గత సంవత్సరం నుంచి కరోనా మూలంగా ప్రపంచం సంక్షోభంలో కూరుకొని పోయింది. ఫలితంగా ఆరోగ్య, ఆర్థిక, సామాజిక అసమానతలు విస్తారమైనయి. అనారోగ్యం పాలయి, ఆర్థికంగా నష్టపోయి, అయినవారిని కోల్పోయి, ఉద్యోగాలు ఊడి, ఉపాధి లేక, సామాజిక ఒంటరితనం వంటివి అన్ని మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తున్నయి. మొత్తం వ్యాధులలో 15 శాతం మనోవ్యాధులే! మానసిక, నాడీ సంబంధ, మత్తు పదార్థ వినియోగ చికిత్స కోవిడ్ కారణంగా ప్రతిష్టంభనకు గురి అయింది. మానసిక అనారోగ్యం ఉన్న వారు, వారి కుటుంబం సామాజిక, విద్యా, ఉద్యోగపరంగా వివక్ష ఎదుర్కొంటున్నరు. చికిత్స అందటానికి సౌలభ్యాలు, ఆర్థిక వెసులుబాటు, సంరక్షకులు కొన్ని కారకాలు కాగా, వ్యాధిగ్రస్తుల అంగీకారం, సహాయనిరాకరణ కూడా అంతే పాత్ర వహిస్తయి. అల్ప మధ్య అదాయ దేశాలలో 75 నుంచి 95 శాతం ప్రజలు మానసిక ఆరోగ్య సేవలు అందుకొనలేక పోతుండగా, అభివృద్ధి చెందిన దేశాలలో కూడా అంత సంతృప్తికరంగా లేదు. మానసిక ఆరోగ్య చికిత్స నాణ్యతలోను లోపాలేనని పరిశోధనలు తెలుపుతున్నయి. ప్రభుత్వాలను సంవేదనాశీలం చేస్తే కూడా చికిత్సలో సంపూర్ణ సంఘటిత వైద్య, సామాజిక, మానసిక పరిష్కారాలు చోటు చేసుకోవటానికి ఇంకో దశాబ్దంనర పట్టవచ్చునని అవే పరిశోధనలు అభిప్రాయపడుతున్నయి. మే 2021 లో జరిగిన ప్రపంచ ఆరోగ్య సమావేశం అన్ని స్థాయులలో మానసిక ఆరోగ్య సేవలు పటిష్ట పరచవలసిన అవసరాన్ని ప్రభుత్వాలకు గుర్తు చేసింది. అందరికి మానసిక ఆరోగ్య సంరక్షణను ఒక వాస్తవం చేయాలని పిలుపు నిచ్చింది. ప్రపంచ మానసిక ఆరోగ్య సమాఖ్య (డబ్ల్యు ఎఫ్ ఎం ఎచ్) అధ్యక్షుడు డాక్టర్ ఇంగ్రిడ్ డానియేల్స్ 2021 సంవత్సరానికి “అసమాన ప్రపంచంలో మానసిక ఆరోగ్యం” అనే నినాదాన్ని ప్రకటించినరు. ఈ సమాఖ్య 1948 లో ఆవిర్భవించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్య రాజ్య సమితి, యునెస్కో తదితర సంస్థ లతో కలిసి పని చేస్తున్నది.
