Politics

వైకాపా అధ్యక్ష పదవికి రఘురామ పోటీ-తాజావార్తలు

వైకాపా అధ్యక్ష పదవికి రఘురామ పోటీ-తాజావార్తలు

* వైసీపీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రకటించారు.సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీలో సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.క్రమశిక్షణ గల కార్యకర్తను కాబట్టే తనను పార్టీలోంచి తొలగించలేదని తెలిపారు.అధ్యక్ష పదవికి ఎవరైనా పోటీ చేయొచ్చన్నారు. వైసీపీ నేతలు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు . కాగా.. స్పీకర్‌ ఓం బిర్లాకు రఘురామకృష్ణరాజు లేఖ రాశారు.తనపై దాఖలైన అనర్హత పిటిషన్‌ను కొట్టివేయాలని లేఖలో కోరారు.

* మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘మా’ ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ఇటీవల ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ సభ్యులు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ‘మా’ నూతన అధ్యక్షుడు మంచు విష్ణు దీనిపై స్పందించారు. తన తండ్రి మోహన్‌బాబు, ప్యానెల్‌ సభ్యులతో కలిసి ఆయన సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

* మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తెరాసలో చేరారు. తెరాస అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ సమక్షంలో మోత్కుపల్లి తెరాస తీర్థం పుచ్చుకున్నారు.గులాబీ కండువా కప్పి మోత్కుపల్లిని సీఎం కేసీఆర్‌ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేసీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘మోత్కుపల్లి పరిచయం అక్కర్లేని వ్యక్తి. నాకు అత్యంత సన్నిహితుడు. ఇద్దరం అనేక ఏళ్లు కలిసి పని చేశాం. గతంలో విద్యుత్‌ కోసం తెలంగాణ అనేక ఇబ్బందులు పడింది. విద్యుత్‌ శాఖ మంత్రిగా చేసిన అనుభవం ఉన్న మోత్కుపల్లికి ఆ కష్టాలు తెలుసు. స్వరాష్ట్రమే సమస్యలకు పరిష్కారం అని ఉద్యమం ప్రారంభించాను. స్వరాష్ట్ర ఉద్యమంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. నన్ను తిట్టినన్ని టిట్లు దేశంలో ఎవరినీ తిట్టలేదు. స్వరాష్ట్ర మద్దతు కోసం మాయావతిని 13 సార్లు కలిశాను. తెలంగాణలో ఇప్పుడిప్పుడే సమస్యలు కొలిక్కి వస్తున్నాయి. రైతులు, చేనేతల ఆత్మహత్యలు ఆగిపోయాయి. ముందుముందు మరింత చేయాల్సి ఉంది. అట్టడుగు వర్గాల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చాలి. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి సహకరించాలి’’ అని కేసీఆర్‌ అన్నారు.

* ఆధార్‌.. ప్రతి భారతీయుడూ ప్రతి సందర్భంలోనూ వెంట ఉంచుకోవాల్సిన ధ్రువపత్రంలా మారిపోయింది. బ్యాంక్‌ ఖాతా తెరవాలన్నా.. కొత్త సిమ్‌ తీసుకోవాలన్నా.. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు పొందాలన్నా ఈ 12 అంకెల గుర్తింపు కార్డు తప్పనిసరి. అయితే, ఆధార్‌ దుర్వినియోగం గురించీ భయాందోళనలు ఉన్నాయి. ఒకవేళ మీ ఆధార్‌ నంబర్‌ దుర్వినియోగం అవుతుందని మీరు భావిస్తే మాస్క్‌డ్‌ ఆధార్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవడం ఉత్తమం.

