Business

టాటాలో పెరిగిన ఝున్‌ఝున్‌వాలా వాటా-వాణిజ్యం

టాటాలో పెరిగిన ఝున్‌ఝున్‌వాలా వాటా-వాణిజ్యం

* మోటార్‌ బీమా రంగంలో ప్రభుత్వ కంపెనీలు శరవేగంగా మార్కెట్‌ వాటా కోల్పోతున్నాయి. ‘కరోనా’ మహమ్మారి కారణంగా గత ఏడాదిన్నర కాలంగా మోటారు బీమా వ్యాపారం కుంగిపోగా, అందులోనూ ప్రభుత్వ బీమా కంపెనీల మార్కెట్‌ వాటా గణనీయంగా తగ్గిపోయినట్లు స్పష్టమవుతోంది. మహమ్మారి ప్రభావం నుంచి మోటారు వాహనాల రంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఆమేరకు మోటారు బీమా లోనూ వృద్ది కనిపిస్తోంది. కానీ ప్రభుత్వ రంగంలోని బీమా కంపెనీల వాహన బీమా వ్యాపారం మాత్రం తగ్గిపోతోంది. ఈ విభాగంలో ఈ ఏడాది ఆగస్టు నెలలో ప్రభుత్వ బీమా కంపెనీల మార్కెట్‌ వాటా 32.6 శాతానికి పడిపోయింది. క్రితం ఏడాదిలో ఇది 36.6 శాతం ఉండటం గమనార్హం. అదే సమయంలో ప్రైవేటు రంగ బీమా కంపెనీల వాటా 63.4 శాతం నుంచి 67.4 శాతానికి పెరిగింది.

* అప్పుల్లో కూరుకుపోయిన ఎయిరిండియా విమానయాన సంస్థ టాటాల పాలిట కామధేనువేమీ కాదని దీపమ్‌ కార్యదర్శి తుహిన్‌ కాంత్‌ పాండే అన్నారు. కొత్త యజమానికి సంస్థను నడపడం అంత సులువేమీ కాదని చెప్పారు. విమానాలను పునరుద్ధరించడానికి ఆ సంస్థ పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఎయిరిండియాను కారు చౌకగా టాటాలకు కట్టబెట్టారన్న కాంగ్రెస్‌ పార్టీ విమర్శల నేపథ్యంలో దీపమ్‌ కార్యదర్శి ఈ విధంగా స్పందించారు.

* బ్రేకులు బాగా పనిచేస్తే కారు సురక్షితం అనుకునే రోజులు పోయాయి.. మనం బ్రేకు వేసినా ఎదుటివారి కారు వచ్చి ఢీకొంటే ప్రమాదం తప్పదు. ఒక్క 2019లోనే 4.3 లక్షల రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వీటిల్లో 1.54లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో అత్యధిక మంది 18-45 మధ్య వయస్సు వారే. అందుకే.. ఏం జరిగినా.. మన వాహనం ఆ ప్రమాద తీవ్రత నుంచి ఎంత వరకు మనల్ని కాపాడుతుంది అనేది సేఫ్టీ రేటింగ్స్‌ చెబుతాయి. పెరిగిపోతున్న ట్రాఫిక్‌ రద్దీ, ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని వినియోగదారులు కూడా ఇప్పుడిప్పుడే ఈ రేటింగ్స్‌ను గమనించడం మొదలు పెట్టారు. దీంతో గ్లోబల్‌ ఎన్‌సీఏపీ (న్యూ కార్‌ అసెస్‌మెంట్‌ ప్రోగ్రాం) సంస్థ ఇచ్చే రేటింగ్స్‌కు ప్రాధాన్యం పెరిగింది. ఒకప్పుడు భారత్‌లో తయారయ్యే కార్లకు చాలా తక్కువ రేటింగ్స్‌ వచ్చేవి. కానీ, ఇటీవలి కాలంలో కంపెనీలు భద్రతా ప్రమాణాలను గణనీయంగా మెరుగుపర్చాయి. దీంతో భారత్‌ తయారీ కార్లు కూడా సురక్షితమైనవని నిరూపించుకొంటున్నాయి. అయితే భారత్‌లో టాప్‌టెన్‌లో అమ్ముడు పోయే వాహనాల్లో చాలా వరకూ గ్లోబల్‌ ఎన్‌సీఏపీ టాప్‌ టెన్‌ జాబితాలో లేకపోవడం గమనార్హం.

