* మన దేశ గగనతలంపై దేశీయ విమానాలు, అంతర్జాతీయ విమానాలు ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణికులకు అత్యంత వేగవంతమైన శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించడానికి ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ సన్నద్ధమైంది. ఇందుకు అవసరమైన లైసెన్సులను టెలికాం విభాగం (డాట్) నుంచి పొందింది. భారత్‌లో గ్లోబల్ ఎక్స్‌ప్రెస్(జీఎక్స్) మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించడానికి తమ వ్యూహాత్మక భాగస్వామి బీఎస్‌ఎన్‌ఎల్‌కు లైసెన్సులు దక్కాయని బ్రిటిష్ శాటిలైట్ సంస్థ ఇన్‌మర్సాట్ బుధవారం తెలిపింది. బీఎస్‌ఎన్‌ఎల్ పొందిన ఇన్‌ఫ్లైట్, మారిటైమ్ కనెక్టివిటీ(ఐఎఫ్‌ఎమ్‌సీ) లైసెన్సులతో ప్రభుత్వం, విమానయాన, నౌకాయనానికి చెందిన భారత వినియోగదార్లకు జీఎక్స్ సేవలు అందుబాటులోకి వస్తాయని ఇన్‌మర్సాట్ వివరించింది. టారిఫ్‌లను ఇంకా నిర్ణయించలేదని బీఎస్‌ఎన్‌ఎల్ సీఎండీ పి.కె. పుర్వార్ పేర్కొన్నారు. నవంబరు నుంచి సేవలు అందించడానికి తమ వైపు నుంచి అంతా సిద్ధంగా ఉందని ఆయన వివరించారు. భారత్‌లో జీఎక్స్ గేట్‌వే ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఉండబోతోంది.
* దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి నష్టాల్లో ముగిశాయి. ఐటీ, మెటల్ షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కోవడంతో వరుసగా మూడో రోజూ సూచీలు నష్టపోయాయి. దీంతో సెన్సెక్స్ 61 వేల పాయింట్లు దిగువన ముగియగా.. నిఫ్టీ 18,200 మార్కును కోల్పోయింది.
* ప్రతి కుటుంబానికి సొంతిల్లు అనేది ఒక బలమైన కోరిక. ఒకప్పుడు వ్యాపారులు, వృత్తి నిపుణులు మధ్య వయస్సులోనే ఇంటిని నిర్మించుకునేవారు. ఉద్యోగులు అయితే ఉద్యోగ విరమణ తర్వాత సొంతింటి గురించి ప్రణాళిక వేసుకునేవారు. కానీ ఇప్పుడు 35 సంవత్సరాల్లోపు ఉద్యోగులు గృహ యజమాని అవుతున్నారు. గత 15 ఏళ్లలో అతి తక్కువ వడ్డీ రేట్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. గృహ రుణం పొందడానికి సరైన సమయం ఇదేనని స్థిరాస్తి వర్గాల అభిప్రాయం. గృహ రుణాన్ని తీసుకునేటప్పుడు ప్రాసెసింగ్ ఫీజులు, రుణ చెల్లింపు కాలవ్యవధిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. సాధారణంగా పండుగ సీజన్లలో చాలా బ్యాంకులు ఆఫర్లు ఇస్తుంటాయి. ముఖ్యంగా ప్రాసెసింగ్ ఫీజులలో ఆకర్షణీయమైన రాయితీలను అందిస్తాయి. వీటిని సద్వినియోగం చేసుకొంటే మంచిది. స్తిరాస్థి వ్యాపారులు కూడా పండుగల సీజన్‌లలో రాయితీలు ప్రకటిస్తుంటారు.
* గత ఆగస్టులో 14.81 లక్షల మంది కొత్త చందాదార్లు జతయ్యారని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి 5 నెలల్లో నికర ఉద్యోగాల్లో వృద్ధి ధోరణి కనిపిస్తోందని పేర్కొంది. 2021 జులైలో జతయిన చందాదార్లతో పోలిస్తే ఆగస్టులో 12.61 శాతం మేర వృద్ధి నమోదైంది. ఆగస్టు నాటి 14.81 లక్షల మంది నికర చందాదార్లలో, 9.19 లక్షల మంది తొలిసారిగా ఈపీఎఫ్‌ఓ సామాజిక భద్రత పథకంలోకి వచ్చారని తెలిపింది. 5.62 లక్షల మంది నికర చందాదార్లు ఈపీఎఫ్‌ఓను వదిలి, కొత్త ఉద్యోగాల ద్వారా మళ్లీ పథకంలోకి వచ్చినట్లు తెలిపింది. 22-25 ఏళ్ల మధ్య వయసున్న వారు 4.03 లక్షల మంది ఆగస్టులో కొత్తగా నమోదు చేసుకోగా, 18-21 ఏళ్ల మధ్య ఉన్న వారు 3.25 లక్షల మంది నమోదు చేసుకున్నారని ఈపీఎఫ్‌ఓ వెల్లడించింది.
* టెలికాం రంగానికి ప్రభుత్వం ప్రకటించిన ఉపశమన ప్యాకేజీలో భాగంగా, స్పెక్ట్రమ్ బకాయిల చెల్లింపునకు నాలుగేళ్ల మారటోరియంను ఎంచుకోవాలని డైరెక్టర్ల బోర్డు నిర్ణయించినట్లు వొడాఫోన్ ఐడియా వెల్లడించింది. టెలికాం విభాగం (డాట్) సూచించిన ఇతర అవకాశాలను సైతం నిర్ణీత కాలవ్యవధిలో డైరెక్టర్ల బోర్డు పరిశీలించనున్నట్లు ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో కంపెనీ పేర్కొంది. 2021 అక్టోబరు నుంచి 2025 సెప్టెంబరు మధ్య చెల్లించాల్సిన స్పెక్ట్రమ్ బకాయిలను కంపెనీ వాయిదా వేసుకోనుంది. నాలుగేళ్ల మారటోరియం సదుపాయాన్ని పొందే విషయంపై అక్టోబరు 29లోగా స్పష్టత ఇవ్వాల్సిందిగా గతవారం ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, రిలయన్స్ జియోలకు ప్రభుత్వం లేఖ రాసింది.