Devotional

గణనీయమైన వృద్ధిలో పయనిస్తున్న ఎస్వీబీసీ

గణనీయమైన వృద్ధిలో పయనిస్తున్న ఎస్వీబీసీ

కరోనా మహమ్మారి ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా మీడియా రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్తే… శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌ ( ఎస్వీబీసీ) మాత్రం ఆర్ధిక పరంగా లాభాలను గణిస్తూ విస్తృతమైన రేటింగ్‌తో దూసుకుపోతుంది. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వైభవం, హిందూ ధర్మ ప్రచారం కోసం 2008లో నాటి ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి టీటీడీ భక్తి ఛానల్‌ ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి టీటీడీ చైర్మన్‌గా ఉన్న సమయంలో జూలై 7, 2008 వ తేదీన అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ ఎస్వీబీసీని ప్రారంభించారు. సరిగ్గా 13సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఎస్వీబీసీ ఇప్పుడు కరోనా విపత్తును ఒక అవకాశంగా మలుచుకుని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అనూహ్యంగా చానల్‌ ఆర్థిక పరిపుష్టి వైపు అడుగులు వేస్తోంది

కరోనా సమయంలో తిరుమల సహా టీటీడీకి చెందిన అన్ని ఆలయాల్లోనూ భక్తులకు దర్శనాలు నిలిపివేశారు. ఈ నేపథ్యంలోనే కరోనా నియంత్రణకు వైద్య రంగం లౌకిక సేవలు అందిస్తే, టీటీడీ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో కరోనా నియంత్రణ కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ అనేక కార్యక్రమాలు ప్రారంభించింది. వీటినే ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజల్లోకి తీసుకు వెళితే ఎలా ఉంటుందని ఆలోచించింది. ఈ మేరకు టీటీడీ అధికారులు కార్యాచరణ సిద్ధం చేసి అమలు చేశారు. ఈ క్రమంలోనే ఎస్వీబీసీ ఏకధాటిగా 17 గంటల పాటు ప్రత్యక్ష ప్రసారం చేసిన కార్యక్రమం సుందరకాండ సంపూర్ణ అఖండ పారాయణ దీక్షకు వీక్షకులు, భక్తుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది.

యూట్యూబ్‌ లో లైవ్‌లో 10 వేలకు పైగా వ్యూస్‌ లైక్‌లు రావడంతో భగవద్గీత, విరాట పర్వం, కార్తీక మాస విశిష్టత తదితర కార్యక్రమాలను కూడా ప్రత్యక్ష ప్రసారం చేశారు. దీంతో లక్షల్లో వ్యూస్‌ రావడంతో తెలుగు ఆధ్యాత్మిక భక్తి చానళ్లలో ఎస్వీబీసీ అగ్రస్థాన్థంలో కొనసాగుతుంది. ఆయా కార్యక్రమాలు చూసిన అనేకమంది భక్తులు ఛానల్‌కు విరాళాలు ఇవ్వడానికి ముందుకొచ్చారు. చానల్‌ను ఆర్థికంగా మంచి లాభల్లో దూసుకుపోవాలనే ఆలోచనతో టీటీడీ ఇందుకోసం ప్రత్యేకంగా ట్రస్ట్‌ ఏర్పాటు చేసింది. ఈ ఏడాది కాలంలోనే ఎస్వీబీసీకి 31 కోట్ల రూపాయల విరాళాలు అందాయి..