Politics

విజయసాయిపై రఘురామ వ్యాఖ్యలు. నానిని ఆపిన ఇంద్రకీలాద్రి అధికారులు-తాజావార్తలు

విజయసాయిపై రఘురామ వ్యాఖ్యలు. నానిని ఆపిన ఇంద్రకీలాద్రి అధికారులు-తాజావార్తలు

* వైసీపీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఢిల్లీలో మీడియా మీట్ నిర్వహించిన ఆయన విజయసాయిని ఢిల్లీకి పరిమితం చేయాలని జగన్ ఆలోచిస్తున్నారని వ్యాఖ్యానించారు. విజయసాయి సేవలను ఢిల్లీలో ఉపయోగించుకునేందుకే.. ఆయనను విశాఖకు దూరం చేస్తున్నట్లు తెలుస్తోందని చెప్పుకొచ్చారు. పార్టీ, ప్రభుత్వం కోసం తాను, విజయసాయి కలిసి ఢిల్లీలో పని చేస్తామని రఘురామ వ్యాఖ్యానించారు. కాగా.. పార్టీ, జగన్ ప్రభుత్వం కోసం కలిసి పనిచేస్తానని ఇలా ఆయన చెప్పడం ఇదే మొదటి సారేమో..! కరెంట్ కష్టాలపై : ఇదిలా ఉంటే.. ఏపీలో భవిష్యత్‌లో విద్యుత్ కష్టాలు ఎదుర్కొనాల్సి ఉందని ఎంపీ చెప్పుకొచ్చారు. విద్యుత్ సమస్య చాలా తీవ్రమైనదని.. దీనిపై సంబంధిత మంత్రి, అధికారులు మాట్లాడాలని.. కానీ సంబంధంలేని సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడడం ఏంటి..? అని ప్రశ్నించారు. జగనన్న ట్రూ చార్జ్‌తో ప్రజలకు కష్టాలు వస్తే.. ఇప్పుడు జగనన్న కరెంట్‌ కోత పేరుతో కొత్త పథకం అమలు మొదలైందన్నారు. ఈ కొత్త పథకం శ్రీకాకుళం జిల్లా నుంచే ఆరంభమైందన్నారు. కాగా.. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో గృహ వినియోగదారులకు విద్యుత్ కోతలు విధించిన విషయం తెలిసిందే.

* ఇంద్రకీలాద్రి వద్ద అధికారుల అత్యుత్సాహం..విజయవాడ ఎంపీ కేశినేని నాని వాహనాన్ని ఘాట్ రోడ్డు ప్రారంభంలో నిలిపివేసిన పోలీసులు..స్థానిక ఎంపీగా ప్రోటోకాల్ పాటించక పోవడం పై ఎంపీ అసహనం..తన కుటుంబ సభ్యులతో కలసి కాలి నడకనే ఇంద్రకీలాద్రి పైకి వెళ్లి పట్టు వస్త్రాలు సమర్పించి నడిచి కిందకు వచ్చిన ఎంపీ కేశినేని నాని వీఐపీ పాస్ లతో ఇతర వాహనాలను అనుమతిస్తూ ఎంపీ వాహనాన్ని అడ్డుకోవడంపై ఆగ్రహించిన ఎంపీ సహాయకులు..అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు.

* సిని‘మా’ బిడ్డలం ప్యానెల్‌ నుంచి గెలిచిన వాళ్లందరం రాజీనామా చేస్తున్నట్లు సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ ప్రకటించారు. మంచు విష్ణు ఇచ్చిన హామీలకు ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌ జరిగిందని ఆరోపించారు. రెండు రోజుల నుంచి జరుగుతున్న ఘటనలపై తన ప్యానెల్‌ సభ్యులతో చర్చించినట్లు తెలిపారు. పోస్టల్‌ బ్యాలెట్‌లో అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఎక్కడెక్కడి నుంచో మనుషులను తీసుకొచ్చారని అన్నారు. రాత్రికి రాత్రే ఫలితాలు మారాయని అన్నారు. తమ ప్యానెల్‌లోని సభ్యులంతా బయటకు వచ్చి, ‘మా’ సభ్యుల తరపున నిలబడతామని స్పష్టం చేశారు. ‘‘నేను మా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశా. అందుకు మంచు విష్ణు ఆమోదించను అని అన్నారు. నేను నా రాజీనామాను వెనక్కి తీసుకుంటా. కానీ, ఒక షరతు. అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ‘మా’ నియమ, నిబంధనలు మార్చి, ‘తెలుగువాడు మాత్రమే మా ఎన్నికల్లో పోటీ చేయాలి’ అనే నిబంధన తీసుకురాకపోతేనే ‘మా’ సభ్యత్వానికి నేను చేసిన రాజీనామాను వెనక్కి తీసుకుంటా. ఓటు వేయడానికో, ఎవరోఒకర్ని గెలిపించడానికో అయితే ‘మా’ సభ్యుడిగా ఉండటం నాకు ఇష్టం లేదు’’ అని ప్రకాశ్‌రాజ్‌ అన్నారు.

