హుజూరాబాద్ ఉప ఎన్నికలో తెరాసను నిలువరించేందుకు భాజపా, కాంగ్రెస్‌లు చీకటి ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈటల రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా కొనసాగుతున్నారు. ఆయన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో గోల్కొండ రిసార్ట్స్‌లో రహస్యంగా సమావేశమయ్యారు. తెలంగాణ ఏర్పడ్డాక ఒక దశలో పార్టీని త్యాగం చేస్తామని కేసీఆర్ చెప్పారు. కేసీఆర్ చేతుల్లోనే రాష్ట్రం భద్రంగా ఉంటుందని అందరూ విన్నవించడంతో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సుపరిపాలనతో దేశానికి ఆదర్శంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దారు. ఏకకాలంలో ప్రభుత్వాన్ని, పార్టీని అద్భుతంగా నడుపుతున్నారు. స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణ ప్రజలకు శ్రీరామరక్ష. ఎవరితోనైనా తెరాస రాజీపడకుండా పోరాడుతుంది. రాష్ట్ర ప్రజలకే మేం శిరసు వంచుతాం తప్ప గుజరాత్‌కు గులాములం కాదు.. దిల్లీకి బానిసలం కాదు. ఏడెనిమిది దశాబ్దాలైనా చెక్కుచెదరని విధంగా తెలంగాణ రాష్ట్ర సమితిని తీర్చిదిద్దుతామని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు తెలిపారు. 20 ఏళ్ల ప్రస్థానంలో ప్రజాభిమానంతో తెరాస అప్రతిహతంగా ముందుకు సాగుతోందని, సంస్థాగత నిర్మాణంతో మరింత దృఢంగా తయారు చేస్తామని తెలిపారు. కేసీఆర్ మరో 20 ఏళ్లు సీఎంగా ఉంటారన్నారు. తెలంగాణ సాధనే పార్టీకి అతిపెద్ద విజయమని పేర్కొన్నారు. ఎన్నిక ఏదైనా ఘనవిజయం సాధిస్తున్నామన్నారు. ప్లీనరీ, విజయగర్జన తర్వాత మరింత ఉత్సాహంగా పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను చేపడుతూ ప్రజలతో మమేకమవుతామని తెలిపారు. ఈటలపై అభియోగాల విషయంలో చట్టం తనపని తాను చేసుకుపోతుందని, న్యాయవ్యవస్థపై తమకు అపార నమ్మకం ఉందన్నారు.
మరో 20 ఏళ్లు కేసీఆరే తెలంగాణా ముఖ్యమంత్రి
Related tags :