* ఐపీఎల్ 2021లో పేలవ ప్రదర్శన చేసిన పంజాబ్ కింగ్స్ జట్టు ఈ సారి కూడా ప్లేఆఫ్స్‌కు చేరుకోలేకపోయింది. ఆడిన 14 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు మాత్రమే సాధించి ఆరో స్థానానికే పరిమితమైంది. దీంతో వరుసగా ఏడు సీజన్లలో ప్లేఆఫ్స్‌కు వెళ్లని ఏకైక జట్టుగా నిలిచి ఈ మెగా టోర్నీలో చెత్త రికార్డును తమ పేరున నమోదు చేసుకుంది.
* వాతావరణ శాఖ ప్రకటించిన విధంగానే హైదరాబాద్‌లో ఈరోజు సాయంత్రం ఉరుములు.. మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఖైరతాబాద్, పంజాగుట్ట, లక్డీకాపూల్, సరూర్‌నగర్, చంపాపేట, సైదాబాద్, బేగంబజార్, నాంపల్లి, కోఠి, బషీర్‌బాగ్, సికింద్రాబాద్, ప్యారడైజ్, ఆల్వాల్, తిరుమలగిరి, బోయిన్‌పల్లి, మారేడ్‌పల్లి, చిలకలగూడ, ధూల్‌పేట, పురాన్‌పూల్, జియాగూడ, చైత్యనపురి, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్‌లో భారీ వర్షం కురిసింది. రహదారులపై పలు చోట్ల వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మలక్‌పేట, ఖైరతాబాద్, అంబర్‌పేట తదితర ప్రాంతాల్లో భారీ వర్షానికి ట్రాఫిక్ స్తంభించింది. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షం నుంచి తేరుకోకముందే మళ్లీ భారీ వర్షం కురవడం నగరవాసులను కలవరపెడుతోంది. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావొద్దని తెలిపారు. సహాయం కోసం కంట్రోల్ రూంను సంప్రదించవచ్చని వివరించింది. కంట్రోల్ రూం నెంబర్ 040 2111 1111ను సంప్రదించాలని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు.
* మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలకు ఇంకా 24 గంటల సమయం కూడా లేకపోవడంతో అటు ప్రకాశ్‌రాజ్ ప్యానెల్, ఇటు మంచు విష్ణు ప్యానెల్ తమ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి. ‘మా’ సభ్యులను ఆకట్టుకునేందుకు ఇరు వర్గాలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో తనయుడు మంచు విష్ణుకు ఓటు వేయాలని మోహన్‌బాబు ‘మా’ సభ్యులను కోరారు. ఈ మేరకు వారికి వాయిస్ మెస్సేజ్ పంపారు. ‘‘తెలుగు వాళ్లు ఒకటిగా ఉండాలనే ‘మా’ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ‘మా’ ఎన్నికల పరిస్థితి చూస్తే మనసుకు కష్టంగా ఉంది. అసలు ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకుందామని పెద్దలు అనేవారు. అయితే, కొంతమంది సభ్యులు రోడ్డునపడి నవ్వులపాలవుతున్నారు. ఎవరు ఏం చేసినా ‘మా’ అనేది ఒక కుటుంబం. విష్ణు గెలిచాక రెండు రాష్ట్రాల సీఎంలను కలుస్తాం. సినీ పరిశ్రమ కష్టాలను వారికి చెప్పుకుందాం. మేనిఫెస్టోలోని హామీలను విష్ణు నెరవేరుస్తాడనే నమ్మకం ఉంది. విష్ణు మీ కుటుంబ సభ్యుడు. ఓటు వేసే ముందు మనస్సాక్షితో ఆలోచించి ఓటు వేయండి’’ అని అన్నారు.
* ఏపీలో పేదలందరికీ ఇళ్ల పథకంపై హైకోర్టు తీర్పు చాలా బాధ కలిగించిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. దీనిపై ఉన్నత న్యాయస్థానానికి ఆశ్రయిస్తామని చెప్పారు. విజయనగరంలోని ఆనంద గజపతి ఆడిటోరియంలో నిర్వహించిన వైఎస్‌ఆర్ ఆసరా చెక్కుల పంపిణీలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడిన ఆయన ప్రభుత్వ వివరణ తీసుకోకుండానే తీర్పు ఇవ్వడం బాధాకరమన్నారు. ‘‘ప్రతి మహిళ ఇంటి యజమానిగా ఉండాలనే ఇళ్ల పథకం తీసుకొచ్చాం. కోర్టు తీర్పులకు ప్రభుత్వం వ్యతిరేకం కాదు. కేంద్ర విధివిధానాలతోనే ఇళ్ల పథకం చేపట్టాం. రాజ్యాంగ విరుద్ధంగా ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నాం. ఇళ్ల పథకాన్ని అడ్డుకుంటే ప్రజలకు దిక్కెవరు?రాజ్యాంగబద్ధంగానే సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం’’ అని బొత్స అన్నారు. ఇళ్ల నిర్మాణానికి పట్టణాల్లో సెంటు, గ్రామాల్లో సెంటున్నర స్థలాలు సరిపోవని, ఈ విషయంలో ప్రత్యేక కమిటీతో అధ్యయనం చేయించాలని హైకోర్టు నిన్న సూచించిన విషయం తెలిసిందే. ఆ ప్రక్రియ ముగిసే వరకు ఆ స్థలాల్లో నిర్మాణాలు చేపట్టవద్దని తీర్పు చెప్పింది.
* ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 45,818 మంది నమూనాలు పరీక్షించగా 629 కొత్త కేసులు నమోదయ్యాయి. ఎనిమిది మంది మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 797 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 8,134 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొంది. కొవిడ్ వల్ల ప్రకాశంలో ముగ్గురు, కృష్ణాలో ఇద్దరు, చిత్తూరు, తూర్పు గోదావరి, విశాఖపట్నంలలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.
* తెలుగు అకాడమీ ఫిక్స్‌డ్ డిపాజిట్ల గోల్‌మాల్ కేసులో మరో ముగ్గురిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. భూపతి, రమణారెడ్డి, సురభి వినయ్‌ను అదుపులోకి తీసుకొన్నారు. సురభి వినయ్ తెలుగు అకాడమీ మాజీ డైరెక్టర్ సోమిరెడ్డికి పీఏగా పనిచేశారు. రమణారెడ్డి ప్రధాన నిందితుడు సాయికి అనుచరుడిగా ఉన్నారు. భూపతికి ఎఫ్‌డీల నకిలీ పత్రాలతో సంబంధం ఉందని సీసీఎస్ పోలీసులు గుర్తించారు. ఇప్పటివరకు తెలుగు అకాడమీ కేసులో అరెస్టు అయిన వారి సంఖ్య 14కి చేరింది. రూ.64.5 కోట్ల కుంభకోణం కేసులో లోతైన దర్యాప్తు చేస్తున్న సీసీఎస్ పోలీసులు ఆధారాల కోసం సమగ్ర విచారణ జరుపుతున్నారు. కొట్టేసిన డబ్బును నిందితులు రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో ఈడీ అధికారులు సైతం రంగంలోకి దిగారు. నిందితులు మనీల్యాండరింగ్‌కు ఏమైనా పాల్పడ్డారా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.
* ముంబయి తీర ప్రాంతంలోని క్రూజ్ నౌక డ్రగ్స్ కేసు విషయంలో తనపై వస్తోన్న ఆరోపణలను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) తోసిపుచ్చింది. ఈ కేసు విషయంలో ఎన్‌సీబీ నిష్పాక్షికంగా వ్యవహరిస్తోందని సంస్థ ఉన్నతాధికారి జ్ఞానేశ్వర్ సింగ్ వెల్లడించారు. తమపై వస్తోన్న ఆరోపణలన్నీ నిరాధారమైనన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. మరోపక్క ఈ కేసుకు సంబంధించి బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ డ్రైవర్‌ను ఎన్‌సీబీ ప్రశ్నిస్తోంది.
* ఏపీలో విద్యుత్ సంక్షోభానికి సీఎం జగనే కారణమని పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ అన్నారు. రాష్ట్రం సమస్యను ఇతర దేశాలతో పోలుస్తారా అని ప్రశ్నించారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘విద్యుత్ సంక్షోభంపై ప్రధానికి రాసిన లేఖలో చైనా, యూరప్‌తో ఏపీని పోలుస్తారా?విద్యుత్ విషయంలో పొరుగున ఉన్న తెలంగాణతో పోల్చుకోలేదు. తెలంగాణలో విద్యుత్ వ్యవస్థ మెరుగ్గా ఉంటే చైనా సమస్య జగన్‌కు ఎందుకు?విభజన నాటికి ఏపీ మిగులులో ఉంటే.. తెలంగాణ లోటులో ఉంది. విద్యుత్ విషయంలో ఇప్పుడు తెలంగాణ మెరుగ్గా ఉంది.
* గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం నాగులపాడు నుంచి పర్చూరు వరకు గుంటూరు ఛానల్ పొడిగించాలని కోరుతూ రైతులు పాదయాత్ర చేపట్టారు. కాగా, ఓ ప్రభుత్వ కార్యక్రమానికి వెళుతూ హోంమంత్రి సుచరిత పాదయాత్ర వద్ద ఆగి రైతులతో మాట్లాడారు. ఛానల్ పొడిగింపునకు రైతుల నుంచి పొలాల సేకరణ చేయాలని రైతుల విజ్ఞప్తి చేశారు. గుంటూరు ఛానల్ పొడిగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హోంమంత్రి అన్నారు. ఛానల్ పనులు టెండర్ దశలో ఉన్నాయని చెప్పారు. వచ్చే వేసవిలో పనులు ప్రారంభించనున్నట్లు వారికి తెలిపారు.
* ఏపీలో పేదలందరికీ ఇళ్ల పథకంపై హైకోర్టు తీర్పు చాలా బాధ కలిగించిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. దీనిపై ఉన్నత న్యాయస్థానానికి ఆశ్రయిస్తామని చెప్పారు. ప్రభుత్వ వివరణ తీసుకోకుండానే తీర్పు ఇవ్వడం బాధాకరమన్నారు. ‘‘ప్రతి మహిళ ఇంటి యజమానిగా ఉండాలనే ఇళ్ల పథకం తీసుకొచ్చాం. కోర్టు తీర్పులకు ప్రభుత్వం వ్యతిరేకం కాదు. కేంద్ర విధివిధానాలతోనే ఇళ్ల పథకం చేపట్టాం. రాజ్యాంగ విరుద్ధంగా ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నాం. ఇళ్ల పథకాన్ని అడ్డుకుంటే ప్రజలకు దిక్కెవరు?రాజ్యాంగబద్ధంగానే సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం’’ అని బొత్స అన్నారు.
* హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారం జోరందుకుంది. అధికార తెరాస తరఫున మంత్రులు, ఇతర నేతలు రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే అక్కడ ప్రచారాన్ని ముమ్మరం చేసిన మంత్రి హరీశ్‌రావు లక్ష్మాజీపల్లిలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా భాజపాపై విమర్శలు గుప్పించారు. భాజపా హయాంలో పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు భారీగా పెంచుతూ సామాన్యుడి నడ్డి విరుస్తున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. ‘‘ఈటల రాజేందర్ ఆరుసార్లు గెలిచారు.. ఆయనకు వ్యాపారం కూడా ఉంది. ఇక్కడి నుంచి సుదీర్ఘకాలంగా ప్రాతినిధ్యం వహించినా ఈటల ఏమీ చేయలేదు’’ అని చెప్పారు.
* ఏపీలోని జగనన్న కాలనీల్లోని మౌలికవసతుల అంశంలో ప్రభుత్వ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రతిపక్షాలు, కోర్టులపై నిందలు వేయడమేంటని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. శనివారం ఆయన దిల్లీలో మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి కనీస చిత్తశుద్ధిలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. హైకోర్టు తీర్పుపై ప్రభుత్వంలో కొంతమంది వక్రభాష్యాలు పలుకుతున్నారన్నారు. కోర్టులు, ప్రతిపక్షాలపై బురద చల్లడం తప్ప చేసిందేమిటని ప్రశ్నించారు.
* శంషాబాద్ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి వద్ద కస్టమ్స్ అధికారులు బంగారం పట్టుకున్నారు. దోహా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు అక్రమంగా తీసుకువచ్చిన 528 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎవరికీ తెలియకుండా ఫేస్‌క్రీమ్ డబ్బాల్లో నిందితుడు ఈ బంగారాన్ని తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. బంగారం విలువ రూ.20.44 లక్షలు ఉంటుందని అధికారులు వెల్లడించారు.
* వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లో లఖింపుర్ ఖేరి ఘటనతో రాజకీయాలు వేడెక్కాయి. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన విమర్శలను తిప్పికొడుతూ.. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ మరోసారి చీపురుపట్టి ఆయనకు కౌంటర్ ఇచ్చారు. గత ఆదివారం లఖింపుర్ ఖేరిలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై కేంద్ర మంత్రి తనయుడికి చెందిన వాహన శ్రేణి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో నలుగురు రైతులతో సహా ఎనిమిది మంది మృతి చెందారు. ఆ క్రమంలో మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన ప్రియాంకను యూపీ పోలీసులు సీతాపూర్ గెస్ట్ హౌస్‌లో నిర్బంధించారు. ఆ సమయంలో ఆమె చీపురు పట్టి, తన గదిని శుభ్రం చేసుకున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.
* దేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసే క్రమంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి మూడు నెలలపాటు మూడు రకాల సిరంజీల ఎగుమతులపై పరిమితులు విధించింది. ఈ విషయమై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ‘అంత్యోదయ’ ఆశయ సాధనలో భాగంగా, దేశంలో అర్హులందరికీ వ్యాక్సిన్ అందిస్తామన్న హామీ నెరవేర్చే క్రమంలో.. దేశంలో సిరంజీల లభ్యతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
* నగరంలోని ఓ ప్రముఖ ఫార్మా సంస్థలో సోదాలపై ఐటీ శాఖ కీలక ప్రకటన చేసింది. సోదాల్లో రూ.142.87కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. మొత్తం 16 బ్యాంకు లాకర్లు గుర్తించినట్లు తెలిపింది. ఇప్పటి వరకు లెక్కల్లో చూపని రూ.550 కోట్లు ఆదాయం గుర్తించినట్లు ఐటీ శాఖ వెల్లడించింది. ఆరు రాష్ట్రాల్లో 50 ప్రాంతాల్లో సోదాలు జరిపినట్లు తెలిపింది. యూరప్, అమెరికాకు డ్రగ్స్ ఉత్పత్తులు ఎగుమతి చేస్తున్నట్లు ప్రకటించింది. సంస్థకు సంబంధించిన ప్రదేశాల్లోని పలు రహస్య స్థావరాల్లో లెక్కలకు సంబంధించిన పుస్తకాలు, నగదు, ఖాతాలు, నగదుకు సంబంధించిన రెండవ సెట్ పుస్తకాలు కనుగొన్నట్లు ఐటీ శాఖ పేర్కొంది.
* ఇషాన్ కిషన్.. ముంబయి ఇండియన్స్ కీలక ఆటగాళ్లలో ఒకడు. అయితే, ఐపీఎల్ రెండో దశలో కొన్ని మ్యాచ్‌ల్లో వరుసగా విఫలమయ్యాడు. దీంతో అతడిపై విమర్శలు వెల్లువెత్తాయి. టీమ్‌ఇండియాకు ఎంపికైన తర్వాత ఇషాన్ రిలాక్స్ అయ్యాడని, అందుకే పరుగులు చేయలేకపోతున్నాడని పలువురు మాజీ క్రికెటర్లు విమర్శించారు. వీటికి సమాధానం చెబుతున్నట్లుగా సన్‌రైజర్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఇషాన్ చెలరేగిపోయాడు. అనంతరం ఇషాన్ మాట్లాడుతూ.. ‘‘నువ్వు టీ20 మెగా టోర్నీకి ఓపెనర్‌గా ఎంపిక అయ్యావు. అందుకోసం సిద్ధంగా ఉండాలి. ఏ సవాలునైనా ఎదుర్కొనే విధంగా పూర్తిస్థాయిలో సమయాత్తం అయి ఉండు అని విరాట్ కోహ్లి నాతో చెప్పారు’ అని కిషన్ వెల్లడించాడు.
* గంటల వ్యవధిలో రూ.కోట్ల సంపదను సృష్టించడం ప్రముఖ మదుపరి, ఇండియన్ బిగ్‌బుల్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలాకే సాధ్యమనడంలో అతిశయోక్తి లేదు. ఆయన పెట్టుబడులు ఉన్న టైటన్ కంపెనీ షేరు విలువ గురువారం ఇంట్రాడేలో 9.32 శాతం పెరిగింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.17,700 కోట్లకు చేరింది. ఈ సంస్థలో ఝున్‌ఝున్‌వాలా, ఆయన సతీమణి రేఖాకు కలిపి 4.81 శాతం వాటాలున్నాయి. దీంతో వారి వాటాల విలువ ఏకంగా కొన్ని గంటల వ్యవధిలో రూ.854 కోట్లు పెరిగింది. ఇలా కొన్ని స్టాక్స్‌ను ఏళ్లుగా తన ఖాతాలో కొనసాగిస్తూ లాభాలను గడిస్తున్నారు బిగ్‌బుల్.
* సినీ పరిశ్రమ ఇప్పుడు అందరి నోట్లో నానడానికి కారణం నరేశ్‌నని నటుడు, ‘మా’ మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా మరోసారి ఆరోపించారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలపై తాజాగా ఆయన స్పందించారు. సభ్యులకు సేవ చేయాలనే ఆలోచనతోనే అందరూ అధ్యక్ష పీఠం కోసం పోటీ పడుతుంటారని ఆయన అన్నారు. అనంతరం.. రెండు ప్యానల్స్ మేనిఫెస్టోలో చర్చించిన అంశాలను తాను ఎప్పుడో ప్రారంభించానని తెలిపారు. ‘మా’ అధ్యక్షుడి పదవీ కాలం రెండేళ్ల నుంచి నాలుగేళ్లకు పెంచితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మొదటి రెండేళ్లు విష్ణు అధ్యక్షుడిగా.. ప్రకాశ్‌రాజ్ జనరల్ సెక్రటరీగా.. ఆ తర్వాత రెండేళ్లు విష్ణు జనరల్ సెక్రటరీగా.. ప్రకాశ్‌రాజ్ అధ్యక్షుడిగా పని చేసేలా చర్చలు జరిపితే ఎలాంటి గొడవలు ఉండవని అనుకుంటున్నాను’’ అని వ్యాఖ్యానించారు.