* మహిళలపై చెయ్యి వేస్తే నడిరోడ్డుపై కాల్చిపారేసే చట్టాలు రావాలని వైకాపా ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. అప్పుడే మృగాళ్లలో భయం ఏర్పడుతుందన్నారు. నెల్లూరుజిల్లా ఇందుకూరిపేట మండలంలో జరిగిన ఆసరా పథకం రెండోవిడత ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసన్నకుమార్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… దేశంలో మహిళలపై అఘాయిత్యాలు అధికమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్లపై తిరగాలంటేనే మహిళలు భయపడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. మహిళలపై దౌర్జన్యం చేసే మానవమృగాలను పక్క దేశాల్లో నడిరోడ్డపై ఉరితీస్తారని, భారత్‌లో అలాంటి కఠిన చట్టాలు ఎందుకు తీసుకురారని ప్రశ్నించారు. మహిళల రక్షణ కోసం చట్టాల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరముందని పేర్కొన్నారు. చట్టాలలో మార్పు కోసం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయనున్నట్టు చెప్పారు. మానభంగం చేసిన వారిని పట్టుకుని శిక్షిస్తే సరిపోదని, నడిరోడ్డుపై మర్మాంగాలు కోసి, కాళ్లు చేతులు నరికేస్తేనే వారిలో భయం వస్తుందన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ తీసుకొచ్చిన దిశ చట్టం ద్వారా కొంత వరకు మహిళలకు న్యాయం జరుగుతుందన్నారు.

* ఉత్తరప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరిలో చోటుచేసుకున్న ఉద్రిక్త ఘటనపై కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా రేపు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలవనున్నారు. రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్‌ సభ్యుల బృందం బుధవారం రాష్ట్రపతిని కలిసి లఖింపుర్‌ ఘటనపై వాస్తవాలతో కూడిన నివేదికను అందజేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాజ్యసభలో కాంగ్రెస్‌ పక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే, సీనియర్‌ నేతలు ఏకే ఆంటోనీ, గులాం నబీ ఆజాద్‌, అధిర్‌ రంజన్‌ చౌధరీ, కేసీ వేణుగోపాల్‌ తదితరులు ఈ బృందంలో ఉన్నారు. రేపు 11.30 గంటలకు వీరు రాష్ట్రపతిని కలవనున్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి.

* చైనాలోని పలు ప్రాంతాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు ఆ దేశానికి భారీ నష్టాన్ని మిగిల్చాయి. ఉత్తర చైనాలోని షాంక్సీ ప్రావిన్స్‌లో ఎడతెరపిలేకుండా కురిసిన వర్షాలకు 15 మంది మృతి చెందగా.. ముగ్గురు గల్లంతైనట్టు అధికారులు వెల్లడించారు. వరద ముంపు నేపథ్యంలో ఆ ప్రావిన్స్‌లోని దాదాపు 1.20లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు పేర్కొన్నారు. అక్టోబర్‌ 2నుంచి 7వరకు రికార్డు స్థాయిలో కురిసిన వర్షానికి దాదాపు 10లక్షల మందికి పైగా జనం ప్రభావితమైనట్టు అధికారులు తెలిపారు. ఈ వర్షాలకు 2,36,460 హెక్టార్లలో పంటలు నాశనం కావడంతో పాటు 37,700 ఇళ్లు ధ్వంసమయ్యాయి. అలాగే, 6021 కి.మీల మేర రహదారులు కూడా దెబ్బతిన్నాయి. దీంతో చైనాకు 780 మిలియన్‌ డాలర్ల మేర ప్రత్యక్షంగా ఆర్థికనష్టం వాటిల్లినట్టు చైనా అధికార మీడియా సంస్థ జిన్హువా పేర్కొంది.

* ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షల నిర్వహణపై తెలంగాణ ఇంటర్‌ బోర్డు కీలక ప్రకటన చేసింది. 70 శాతం సిలబస్‌ నుంచే ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి జలీల్‌ తెలిపారు. ప్రశ్నల్లో మరిన్ని ఛాయిస్‌లు పెంచామన్నారు. నమూనా ప్రశ్నా పత్రాలు, పరీక్షల మెటీరియల్‌ను tsbie.cgg.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు జలీల్‌ తెలిపారు. ప్రస్తుతం ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఈనెల 25 నుంచి మొదటి సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి. రెండో సంవత్సరంలో కాలేజీ మారిన విద్యార్థులు… మొదటి సంవత్సరం ఫీజు చెల్లించిన కాలేజీ జోన్ పరిధిలోనే పరీక్ష రాయాలని జలీల్‌ తెలిపారు. విద్యార్థుల కెరీర్, ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే పరీక్షలు నిర్వహిస్తున్నామని జలీల్ తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి, భయం లేకుండా పరీక్షలు ఎదుర్కోవాలన్నారు.

