* ఎయిరిండియా ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన విమానయాన సంస్థను దక్కించుకునేందుకు చాలా సంస్థలు బిడ్లు దాఖలు చేయగా.. టాటా సన్స్‌ను విజయవంతమైన బిడ్డర్‌గా ఎంపిక చేసినట్లు కేంద్ర పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (డీఐపీఏఎం-దీపమ్) కార్యదర్శి తుహిన్ కాంత పాండే శుక్రవారం అధికారికంగా వెల్లడించారు. టాటా సన్స్ దాఖలు చేసిన బిడ్ అన్నింటికంటే ఆకర్షణీయంగా ఉందని.. ఎయిరిండియా కొత్త యజమాని అదే కానుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కేంద్రం ప్రకటనతో ఆ ఊహాగానాలన్నీ నిజమయ్యాయి. దీంతో 68ఏళ్ల తర్వాత ఎయిరిండియా తిరిగి టాటాల చేతుల్లోకి వెళ్లనుంది. ఎయిరిండియాలో 100 శాతం వాటాలతో పాటు.. అనుబంధ సంస్థ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ సైతం పూర్తిగా టాటాలపరం కానుంది. అలాగే గ్రౌండ్ హాండ్లింగ్ కంపెనీ ‘ఎయిరిండియా శాట్స్ ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్(ఏఐఎస్‌ఏటీఎస్)’లోనూ టాటాలకు 50 శాతం వాటాలు దక్కనున్నాయి.
* 2021 ఆగస్టు ఆఖరుకు సంస్థకు రూ.61,562 కోట్ల రుణ భారం ఉండగా, విజయవంతమైన బిడ్డరు రూ.15,300 కోట్లను చెల్లించాల్సి వస్తుంది. మిగిలిన రూ.46,262 కోట్ల రుణభారాన్ని ఎయిరిండియా అసెట్ హోల్డింగ్ (ఏఐఏహెచ్‌ఎల్)కు బదిలీ చేస్తారు.
* దేశీయ విమానాశ్రయాల్లో దేశీయ ప్రయాణాలకు 4400, అంతర్జాతీయ ప్రయాణాలకు 1800 ల్యాండింగ్, పార్కింగ్ స్లాట్‌లు ఎయిరిండియాకు ఉన్నాయి. విదేశీ విమానాశ్రయాల్లో 900 స్లాట్‌లున్నాయి.
* ప్రస్తుతం ఎయిరిండియాలో ఉన్న ఉద్యోగులందరినీ టాటా సన్స్ ఏడాది పాటు విధుల్లో కొనసాగించాలి. రెండో సంవత్సరంలో వారికి స్వచ్ఛంద ఉద్యోగవిరమణకు అవకాశం ఇవ్వొచ్చు.
* ఎయిరిండియా బ్రాండ్‌ను, లోగోను ఐదేళ్ల వరకు టాటా సన్స్ ఇతరులకు బదిలీ చేయొద్దు. ఒకవేళ తర్వాత చేయాలనుకున్నా భారతీయులకే చేయాలి.
* ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ సరికొత్త ఆఫర్‌తో ముందుకొచ్చింది. స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై రూ.6వేలు క్యాష్‌బ్యాక్ ప్రకటించింది. రెండు విడతల్లో ఈ మొత్తాన్ని ఖాతాదారుడికి జమ చేయనుంది. 2జీ కస్టమర్లను 4జీలోకి ఆకర్షించడంలో భాగంగా ‘మేరా పెహ్లా స్మార్ట్‌ఫోన్’ ప్రోగ్రామ్ కింద ఈ ఆఫర్‌ను ప్రకటించింది. వచ్చే నెల జియో నుంచి జియోఫోన్ నెక్ట్స్ వస్తున్న వేళ ఎయిర్‌టెల్ ఈ ఆఫర్ ప్రకటించడం గమనార్హం. రూ.12వేలలోపు ధర ఉన్న వివిధ బ్రాండ్లకు చెందిన 150 స్మార్ట్‌ఫోన్ మోడళ్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. క్యాష్‌బ్యాక్ కోసం కస్టమర్ ప్రతినెలా రూ.249, ఆ పై మొత్తంతో క్రమం తప్పకుండా 36 నెలల పాటు రీఛార్జి చేయాలి. అప్పుడు తొలి 18 నెలల తర్వాత రూ.2వేలు, 36 నెలల తర్వాత మిగిలిన రూ.4వేలు క్యాష్‌బ్యాక్ కింద ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌లో జమ చేస్తారు. ఏడాది పాటు ఉచితంగా స్క్రీన్ రీప్లేస్‌మెంట్ సదుపాయం కూడా కల్పిస్తున్నారు. వీటితో పాటు ఎయిర్‌టెల్ థ్యాంక్స్ ప్రయోజనాల కింద వింక్ మ్యూజిక్, అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ 30 రోజుల ఫ్రీ ట్రయల్‌ను కూడా పొందొచ్చు. తమకు నచ్చిన స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవడంతో పాటు డిజిటల్ ఎక్స్‌పీరియన్స్ భారత పౌరులు పొందాలన్న ఉద్దేశంతో ఈ సదుపాయాన్ని తీసుకొచ్చినట్లు ఎయిర్‌టెల్ ఓ ప్రకటనలో తెలిపింది.