భారతదేశ జనాభాలో 14 శాతం ప్రజలు మానసిక సమస్యలతో బాధ పడుతున్నట్లు గణాంకాలు తెలుపుతున్నయి. అందులో మహిళల వాటా ఎక్కువ. మానసిక ఆరోగ్యానికి ఆర్థికాభివృద్ధికి సాపేక్ష సంబంధం ఉంటది. కనుక మానసిక ఆరోగ్యం ప్రాధాన్యతా అంశం అయింది. మన దేశం 1982లో జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమం ప్రవేశపెట్టింది. మానసిక ఆరోగ్య కేంద్రాలను పటిష్టపరుస్తూనే, క్రమంగా జిల్లా స్థాయికి విస్తరింప చేస్తున్నది. 2014లో జాతీయ మానసిక ఆరోగ్య విధానాన్ని ప్రకటించింది. మానసిక ఆరోగ్య చట్టం 1987 లోని లోపాలను సవరించి మెంటల్ హెల్త్ కేర్ ఆక్ట్ 2017 ను ఆమోదించింది. ఈ చట్టం కింద 19 రాష్ట్రాలలో మాత్రమే స్టేట్ మెంటల్ హెల్త్ అథారిటీలను నెలకొల్పగా మిగతా రాష్ట్రాలు తాత్సారం చేస్తున్నయి. క్లినికల్ సైకాలజిస్ట్ లను, స్పెషల్ ఎడ్యుకేటర్స్ ను రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పరిధిలోనికి తెచ్చింది. మిగతా సైకాలజిస్ట్ లను నేషనల్ కమీషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ ఆక్ట్ 2021 లో చేర్చింది. భారతదేశంలో ప్రభుత్వపరంగా 47 మానసిక వైద్యశాలలు, ఆని వైద్య కళాశాలలలో సైకియాట్రీ విభాగాలు ఉన్నయి. దేశంలో లక్ష మందికి 0.3 సైకియాట్రిస్ట్ లు, 0.07 సైకాలజిస్ట్ లు, 0.7 ఫార్మసిస్ట్ లు, 0.12 నర్స్ లు, 0.7 సోషల్ వర్కర్స్ ఉన్నరు. ఔషధ చికిత్స సైకియాట్రిస్ట్ లు మాత్రమే చేయగలరు, లేనివారికి ఇతర నిపుణులు చాలు. దీర్ఘకాల ఔషధ చికిత్స అవసరం ఉన్నవారికి ఫార్మసిస్ట్ లు కొనసాగించగలరు.
మానసిక ఆరోగ్యం పట్ల, కొన్ని పదాల పట్ల సమాజంలో అవగాహనా రాహిత్యం, తప్పుడు అభిప్రాయాలు ఉన్నయి. ఆందోళన, ఒత్తిడి, పిచ్చి, ఉన్మాదం, ఆవేశం, సర్దుబాటు లేనితనంతో పాటు, బాల్యంలో ఆటిజం, ప్రజ్ఞా వైకల్యం, బడిలో పిల్లలు అక్షరాలు ఒకదాని బదులు ఒకటి పలికినా, చదువులో ఇబ్బంది పడినా, పరీక్షలప్పుడు ఆందోళన చెందినా, వృద్ధులలో చింత, మతిమరుపు, పరాకు అవి అన్ని సైకాలజి పరిధిలో వచ్చే అంశాలే. శారీరక అనారోగ్యం వలెనే మానసిక అనారోగ్యం కూడా! మానసిక ఆరోగ్యానికి సంబంధించిన శాస్త్రాలలో సైకాలజీ వైద్యేతర శాస్త్రం, సైకియాట్రీ వైద్యశాస్త్రం (సైకలాజికల్ మెడిసిన్). ఇండియన్ సైకియాట్రిక్ సొసైటి 2019 సాధారణ ఎన్నికల సందర్భంగా పిచ్చి పట్టింది, మెంటల్ ఉంది, మెంటల్ హాస్పిటల్ కు పంపాలె వంటి మాటలు వాడకూడదని ఎన్నికల కమీషన్ కు, రాజకీయ నాయకులకు సూచించింది. మానసిక ఆరోగ్యం పట్ల సమాజంలోనూ, విద్యార్థులలోనూ చైతన్యం కలిగించవలసి ఉన్నది. మానసిక వికారాలకు ఎవరూ అతీతులు కారు. మానసిక చికిత్స అంటే సిగ్గు పడే విషయం కాదు. డబ్ల్యు ఎఫ్ ఎం ఎచ్ సెక్రెటరీ జనరల్ గాబ్రియేల్ ఇవ్బిజారో పిలుపు ఇచ్చినట్లు వ్యక్తులు, సమూహాలు అందరు మానసిక ఆరోగ్యంలో భాగస్వాములు కావాలె.
ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం : 10 అక్టోబర్
Related tags :