Editorials

అచ్చే దిన్ పోయే…సచ్చే దిన్ వచ్చే-TNI ప్రత్యేకం

అచ్చే దిన్ పోయే…సచ్చే దిన్ వచ్చే-TNI ప్రత్యేకం

ప్రధాని మోడీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం సామాన్య మధ్యతరగతి ప్రజల నడ్డివిరిచే విధంగా రోజురోజుకు పన్నుల భారం మోపుతోంది. నిలదీసే వారు అడ్డుకునే వారు బలమైన ప్రతిపక్షం లేదనే ధీమాతో మోడీ ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరిస్తోంది. ప్రధాని మోడీ ప్రభుత్వం నియంత పాలనను సాగిస్తోంది. అడ్డగోలు నిర్ణయాలు చేపడుతోంది. ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు తిరిగివచ్చినట్లు కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులు సామాన్య మధ్య తరగతి ప్రజల దైనందిన జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. అడ్డూ అదుపూ లేకుండా రోజురోజుకు పెట్రోల్ డీజిల్ ధరలను ఇష్టం వచ్చినట్లు పెంచుతూ ఉండటంతో దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతోంది. ఆయిల్ ధరలు పెరుగుదల మూలంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడటంతో పాటు దీని ప్రభావం అన్ని దైనందిన కార్యక్రమాలు పై కూడా పడింది. పెరిగిన ఆయుధాలను భరించలేక రవాణా రంగం కుదేలవుతోంది. పప్పు ఉప్పు చింతపండు ఉల్లిపాయలు వంటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

వంట గ్యాస్ ధరలను భారీగా పెంచటంతో మహిళలు కన్నీరు పెట్టుకుంటున్నారు. గత ఐదు సంవత్సరాల్లో 100 శాతం పైగా వంటగ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. వంట గ్యాస్ సిలిండర్ పై ఇచ్చే సబ్సిడీ మొత్తాన్ని ఎత్తివేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు పెరిగిన గ్యాస్ సిలిండర్లను కొనుక్కో లేక మళ్లీ పాత పద్ధతులకు అలవాటు పడుతున్నారు. కట్టె పుల్లల పొయ్యిలను ఉపయోగిస్తున్నారు. దేశ ప్రజలకు అచ్చే దినాలు తీసుకువస్తామని అధికారంలోకి వచ్చిన మోడీ ప్రస్తుతం సామాన్య మధ్యతరగతి ప్రజలకు సచ్చే దినాలను తీసుకువచ్చారని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరొక పక్క రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదు రైతు చట్టాలకు వ్యతిరేకంగా వారు చేస్తున్న పోరాటాలను బలిదానాలను మోడీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. బ్యాంకింగ్ రంగాన్ని ప్రైవేటీకరణ దిశగా పరుగులు పెట్టిస్తున్నారు. పెట్టుబడిదారుల చేతుల్లోకి బ్యాంకులు వెళ్లే పరిస్థితులు కల్పిస్తున్నారు. ప్రభుత్వ రంగంలోని బిఎస్ఎన్ఎల్ ను మూసి వేస్తున్నారు. జీవిత బీమా సంస్థలు అదే బాట పట్టించే విధంగా చర్యలు చేపడుతున్నారు. కరోనా సమయంలో నడిపిన ప్రత్యేక రైళ్లను ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. కరొన సమసిపోయినప్పటికీ ఈ రైళ్లలో అదనపు చార్జీలను వసూలు చేస్తున్నారు. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసే దిశగా మోడీ ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఎయిర్ ఇండియాను టాటాలకు కట్టబెట్టింది. అదానీ అంబానీ వంటి బడా పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా మోడీ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కును ప్రైవేటీకరించడం దిశగా మోడీ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. తెలుగు రాష్ట్రాలపై మోడీ ప్రభుత్వం శీతకన్ను వేసింది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం పనితీరు మారకుంటే దేశప్రజలు గట్టి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు- కిలారు ముద్దుకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్.