కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం శనివారం తెరుచుకోనుంది. తులామాస పూజకోసం ఈ సాయంత్రం ఐదు గంటలకు ఆలయాన్ని తెరవనున్నారు. ఆదివారం నుంచి భక్తులను అనుమతించనున్నారు. దీనికి సంబంధించి ఇదివరకే ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు(టీడీబీ) ప్రకటన విడుదల చేసింది.
ఆన్‌లైన్ వేదికగా బుకింగ్ చేసుకున్న అయ్యప్ప భక్తులను ఆదివారం ఉదయం ఐదు గంటల నుంచి ఆలయంలోకి అనుమతించనున్నారు. భక్తులు తమ వెంట వ్యాక్సినేషన్ ధ్రువీకరణ పత్రం లేదా ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్టు తీసుకురావాలని దేవస్థానం తెలిపింది. కొవిడ్ నిబంధనల ప్రకారం దర్శనాలను నిర్వహిస్తామని పేర్కొంది. అలాగే ఆలయ ప్రధాన పూజారిని ఆదివారం ఎంపిక చేయనున్నారు. లాటరీ పద్ధతిలో ఈ ఎంపిక జరగనుంది.
తులామాస పూజల కోసం తెరుచుకోనున్న శబరిమల ఆలయాన్ని తిరిగి అక్టోబర్ 21న మూసివేయన్నారు. మళ్లీ నవంబర్ రెండున అత్తచితిర పూజ కోసం గుడిని తెరిచి, పూజ అనంతరం మరుసటి రోజే మూసివేస్తారు.