* జులై- సెప్టెంబరు త్రైమాసికంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏకీకృత ప్రాతిపదికన రూ.9,096 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. కిందటేడాది ఇదే సమయంలో నమోదైన రూ.7,703 కోట్లతో పోలిస్తే లాభం 18 శాతం పెరిగింది. మొండి బకాయిలు పెరిగినప్పటికీ లాభంలో వృద్ధి ఉండటం గమనార్హం. ఏకీకృత ఆదాయం రూ.38,438.47 కోట్ల నుంచి పెరిగి రూ.41,436.36 కోట్లకు చేరింది. స్టాండలోన్‌ ప్రాతిపదికన నికర లాభం రూ.8,834.30 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలోని రూ.7,513.10 కోట్లతో పోలిస్తే లాభంలో 17.6 శాతం వృద్ధి ఉంది. మొత్తం ఆదాయం రూ.36,069.42 కోట్ల నుంచి పెరిగి రూ.38,754.16 కోట్లకు చేరింది.

* దేశంలో ఇంధన ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. ఆదివారం (17-10-2021) లీటర్‌ పెట్రోలుపై గరిష్ఠంగా 37 పైసలు, డీజిల్‌పై 38 పైసల వరకు ఎగబాకింది. దీంతో హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.110 దాటింది. ఇప్పటికే అన్ని రాష్ట్ర రాజధానుల్లోనూ లీటరు పెట్రోలు ధర రూ.100 మార్కును దాటేసింది. దేశంలో చాలా ప్రాంతాల్లో డీజిల్‌ సైతం రూ.100 దాటింది. ముంబయిలో లీటరు పెట్రోలుకు ఆదివారం రూ.111.77, దిల్లీలో 105.84 చొప్పున వసూలు చేస్తున్నారు.

* బంగారం అంటే మ‌హిళ‌ల‌కు ఎంతో మ‌క్కువ‌. భార‌తీయులు అధికంగా విదేశాల నుంచి బంగారం దిగుమ‌తి చేసుకోవాల్సిందే. దీని ప్ర‌భావం దేశీయ వాణిజ్యంలో క‌రంట్ ఖాతా లోటు (సీఏడీ) పెరిగిపోతుంది. 2020-21తో పోలిస్తే ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో ఏప్రిల్ నుంచి సెప్టెంబ‌ర్ వ‌ర‌కు బంగారం దిగుమ‌తి ప‌లు రెట్లు పెరిగింది. దేశీయంగా డిమాండ్ పెర‌గ‌డ‌మే దీనికి కార‌ణ‌మ‌ని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ‌శాఖ తెలిపింది. ఏప్రిల్-సెప్టెంబ‌ర్ మధ్య దిగుమ‌తులు సుమారు 24 బిలియ‌న్ డాల‌ర్ల‌కు దూసుకెళ్లాయి. గ‌తేడాది బంగారం దిగుమ‌తులు 6.8 బిలియ‌న్ల డాల‌ర్లు జ‌రిగాయని కేంద్ర వాణిజ్య శాఖ గ‌ణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబ‌ర్‌లో బంగారం దిగుమ‌తులు 601.4 మిలియ‌న్ డాల‌ర్ల నుంచి 5.11 బిలియ‌న్ డాల‌ర్ల‌కు దూసుకెళ్లాయి. బంగారం దిగుమ‌తులు పెర‌గ‌డంతో క‌రంట్ ఖాతాలోటు 2.96 బిలియ‌న్ డాల‌ర్ల నుంచి 22.6 బిలియ‌న్ డాల‌ర్ల‌కు పెరిగింది.

* రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా.. మరో టాటా గ్రూప్ కంపెనీలో తన పెట్టుబడులను పెంచారు. టాటా మోటార్స్ తర్వాత టాటా కమ్యూనికేషన్స్‌లో తన పెట్టుబడిని పెంచారు. కంపెనీ షేర్‌హోల్డింగ్ సరళి ప్రకారం, ఝున్‌ఝున్‌వాలా వాటా 1.04 శాతం నుంచి 1.08 శాతానికి పెరిగింది. ఝున్‌ఝున్‌వాలాకు టాటా గ్రూపులోని మూడు కంపెనీల్లో పెట్టుబడులు ఉన్నాయి.