Politics

తెదేపా ఆఫీసు గోడలకు పోలీసు నోటీసులు. రాష్ట్రపతిని కలవనున్న చంద్రబాబు-తాజావార్తలు

తెదేపా ఆఫీసు గోడలకు పోలీసు నోటీసులు. రాష్ట్రపతిని కలవనున్న చంద్రబాబు-తాజావార్తలు

* పార్టీ ముఖ్య నేతలతో ముగిసిన చంద్రబాబు సమావేశం.సోమ, మంగళ వారాల్లో ఢిల్లీలో చంద్రబాబు బృందం పర్యటన.టీడీపీ నేతల బృందానికి సోమవారం 12.30 సమయమిచ్చిన రాష్ట్రపతి భవన్.డిల్లీలో పర్యటించనున్న 18 మంది టీడీపీ నేతల బృందం.టీడీపీ నేతలపై దాడుల గురించి రాష్ట్రపతికి తెలుపనున్న చంద్రబాబు

* ఏపీ సీఎంను పట్టుకుని బూతులు తిట్టడం సరికాదని, రాజకీయాల్లో ఉండేవారు హుందాగా మెలగాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ వర్గాలు మండిపడ్డాయి. దీనిపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి టి.జ్యోత్స్న మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రాజకీయాల్లో హుందాగా ఉండడం గురించి కేసీఆర్ కొడుకు కేటీఆర్ మాట్లాడడం ప్రపంచంలో ఎనిమిదో వింత అని వ్యంగ్యంగా అన్నారు.గతంలో తమ అధినేత చంద్రబాబుపైనా, ఇతర నేతలపైనా టీఆర్ఎస్ అధినేతలు చేసిన వ్యాఖ్యలకు టీడీపీ కార్యకర్తలు ఎన్నిసార్లు తెలంగాణ భవన్ పై దండెత్తాలి? అని ప్రశ్నించారు. మీకు తెలియని విషయాల్లో తలదూర్చొద్దని స్పష్టం చేశారు. “హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఎలా డబ్బులు పంచాలో, ఆ డబ్బులు ఎక్కడ్నించి తేవాలో అవి ఆలోచించుకో! మీ చెల్లిని దొడ్డిదారిన ఎమ్మెల్సీ చేసుకున్నారు. ఆమె భవిష్యత్తు ఏంటో దాని గురించి పట్టించుకోండి. ముందు మీ రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి మాట్లాడి, ఆ తర్వాత పక్క రాష్ట్రాల గురించి మాట్లాడండి. మీ నాన్న ఇచ్చిన పదవులను హాయిగా ఎంజాయ్ చేయండి. అంతేతప్ప టీడీపీ గురించి, మా నాయకుడి గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్త… ఓసారి ఆలోచించుకుని మాట్లాడండి” అంటూ హితవు పలికారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని జ్యోత్స్న పేర్కొన్నారు.

* ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా హామీల వర్షం కురిపిస్తున్నారు కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా. తాజాగా యూపీ ప్రజలకు మరిన్ని హామీలిచ్చారు. తాము అధికారంలోకి వస్తే 20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. నేటి నుంచి నవంబర్‌ 1 వరకు కొనసాగే ‘ప్రతిజ్ఞ యాత్రల’ ప్రారంభం సందర్భంగా ఇక్కడి బారాబంకీలో శనివారం నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు.తాము అధికారంలోకి వస్తే రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని ప్రియాంక హామీ ఇచ్చారు. కొవిడ్‌ బాధితులకు రూ.25వేల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించారు. వారంలో మహిళల కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టో విడుదల చేస్తామని చెప్పారు. ఇప్పటికే మహిళలకు 40 శాతం సీట్లు ఇస్తామని ఆమె ప్రకటించారు. 12వ తరగతి పాసైన విద్యార్థినులకు స్మార్ట్‌ఫోన్లు, డిగ్రీ పూర్తిచేసిన విద్యార్థినులకు ఎలక్ట్రిక్‌ స్కూటీలు ఇస్తామన్నారు.మరోవైపు రైతులను ఆకట్టుకునేందుకు రుణమాఫీని ప్రకటించిన ప్రియాంక.. గోధుమలకు ₹2,500 మద్దతు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా భాజపాపై విమర్శలు గుప్పించారు. లఖింపూర్‌ ఘటనలో రైతుల మృతికి కారణమైన ఆశిష్‌ మిశ్రా అరెస్ట్‌ ఎంత ఆలస్యమైందో చూశామని, ఇప్పటికీ అజయ్‌ మిశ్రా మంత్రి పదవిలో కొనసాగుతున్నారని గుర్తుచేశారు. రైతులకు అధికార భాజపా ఎంత విలువ ఇస్తుందో చెప్పేందుకు ఇవే ఉదాహరణలు అని ప్రియాంక ఎద్దేవాచేశారు.

