Food

థాలేట్స్ ఉన్న నిత్యావసరాలు వాడకండి

థాలేట్స్ ఉన్న నిత్యావసరాలు వాడకండి

నిత్యావసర వస్తువుల తయారీలో సర్వసాధారణంగా ఉపయోగించే థాలెట్స్‌ అనే రసాయనాలు మానవాళికి ప్రమాదకరంగా మారుతున్నాయి. ఈ రసాయనాల వల్ల అమెరికాలో ఏటా లక్ష మరణాలు చోటుచేసుకుంటున్నట్లు న్యూయార్క్‌ యూనివర్శిటీ తాజా అధ్యయనంలో వెల్లడించింది.

పిల్లలు ఆడుకునే బొమ్మల నుంచి దుస్తులు, షాంపూల వరకు నిత్య జీవితంలో ఉపయోగించే అనేక ప్లాస్టిక్‌ వస్తువుల తయారీలో ఈ థాలెట్స్‌ను విరివిగా ఉపయోగిస్తున్నారు. ఆ వస్తువుల నుంచి విషపూరిత రసాయనాలు మన శరీరంలోకి ప్రవేశించి హార్మోన్లు, ఎండోక్రైన్‌ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని ఈ అధ్యయనం తెలిపింది. ఈ అంశంపై న్యూయార్క్‌ యూనివర్శిటీ ఇటీవల 55 నుంచి 64ఏళ్ల మధ్య వయసు గల 5000 మందిపై పరిశోధనలు చేసింది. వారి మూత్రంలో అత్యధిక మోతాదులో థాలెట్స్‌ రసాయనాలు ఉన్నట్లు గుర్తించింది. ఈ రసాయనాల వల్ల వీరంతా గుండె సంబంధిత వ్యాధులతో చనిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

‘‘థాలెట్స్‌ రసాయనాల వల్ల మనిషి ప్రాణాలు పోతాయని నేరుగా చెప్పలేం. అయితే ఈ రసాయనాల వల్ల గుండె సంబంధిత వ్యాధుల ముప్పు అధికంగా ఉంది. గుండె సమస్యలు మరణాలకు ప్రధాన కారణంగా మారుతున్నాయి’’ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ థాలెట్స్‌ ఊహించినదాని కంటే ఎక్కువ ప్రమాదకరమైనవని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈ థాలెట్స్‌ రసాయనాల వల్ల అమెరికాలో చాలా మంది అనేక వ్యాధుల బారినపడుతున్నారని, దీని కారణంగా ఏడాదికి లక్ష మరణాలు చోటుచేసుకుంటున్నాయని అధ్యయనం వెల్లడించింది. ఇక దీని కారణంగా పురుషుల్లో టెస్టోస్టిరాన్‌ స్థాయి తగ్గే అవకాశముందని గతంలోనూ అనేక అధ్యయనాలు వెల్లడించాయి.