చేశారు. నవరాత్రుల్లో అమ్మవారి దర్శనం చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజల ఉపశమనం పొందాలన్నారు. కరోనా నుంచి విముక్తి కలగాలని దుర్గమ్మను ప్రార్థించినట్లు చెప్పారు. దసరా ఉత్సవాలను ప్రజలంతా ఆనందంగా జరుపుకోవాలన్నారు. భక్తులకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. గవర్నర్‌ తొలిపూజతో దుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారు భక్తులకు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా దర్శనమిస్తున్నారు.

* తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) బోర్డు అన్నమయ్య భవన్‌లో సమావేశమైంది. వైవీ సుబ్బారెడ్డి రెండోసారి ఛైర్మన్‌గా నియమితులయ్యాక తొలిసారిగా సమావేశం నిర్వహించారు. బోర్డులో మొత్తం 24 మంది సభ్యులు, నలుగురు ఎక్స్‌అఫీషియో సభ్యులు ఉండగా ఇవాళ్టి సమావేశానికి 18 మంది సభ్యులు నేరుగా హాజరయ్యారు. మిగిలిన వారు వర్చువల్‌గా పాల్గొన్నారు. జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి టెండర్ల ఖరారు, ఉద్యోగుల ఇళ్ల స్థలాలకు సంబంధించి సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. నేటి నుంచి జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలపై ఏర్పాట్లు, భక్తులకు దర్శనాలకు సంబంధించిన అంశాలూ చర్చకు రానున్నాయి.

* కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నిక భాజపా అభ్యర్థి ఖరారయ్యారు. తమ పార్టీ తరఫున పనతల సురేష్‌ పోటీ చేయనున్నట్లు ఏపీ భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. సురేష్‌ను అదిష్ఠానం ఎంపిక చేసినట్లు ఆయన ఓ ప్రకటనలో చెప్పారు. దివంగత ఎమ్మెల్యే డా.వెంకటసుబ్బయ్య ఆకస్మిక మరణంతో బద్వేలు ఉప ఎన్నిక అనివార్యమైంది. అధికార పార్టీ తరఫున వెంకటసుబ్బయ్య భార్య సుధ బరిలో ఉన్నారు. ఇక్కడ ఈ నెల 30న పోలింగ్, వచ్చే నెల 2న ఓట్ల లెక్కింపు జరగనుంది. తెదేపా, జనసేన ఉప ఎన్నికకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.