* దేశీయ మార్కెట్లోకి హీరో మరో మోటార్ సైకిల్ ‘ఎక్స్‌ప్లస్ 200 4వీ’ని ప్రవేశపెట్టింది. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ.1.28లక్షలుగా పేర్కొంది. అడ్వెంచర్ మోటార్ సైక్లింగ్‌లో ఎంట్రి లెవల్ వాహనమైన ఎక్స్‌ప్లస్‌కు ఫోర్‌వాల్వ్ టెక్నాలజీని వినియోగించింది. దీనికి 199.6 సీసీ సింగిల్ సిలిండర్, ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 18.8 బీహెచ్‌పీ శక్తిని, 17.35 ఎన్‌ఎం పీక్ టార్క్‌ను విడుదల చేస్తుంది. గతంలో ఉన్న టూవాల్స్ టెక్నాలజీ ఇంజిన్ 17.8 బీహెచ్‌పీ శక్తిని మాత్రమే విడుదల చేస్తుంది. కొత్త ఇంజిన్‌తో శక్తి ఆరుశాతం, టార్క్ ఐదు శాతం పెరిగాయి. ధరలో కూడా రూ.5000 ఎక్కువ.
* ‘‘ఎయిరిండియా కోసం టాటా గ్రూప్ బిడ్ గెలుచుకోవడం చాలా గొప్ప విషయం! ఎయిరిండియా పునర్నిర్మాణానికి గణనీయమైన కృషి అవసరమని అంగీకరిస్తున్నప్పటికీ.. ఈ పరిణామాలు విమానయాన పరిశ్రమలో టాటాగ్రూప్‌నకు బలమైన మార్కెట్ అవకాశాలు కల్పిస్తాయని విశ్వసిస్తున్నాం. ఒకప్పుడు జేఆర్‌డీ టాటా నాయకత్వంలో ఎయిరిండియా.. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన విమానయాన సంస్థగా ఖ్యాతి గడించింది. ఇప్పుడు ఎయిరిండియాకు అలాంటి పునర్ వైభవం తీసుకొచ్చేందుకు టాటాలకు మళ్లీ అవకాశం లభించింది. ఈ రోజు జేఆర్‌డీ టాటా మన మధ్యన ఉంటే ఎంతో ఆనందపడేవారు. ఈ అవకాశం కల్పించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు. వెల్‌కమ్ బ్యాక్, ఎయిరిండియా!’’ అని రతన్ టాటా రాసుకొచ్చారు.
* ఆర్‌బీఐ మరోసారి కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచడం వైపే మొగ్గుచూపింది. దీంతో రెపోరేటు 4 శాతంగా.. రివర్స్ రెపోరేటు 3.35 శాతంగా కొనసాగనున్నాయి. ఇలా వడ్డీరేట్లను మార్చకపోవడం ఇది వరుసగా ఎనిమిదోసారి. ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం, ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతున్న సంకేతాలు ఉన్నప్పటికీ.. ఆర్‌బీఐ మరోసారి సర్దుబాటు వైఖరి వైపే మొగ్గుచూపింది. కరోనాతో ప్రభావితమైన ఆర్థిక వ్యవస్థకు అండగా నిలిచేందుకు చివరిసారి ఆర్‌బీఐ రెపోరేటును మే 2020లో 4 శాతానికి కుదించింది. నాటి నుంచి యథాయథ స్థితిని కొనసాగిస్తూ వస్తోంది. ద్రవ్యోల్బణాన్ని కట్టడిలో ఉంచడానికే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ఆర్‌బీఐ పేర్కొంది. అక్టోబరు 6న ప్రారంభమైన ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) నిర్ణయాలను శుక్రవారం గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు.