* హైదరాబాద్ లోని మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ నుంచి మహారాష్ట్రలోని షిర్డీ దేవాలయానికి మంగళవారం నుంచి రాజధాని, గరుడ ప్లస్ బస్సులను ప్రారంభిస్తున్నట్టు రంగారెడ్డి రీజియన్ రీజనల్ మేనేజర్ బీ వరప్రసాద్ సోమవారం తెలిపారు. రాజధాని ఏసీ బస్సు ఉదయం 5.30 గంటలకు ఎంజీబీఎస్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.30 గంటలకు షిర్డీకి చేరుతుందని తెలిపారు. ఈ బస్సులో పెద్దలకు టికెట్ ధర రూ.1,270, పిల్లలకు రూ.968 ధర ఉంటుందన్నారు. గరుడ ప్లస్ ఏసీ బస్సు సాయంత్రం 7.30 గంటలకు ఎంజీబీఎస్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు షిర్డీకి చేరుతుందని పేర్కొన్నారు. పెద్దలకు టికెట్ ధర రూ.1,422, పిల్లలకు రూ.1,060గా నిర్ణయించినట్టు వివరించారు.
* ఏపీ ప్రభుత్వం అధిక వడ్డీకి రిజర్వ్ బ్యాంక్ దగ్గర మంగళవారం సెక్యూరిటీ బాండ్లు వేలం వేసింది. 7.14 శాతం వడ్డీకి రూ.వెయ్యి కోట్లు 20 ఏళ్లలో చెల్లించే విధంగా అప్పు చేసింది. మరో రూ. వెయ్యి కోట్లు 7.13 శాతం వడ్డీకి 15 ఏళ్లలో చెల్లించే విధంగా రుణం సేకరణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం అదనంగా అనుమతించిన రూ.10,500 కోట్లలో.. ఇప్పటికే రూ.8వేల కోట్లు బాండ్ల వేలం ద్వారా ఏపీ ప్రభుత్వం సేకరించింది. వచ్చే వారంతో కేంద్రం అనుమతించిన అదనపు పరిమితి నిధులు మొత్తం వ్యయం అయ్యే అవకాశముంది. బాండ్ల వేలం ద్వారా సేకరించిన రూ.2వేల కోట్లతో మిగిలిన తమ పెన్షన్లు, వేతనాలు వస్తాయని ఉద్యోగులు, పెన్షనర్లు ఆశిస్తున్నారు.
* బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, పోస్టాఫీసు పొదుపు వంటి సురక్షితమైన పథకాలపై 5 – 6.5 శాతం వరకూ వడ్డీ వస్తోంది. అసలు ఏమాత్రం నష్టభయం ఉండొద్దనుకుంటే.. వచ్చే రాబడి 5 – 6.5 శాతం మధ్యే ఉంటుంది. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రాబడి మన భవిష్యత్తు అవసరాలు, ఆర్థిక లక్ష్యాలను ఏమాత్రం తీర్చలేదు. తక్కువలో తక్కువ 12 శాతం రాబడి ఉంటే.. ద్రవ్యోల్బణాన్ని అధిగమించి కొంతమేర కూడబెట్టుకోగలం. ఇది కొంత నష్టభయంతో ఉన్న పెట్టుబడి పథకాలతోనే సాధ్యం అవుతుంది. దీనికి మీరు డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్లను ఎంచుకోవచ్చు. వీటి ద్వారా దీర్ఘకాలంలో 12% – 13% రాబడి వచ్చే అవకాశం ఉంది. మీరు నెలకు రూ.15 వేలను 10 ఏళ్లపాటు మదుపు చేస్తే.. 13 శాతం రాబడి అంచనాతో.. రూ.33,15,554 అయ్యేందుకు వీలుంది! మరి డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్లు అంటే ఏంటి? వాటి ప్రయోజనాలేంటో చూద్దాం!
* కొవిడ్-19 సంక్షోభం వల్ల ఆన్లైన్ కొనుగోళ్లు పెరిగిన నేపథ్యంలో వినియోగదారుల ప్రయోజనాలు కాపాడేలా ఈ-కామర్స్ సంస్థలు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ(సీసీపీఏ) తెలిపింది. అందులో భాగంగా విక్రేతలకు సంబంధించి పూర్తి వివరాలను వినియోగదారులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. విక్రేతల చిరునామా, ఫిర్యాదుల అధికారి వివరాలు వంటి వివరాలను తప్పనిసరిగా ఉత్పత్తులతో జతచేయాలని సూచించింది. ఈ మేరకు సీసీపీఏ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమ వర్గాలకు మార్గదర్శకాలు జారీ చేసింది.
* ప్రజా భవిష్య నిధి(పీపీఎఫ్) నుంచి జాతీయ పొదుపు పత్రాలు (ఎన్ఎస్సీ) వరకు వివిధ రకాల పొదుపు పథకాలను పోస్టాఫీస్ అందిస్తుంది. ఇవి మార్కెట్ అస్థిరతతో ప్రభావితం కానందున, స్థిర ఆదాయం కోరుకునే మదుపుదార్లకు వంద శాతం భద్రతనిస్తూ సురక్షితమైన పెట్టుబడికి మార్గాలుగా ఉన్నాయి. ఈ పొదుపు పథకాలు పదవీ విరమణ, పిల్లల విద్య, వివాహం మొదలైన దశలను పరిగణనలోకి తీసుకుని, జీవితంలో వివిధ లక్ష్యాల కోసం పెట్టుబడి పెట్టేందుకు మదుపుదార్లను ప్రొత్సహిస్తాయి.