Business

హైదరాబాద్‌లో డీజిల్ ధర రికార్డు-వాణిజ్యం

హైదరాబాద్‌లో డీజిల్ ధర రికార్డు-వాణిజ్యం

* హైదరాబాద్‌లో వంద దాటిన డీజిల్‌ ధరపెట్రో మంట కొనసాగుతున్నది. వరుసగా మూడో రోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి.బుధవారం లీటర్‌ పెట్రోల్‌పై 30 పైసలు, డీజిల్‌పై 35 పైసల చొప్పున పెంచిన దేశీయ చమురు మార్కెటింగ్‌ సంస్థలు మరోమారు సామాన్యుడిపై భారం మోపాయి. తాజాగా పెట్రోల్‌పై 32 పైసలు, డీజిల్‌పై 38 పైసలు వడ్డించాయి.దీంతో హైదరాబాద్‌లో లీటర్‌ డీజిల్‌ ధర రూ.100 దాటింది. తాజా పెంపుతో డీజిల్‌ ధర రూ.100.13కు చేరింది. ఇక పెట్రోల్‌ రూ.107.41కు పెరిగింది.నిన్న గృహావసరాలకు వినియోగించే గ్యాస్‌ సిలిండర్‌ ధరను రూ.15 పెంచిన విషయం తెలిసిందే.

* ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ మహీంద్రా అండ్‌ మహీంద్రా ఇటీవల విడుదల చేసిన సరికొత్త ఫ్లాగ్‌షిప్‌ కారు ఎక్స్‌యూవీ 700కు మంచి క్రేజ్‌ లభిస్తోంది. ఈ కారు బుకింగ్స్‌ను గురువారం ప్రారంభించగా హాట్‌కేకుల్లా బుక్‌ అయ్యాయి. కేవలం 57 నిమిషాల్లోనే 25వేల బుకింగ్స్‌ వచ్చినట్లు కంపెనీ తాజాగా వెల్లడించింది. ‘‘ఎక్స్‌యూవీ 700 కోసం ఈ ఉదయం 10 గంటలకు బుకింగ్స్‌ తెరిచాం. 57 నిమిషాల్లోనే 25వేల మంది ఈ కారును బుక్‌ చేసుకున్నారు. ఈ కారుకు వచ్చిన స్పందన చూసి ఎంతో ఆనందంగా, గర్వంగా ఉంది’’ అని మహీంద్రా అండ్‌ మహీంద్రా ఆటోమోటివ్‌ డివిజన్‌ సీఈవో విజయ్‌ నక్రా తెలిపారు. అటు సంస్థ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా కూడా ట్విటర్‌ వేదికగా సంతోషం వ్యక్తం చేశారు. కస్టమర్లకు తమ సంస్థపై ఎంత నమ్మకం ఉందో, తమ భుజాలపై ఎంత బాధ్యత ఉందో దీన్ని చూస్తుంటే అర్థమవుతుందని ఆయన పేర్కొన్నారు. సెప్టెంబరు నెలాఖరులో ఎక్స్‌యూవీ 700 కారును విడుదల చేశారు. దీని ప్రారంభ వేరియంట్‌(ఎక్స్‌షోరూం) ధర రూ.11.99 లక్షలుగా.. టాప్‌ వేరియంట్‌ ధర రూ.21.09లక్షలుగా నిర్ణయించారు. దీనిని పెట్రోల్‌, డీజిల్‌ ఇంజిన్లతో తొమ్మది వేరియంట్లల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆల్‌వీల్‌ డ్రైవ్‌ ఫీచర్‌ కూడా ఉంది. ఐదు, ఏడు సీట్ల ఆప్షన్లలో లభిస్తుంది.

* మీరు ఎస్‌బీఐ ఖాతాదారాలా? ఐటీఆర్ దాఖ‌లు చేయాల‌నుకుంటున్నారా? అయితే ఎస్‌బీఐ యోనోయాప్‌లోని ట్యాక్స్‌2విన్ ఆప్ష‌న్ ద్వారా ఉచితంగా ఆదాయ‌పు ప‌న్ను దాఖ‌లు చేయోచ్చు. దేశీయ ప్ర‌ముఖ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యోనో యాప్ ద్వారా ఐటీఆర్ దాఖ‌లు చేసే స‌దుపాయాన్ని అందిస్తున్న‌ట్లు ఇటివ‌ల‌ ప్ర‌క‌టించింది. మీరు కూడా యోనోయాప్ ద్వారా ఉచితంగా ప‌న్ను దాఖ‌లు చేయాల‌నుకుంటే ఈ కింది తెలిపిన ప‌త్రాలు ఏర్పాటు చేసుకోవాలి.

యోనోయాప్ ద్వారా ఐటీఆర్ దాఖ‌లుకు కావ‌ల‌సిన ప‌త్రాలు..
1. పాన్ కార్డ్‌
2. ఆధార్ కార్డ్‌
3. ఫారం 16
4. ప‌న్ను మిన‌హాయింపు వివ‌రాలు
5. వ‌డ్డీ ఆదాయం స‌ర్టిఫికేట్లు
6. ప‌న్ను ఆదా పెట్టుబ‌డికి సంబంధించిన‌ ఫ్రూఫ్‌లు

* దేశీయ మార్కెట్లు గురువారం కళకళలాడాయి. ఆటో, స్థిరాస్తి రంగాల్లో వెల్లువెత్తిన కొనుగోళ్లతో బుల్‌ దూసుకెళ్లింది. సెన్సెక్స్‌ దాదాపు 500 పాయింట్లు పెరగ్గా.. నిఫ్టీ 17,800 మార్క్‌కు చేరువైంది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో ఈ ఉదయం సూచీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. దీనికి తోడు రేపటి నుంచి జరగబోయే ఆర్‌బీఐ ద్రవ్య పరపతి సమీక్ష, ఈ నెలలో వెలువడబోయే కంపెనీల త్రైమాసిక ఫలితాలపై సానుకూలంగా ఉన్న మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ముఖ్యంగా ఫైనాన్స్‌, ఆటోమొబైల్‌, రియల్టీ రంగాల షేర్లు రాణించడంతో సూచీలు రోజంతా లాభాల్లో కదలాడాయి. ఈ ఉదయం 59,633 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్‌ ఒక దశలో 59,914 పాయింట్లకు ఎగబాకింది. చివరకు 488 పాయింట్ల లాభంతో 59,677.83 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 144 పాయింట్లు లాభపడి 17,790 వద్ద ముగిసింది.