* ‘మా’ ఎన్నికలపై నటి అనసూయ ట్విటర్‌లో ఆసక్తికర వ్యాఖలు చేశారు. ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ నుంచి కార్యవర్గ సభ్యురాలిగా పోటీచేసిన ఆమె ఓటమిపాలయ్యారు. ‘‘600 ఓట్లని లెక్కించడానికి రెండో రోజుకి ఎందుకు వాయిదా వేశారు. ఆదివారం గెలుపు అని చెప్పి ఈ రోజు ఓటమి అంటున్నారు, రాత్రికి రాత్రి ఏం జరిగింది? నిన్న ఎవరో ఎన్నికల నియమాలకి భిన్నంగా బ్యాలెట్‌ పేపర్లని ఇంటికి కూడా తీసుకెళ్లారని బయట చెప్పుకుంటున్నారు’’ అంటూ ఆమె ట్వీట్‌ చేశారు.

* కరోనా మహమ్మారి రష్యాను మళ్లీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గత కొంత కాలంగా అక్కడ నమోదవుతున్న మరణాలు గత రికార్డులను తిరగరాస్తున్నాయి. మంగళవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 973మంది కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు వెల్లడించారు. కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పట్నుంచి ఒక్కరోజులో ఇంత భారీగా మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. గడిచిన 24గంటల్లో రష్యాలో 28,190 కొత్త కేసులు వచ్చాయని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తంగా 7.8 మిలియన్లకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 2,18,345మంది కొవిడ్‌తో మృతిచెందినట్టు వివరించారు. యూరప్‌లో అత్యధిక కొవిడ్‌ మరణాలు రష్యాలోనే సంభవించడం గమనార్హం. వ్యాక్సినేషన్‌ రేటు మందగించడం వల్లే గత నెల నుంచి ప్రారంభమైన కొవిడ్‌ కేసులు, మరణాలు ప్రస్తుతం తీవ్రరూపం దాల్చాయన్న విమర్శలూ ప్రభుత్వంపై వస్తున్నాయి.

* దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌కు సంబంధించి సిర్పూర్కర్‌ కమిషన్‌ విచారణ కొనసాగుతోంది. విచారణలో భాగంగా టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ను కమిషన్‌ విచారించింది. శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి, 2019 డిసెంబర్ 6వ తేదీ ఉదయం తనకు చెప్పారని.. విషయం తెలుసుకొని ఎన్‌కౌంటర్‌ జరిగిన చటాన్‌పల్లికి వెళ్లానని సజ్జనార్ కమిషన్‌కు తెలిపారు. సైబరాబాద్ కమిషనరేట్‌కు న్యాయసలహాదారుగా వ్యవహరిస్తున్న అడ్వొకేట్ సూచన మేరకు ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ సమక్షంలో పంచనామా నిర్వహించినట్లు సజ్జనార్ చెప్పారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన స్థలంలో నిర్వహించిన మీడియా సమావేశంలోని పలు అంశాలను కమిషన్ ప్రస్తావించగా.. తెలుగు తన మాతృభాష కానందున ఆ సమయంలో కొన్ని తప్పుగా మాట్లాడినట్లు సజ్జనార్ వివరించారు. దిశ హత్యాచారం, నిందితుల అరెస్ట్, ఆ తర్వాత కస్టడీలోకి తీసుకొని విచారించే ప్రక్రియను అంతా శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి పర్యవేక్షించారని సజ్జనార్‌ కమిషన్‌కు వెల్లడించారు.

* గుత్తేదారులకు బిల్లులు చెల్లించాలని న్యాయస్థానాలు ఎన్నిసార్లు ఆదేశించినా ప్రభుత్వం లెక్కలేనితనంగా వ్యవహరిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. కోర్టులు ఆదేశించినా ఉపాధిహామీ బిల్లులు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. గ్రామాలను అభివృద్ధి చేసిన గుత్తేదారులపై కక్ష సాధింపులేంటని ప్రశ్నించారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా వేధించడం దుర్మార్గమని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామిక వేత్తలు, అభివృద్ధి పనులు చేపట్టడానికి గుత్తేదారులు ముందుకు రావడంలేదని దుయ్యబట్టారు.