* హెచ్‌ఎండీ గ్లోబల్ సంస్థ నోకియా మోడల్స్‌లో క్లాసికల్ ఫీచర్‌ ఫోన్‌ని మరోసారి భారత్‌లో మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమైంది. గతంలో వచ్చిన నోకియా 6310 ఫోన్‌ను ఇప్పటికే 2001 సంవత్సరంలో మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఏడాదితో ఈ ఫోన్‌ మార్కెట్లో విడుదలయి 20 ఏళ్లు కావడంతో సరికొత్త ఫీచర్స్‌తో మరోసారి ఈ ఫోన్‌ని మార్కెట్లోకి విడుదల చేయనుంది. నోకియా ఫోన్‌ అనగానే ముందుగా గుర్తొచ్చేది మన్నిక, బ్యాటరీ. మరి ఈ ఫీచర్‌ ఫోన్‌లో పీచర్స్‌ ఎలా ఉన్నాయో చూద్దాం.

* రసాయన ఎరువుల ధరల భారం నుంచి రైతులకు భారీ ఉపశమనం కలిగించేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎరువులపై రాయితీని భారీగా పెంచింది. డీఏపీ ఎరువుపై ప్రస్తుతం బస్తాకు రూ.1200 రాయితీ ఇస్తుండగా.. దాన్ని రూ.1650కి పెంచింది. ఈ మేరకు మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ సోమవారం వెల్లడించారు. అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ రైతులకు పాత ధరలకే ఎరువులు లభించేలా చూడాలన్న ఉద్దేశంతో సబ్సిడీని పెంచినట్లు ఆయన పేర్కొన్నారు.

* కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టాలని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. కొవిడ్‌తో చనిపోయిన వారి కుటుంబసభ్యులకు ఉద్యోగం ఇవ్వాలన్నారు. నవంబరు 30వ తేదీలోగా కారుణ్య నియామకాల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో కొవిడ్‌ నివారణ చర్యలు, వ్యాక్సినేషన్‌, ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది నియామకం, జిల్లాల కేంద్రాలు, కార్పొరేషన్లలో హెల్త్‌ హబ్స్‌ ఏర్పాటుపై సీఎం సమీక్షించారు. ఆస్పత్రుల్లో ఖాళీలపై నియామక క్యాలెండర్‌ను రూపొందించామని.. ఈనెల 20న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేస్తామని అధికారులు సీఎంకు వివరించారు. జాతీయ ప్రమాణాల ప్రకారం ఆస్పత్రుల్లో సిబ్బంది ఉండాలని సీఎం అధికారులను ఆదేశించారు. 176 కొత్త పీహెచ్‌సీల నిర్మాణంపై దృష్టి పెట్టాలన్నారు. జనవరిలో పనులు ప్రారంభించి 9 నెలల్లో పూర్తి చేస్తామని అధికారులు సీఎంకు తెలిపారు.

