Fashion

మీరు ధ్యానం సరిగ్గా చేయలేకపోతున్నారా?

మీరు ధ్యానం సరిగ్గా చేయలేకపోతున్నారా?

ఎందుకు చాలామంది మెడిటేటివ్ స్థితిలోకి వెళ్లలేకపోతారంటే..!

కొంతమంది మెడిటేషన్ చేద్దామని మంచి ప్లేస్ చూసుకొని చాలా ప్రశాంతంగా కూర్చుంటారు. రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. “నేనిప్పుడు మెడిటేషన్ లో కూర్చున్నాను, ఆలోచనలు ఉండకూడదు” అని బలవంతంగా వాటిని ఆపడానికి ప్రయత్నిస్తారు.

ఏదైనా విషయాన్ని బలంగా ఆపితే, అది మరో మార్గంలో, మరో రూపంలో, మరో ఆలోచనగా దొంగదారిలో వస్తుంది. సరిగ్గా అదే జరుగుతుంది. ఆలోచనలు వద్దు అని రిజెక్ట్ చేసుకుంటూ కూర్చునే కొద్దీ, ఒకపక్క ఆలోచనలు రావటం, మరోపక్క వాటిని నెట్టివేయడం ఈ ప్రక్రియ కళ్లు మూసుకుని కూర్చున్నంత సేపూ జరుగుతూనే ఉంటుంది.

“నేను మెడిటేషన్‌లో కూర్చున్నాను” అనే ఒక ప్రత్యేకమైన భావన కలిగి ఉండటమే అసలు అతి పెద్ద సమస్య. మెడిటేషన్ అనేది సహజసిద్ధంగా జరగాల్సిన ప్రక్రియ. అందులో నేచురల్ గా మనం ఓ భాగమైపోవాలి. అలా భాగమైపోయినప్పుడు వచ్చే ఆలోచనల పట్ల ఎలాంటి పట్టింపు ఉండదు. ఆలోచనలను పట్టించుకోవడం ఆపేస్తే మెల్లగా వాటి సాంద్రత కూడా తగ్గిపోతుంది. కొంతసేపటికి ఆలోచనలు మరియు శ్వాస మందగిస్తాయి. నిజమైన ధ్యాన స్థితి ప్రాప్తిస్తుంది.

ఇక మరో విషయానికి వస్తే, ధ్యాన స్థితిలో ఉండగా తెలియకుండానే ప్రపంచంతో బంధం తెగిపోతుంది. అలా చుట్టూ శబ్దాలు, మనుషుల గురించి ఆలోచనలు, పరిస్థితుల గురించి చింతా అంతా తగ్గిపోయి ఓ నిశ్చలమైన స్థితి కి రాగానే.. ఈత రాని వ్యక్తి కాలువలో దూకితే ఎలాగైతే గిలగిల కొట్టుకుంటాడో అలాంటి ఆందోళన ఒక్కసారిగా మొదలవుతుంది.

ఎందుకు ఇలా జరుగుతుందో చూస్తే.. దీనంతటికీ మన మైండ్ కారణం. జ్ఞానేంద్రియాలు అయిన కళ్లు, చెవులు, ముక్కు, స్పర్శ వంటి వాటి ద్వారా సేకరించిన సమాచారంతో, గత అనుభవాలు, భవిష్యత్తు గురించి భయాలు వంటి వాటితో మన మైండ్ ఒక ఊహాజనిత ప్రపంచాన్ని నిర్మించి, అందులో మనకంటూ ఒక స్థానాన్ని, మనపట్ల మనకు ఒక అవగాహనను సృష్టిస్తుంది.

తాను తయారు చేసిన ప్రపంచం గురించి మనం నిరంతరం ఆలోచిస్తూ ఉంటే మైండ్‌కి తగినంత ఫీడ్ దొరికినట్లు, సో అది సంతోషంగా ఉంటుంది. ఎప్పుడైతే మైండ్‌తో సంబంధం లేకుండా ఓ అలౌకిక స్థితిలోకి మనం మెడిటేషన్ ద్వారా జారుకుంటామో, మైండ్ తన ఉనికిని కోల్పోయిన అభద్రతకు లోనవుతుంది. దాంతో ప్రపంచంతో సంబంధం తెగిపోవటం పట్ల మనకు అనిశ్చితమైన ఆలోచన మొదలవుతుంది. మైండ్ ఆ స్థితి నుండి మరో బలమైన ఆలోచన సృష్టించడం ద్వారా మనల్ని బయటకు లాగడానికి ప్రయత్నిస్తుంది. మళ్లీ మనకు చుట్టూ ఉండే మనుషుల గురించిై మన అనుభవాలు గురించి ఆలోచనలు యధావిధిగా రావడం మొదలవుతాయి.

ఈ మైండ్ చేసే మాయాజాలం గురించి తెలిసిన వ్యక్తులు చాలా సులభంగా ఈ మాయ నుండి బయటపడి ధ్యాన స్థితి ఆస్వాదించగలుగుతారు.