* ప్రజలకు సరైన న్యాయం అందించాలంటే అందుకు మెరుగైన మౌలిక సదుపాయాలు చాలా ముఖ్యమని, సమర్థ న్యాయవ్యవస్థ ఉంటే దేశ ఆర్థిక వ్యవస్థ కూడా వృద్ధి చెందుతుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ అన్నారు. అయితే మన దేశంలో న్యాయవ్యవస్థలో మౌలిక సదుపాయాల ఏర్పాటు, నిర్వహణ, సరైన ప్రణాళిక లేకుండా జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందన్నారు.బాంబే హైకోర్టు ఔరంగాబాద్‌ బెంచ్‌ కొత్త భవన సముదాయ ప్రారంభోత్సవానికి జస్టిస్‌ రమణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజుజు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్‌ రమణ మాట్లాడుతూ.. ‘‘చట్టాలతో పాలించే ఏ సమాజానికైనా కోర్టులు అత్యంత కీలకమైనవి. అయితే మన దేశంలో చాలా కోర్టుల్లో సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడం కఠినమైన వాస్తవం. కొన్ని కోర్టుల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. అలాగే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. కేవలం 5శాతం కోర్టుల్లోనే మెడికల్‌ ఎయిడ్‌ అందుబాటులో ఉంది. 26శాతం కోర్టు భవనాల్లో మహిళలకు ప్రత్యేక టాయిలెట్లు లేవు. 16శాతం కోర్టుల్లో కనీసం టాయిలెట్లు లేవు. ప్రజలకు న్యాయం అందించాలంటే న్యాయపరమైన మౌలిక సదుపాయలు కూడా ముఖ్యమే. కానీ దేశంలో వీటి నిర్వహణ, పురోగతి ఏమాత్రం ప్రణాళిక లేకుండా జరుగుతుండటం కలవరపెడుతోంది’’ అని వ్యాఖ్యానించారు.

* టీడీపీ జాతీయ కార్యాలయానికి ఏపీ పోలీసులు నోటీసులు జారీ. దాడి ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలని పార్టీ కార్యాలయ సిబ్బందిని కోరిన పోలీసులు. తెదేపా పార్టీ కేంద్ర కార్యాలయంపై దుండగుల దాడి ఘటన అనంతరం కార్యాలయ ఉద్యోగి బద్రి పోలీసులకు ఫిర్యాదు. ఆయన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు కార్యాలయ రిసెప్షన్ కమిటీ సభ్యుడు కుమారస్వామికి నోటీసులు జారీ. ఈ రోజు సాయంత్రం 5 గంటలలోగా వివరాలు అందజేయాలని నోటీసుల్లో పేర్కొన్న పోలీసులు. ఈ మేరకు పార్టీ కార్యాలయం గోడకు పోలీసులు నోటీసులు అంటించారు.

* సీఎం జగన్‌ కేసుల విచారణపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసినట్లు నర్సాపురం వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు.కేసుల విచారణ వేగవంతం చేయాలని పిటిషన్‌ దాఖలు చేసినట్లు వివరించారు.ఏడాదిలోగా క్రిమినల్‌ కేసులు విచారించాలని గతంలో సుప్రీం ఆదేశాలు ఇచ్చిందని అందులో పేర్కొన్నారు.‘మా జగన్‌ నిర్దోషిగా బయటకు రావాలి’ అని పిటిషన్‌ దాఖలు చేసినట్లు రఘురామ తెలిపారు.

* తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల భూమి కంపించింది. శనివారం మధ్యాహ్నం 2.03 గంటల సమయంలో ఈ ప్రకంపనలు సంభవించాయి. భూకంప లేఖినిపై దీని తీవ్రత 4గా నమోదైంది. కరీంనగర్‌కు ఈశాన్యంగా 45 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. మంచిర్యాల జిల్లాలో పలు చోట్ల ప్రకంపనలు సంభవించాయి. మంచిర్యాలలోని రాంనగర్‌, గోసేవ మండల్‌ కాలనీ, నస్పూర్‌లో స్వల్పంగా భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లలోంచి పరుగులు తీశారు.

* సిటీ బస్సు ఎక్కిన సీఎం- అవాక్కైన ప్రయాణికులు.ఆర్టీసీ బస్సులో ప్రయాణించి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌.. ప్రయాణికుల్ని ఆశ్చర్యపరిచారు.చెన్నై కన్నాగిలోని కొవిడ్​ టీకా పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించేందుకు ఆయన వెళ్లారు. అక్కడ ఆరోగ్య సిబ్బంది, టీకా తీసుకున్నవారితో మాట్లాడారు.ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సును చూసిన స్టాలిన్‌.. తన కాన్వాయ్‌ ఆపి ఆ బస్సెక్కారు.ఈ అనూహ్య పరిణామంతో బస్సులోని డ్రైవర్‌, కండక్టర్‌, ప్రయాణికులు ఆశ్చర్యానికి లోనయ్యారు.ఆర్టీసీ బస్సుల్లో సదుపాయాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా పలువురు ప్రయాణికులు స్టాలిన్‌తో సెల్ఫీలు తీసుకున్నారు.ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తూ.. స్టాలిన్‌ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.