* ‘మా’లో ఎన్నో సమస్యలున్నాయని.. వాటిని పరిష్కరించడం కోసమే తాను ఎన్నికల్లో పోటీ చేశానని మరోసారి నటుడు ప్రకాశ్‌రాజ్ స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన ‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌ ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నికల్లో ఓడినప్పటికీ తాను ‘మా’ సభ్యుల సంక్షేమం కోసం ప్రశ్నిస్తూనే ఉంటానని అన్నారు. అనంతరం ‘మా’ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘మా’ అసోసియేషన్‌లో ఎన్నో సమస్యలున్నాయి. వాటిని పరిష్కరించి.. అసోసియేషన్‌ని బాగుచేసి.. సభ్యుల సంక్షేమం కోసమే ఎన్నికల్లో పోటీ చేశాను. ఒకవేళ ఎన్నికల్లో గెలిచి ఉంటే.. నాకంటూ ఒక పవర్‌ ఉండేది. అసోసియేషన్‌ అభివృద్ధి కోసం నేను అనుకున్న పనులన్నింటినీ త్వరగా పూర్తి చేయగలిగే వాడిని. ఇప్పుడు నన్ను నమ్మి ఓటు వేసిన సభ్యులందరి కోసం నేను పనిచేస్తాను. వాళ్ల కోసం ప్రశ్నిస్తూనే ఉంటాను. మంచు విష్ణు, అతని ప్యానెల్‌ సభ్యుల్ని ఈ రెండేళ్లు నిద్రపోనివ్వకుండా చేస్తాను. అసోసియేషన్‌లో అభివృద్ధి కోసం వాళ్లు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారో చెప్పమని ప్రతిసారీ రిపోర్ట్‌ కార్డ్‌ అడుగుతా. పోలింగ్‌ జరిగిన రోజు కొన్ని వివాదాలు జరిగాయి. మా ప్యానెల్‌ సభ్యులతో ప్రత్యర్థి ప్యానెల్‌ వాళ్లు గొడవకు దిగారు. మా వాళ్లని తిట్టారు. ఆ విషయంపై మోహన్‌బాబుతో అప్పుడే మాట్లాడాను. ఆయన సారీ చెప్పారు. నాకు తెలిసినంత వరకూ ఆయన మంచి హాస్యచతురత కలిగిన వ్యక్తి. ఆయన్ని మీరు డిస్టర్బ్‌ చేయకపోతే ఆయనంత మంచివాళ్లు లేరు. ఒకవేళ మీరు ఆయన్ని డిస్టర్బ్‌ చేస్తే ఆయన ఏం చేస్తారో ఆయనకే తెలీదు. ఈ ఎన్నికల్లో పలువురు రాజకీయ నాయకులు కూడా భాగమయ్యారు. విష్ణు విజయం కోసం భాజపా వాళ్లు పనిచేశారు’’ అని ప్రకాశ్‌రాజ్‌ ఆరోపించారు.

* దేశంలో రోజురోజుకీ పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీరుపై కాంగ్రెస్‌ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మధ్యతరగతి ప్రజలు విమానంలో ప్రయాణించేలా చేస్తామని చెప్పిన ఎన్డీయే సర్కారు.. ఇప్పుడు వారిని కనీసం రోడ్డుపైనా తిరగనివ్వట్లేదని ఎద్దేవా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఎద్దేవా చేశారు. పెట్రోల్‌, డీజిల్‌ ధర కంటే విమాన ఇంధన ధరలే తక్కువగా ఉన్నాయంటూ తాజాగా వార్తా కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. వీటిపై ట్విటర్‌ వేదికగా స్పందించిన ప్రియాంక గాంధీ.. ‘‘హవాయి చెప్పులు(మధ్య తరగతి ప్రజలను ఉద్దేశిస్తూ) వేసుకునే వారు కూడా విమానాల్లో ప్రయాణించేలా చేస్తామని అప్పుడు హామీ ఇచ్చారు. కానీ భాజపా ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచుకుంటూ పోతోంది. దీంతో హవాయి చెప్పులు వేసుకునే వారు, మధ్య తరగతి ప్రజలు ఇప్పుడు రోడ్డుపై ప్రయాణించడమే కష్టంగా మారింది’’ అంటూ కేంద్రానికి చురకలంటించారు.

* దేశంలోని 8 ప్రధాన నగరాల్లో ఇళ్ల విక్రయాల్లో వృద్ధి నమోదైంది. జులై-సెప్టెంబర్‌ మధ్య కాలంలో 59శాతం వృద్ధిని నమోదు చేసింది. మొత్తం 55,907 యూనిట్స్‌ను విక్రయించినట్లు ప్రాప్‌ టైగర్‌.కామ్‌ సంస్థ లెక్కలు చెబుతున్నాయి. గత త్రైమాసికంతో పోల్చుకొంటే డిమాండ్‌ మూడు రెట్లు పెరిగింది. ఈ త్రైమాసికంలో కేవలం 15,968 యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రభావంతో విక్రయాలు బాగా తగ్గాయి. ఇక గతేడాది జులై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో విక్రయాలు 35,132 యూనిట్లు మాత్రమే ఉన్నట్లు పేర్కొంది. కరోనా సెకండ్‌ వేవ్‌ తగ్గుముఖం పట్టగానే విక్రయాలు ఊపందుకొన్నట్లు ఈ సంస్థ నివేదిక రియల్‌ ఇన్‌సైట్‌లో పేర్కొంది. చాలా రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు ఈ సీజన్‌లో విక్రయాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశాయి. ఇక ఈ పండుగల సీజన్‌లో భారీగా అమ్మకాలు ఉండొచ్చని అంచనావేసింది. హైదరాబాద్‌లో గత త్రైమాసికంలోని 3,260 యూనిట్లతో పోల్చుకొంటే ఈ సారి రెట్టింపై 7,812కు విక్రయాలు చేరాయి. ఈ త్రైమాసికంలో బెంగళూరులో 6,557, చెన్నైలో 4,665, దిల్లీ ఎన్‌సీఆర్‌ మార్కెట్‌లో 4,458, కోల్‌కతాలో 2,651,ముంబయిలో అత్యధికంగా 92శాతం పెరిగి 14,163కు చేరాయి. పుణేలో 10,128 యూనిట్లు అమ్ముడు పోయాయి.

* ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. ఆ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయలు తప్పకుండా పాల్గొనాలని సూచించారు. దామోదరం సంజీవయ్య అత్యంత నిజాయతీపరుడని.. ఆయన్ను గౌరవించుకోవాలని తెలిపారు. కర్నూల్‌లో ఉన్న ఆయన ఇంటిని అభివృద్ధి చేయడానికి జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ముందుకు రావడంపై వీహెచ్‌ హర్షం వ్యక్తం చేశారు.

* తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురుకుల విద్యార్థులను కూలీలుగా మార్చేలా వ్యవహరిస్తోందని బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆరోపించారు. ఇప్పటికీ గురుకులాలను ప్రారంభించలేదన్న ఆయన.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మౌనం ఒక తరాన్ని కూలీలుగా మార్చే కుట్రగా పేర్కొన్నారు. ఇలాంటి వైఖరితో పిల్లలు భూస్వాముల ఇళ్లు, భూముల్లో కూలీలుగా మారే ప్రమాదం ఉందన్నారు. గడీల పాలన నుంచి తెలంగాణను విముక్తి చేయాలంటూ ప్రవీణ్‌కుమార్‌ ట్వీట్‌ చేశారు.

* వరంగల్‌లో హైదరాబాద్ పబ్లిక్‌ స్కూల్‌ (హెచ్‌పీఎస్‌) ఏర్పాటుకు మార్గం సుగమమైంది. స్కూల్‌ కోసం హెచ్‌పీఎస్‌ సొసైటీకి ప్రభుత్వం స్థలం కేటాయించింది. ధర్మసాగర్‌ మండలం ఎలుకుర్తిలో 50 ఎకరాల ప్రభుత్వ స్థలం మార్కెట్‌ ధరకు కేటాయించారు. ఈ మేరకు హెచ్‌పీఎస్‌ సొసైటీ వైస్ ఛైర్మన్‌కు మంత్రి ఎర్రబెల్లి జీవో కాపీ అందజేశారు. వరంగల్‌కు హెచ్‌పీఎస్‌ రావడం సంతోషకరమని మంత్రి తెలిపారు.

* తెలంగాణ గడ్డపై ఎగిరేది కాషాయ జెండాయే అని హుజూరాబాద్‌ ఉప ఎన్నిక భాజపా అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. రానున్న ఎన్నికల్లో గెలిచేది భాజపాయే అని చెప్పారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలపై ఈటల స్పందిస్తూ తాము కళ్లు తెరిస్తే మాడి మసైపోతారని వ్యాఖ్యానించారు.

* ‘తెలంగాణ విజయగర్జన’ పేరుతో తెరాస నవంబర్‌ 15న వరంగల్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ కోరారు. సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం మేరకు తెలంగాణ భవన్‌లో ఆయన ముఖ్య నేతలతో సభ సన్నాహాలపై చర్చించారు. ఈ ఉదయం నుంచి నియోజకవర్గాల వారీగా నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.