NRI-NRT

అమెరికా ఎన్నారైలు మామిడి హరీష్‌రెడ్డి చంద్రశేఖర్‌రెడ్డిలపై మోసం కేసు

అమెరికా ఎన్నారైలు మామిడి హరీష్‌రెడ్డి చంద్రశేఖర్‌రెడ్డిలపై మోసం కేసు

ఇంటి విక్రయం పేరుతో డబ్బులు తీసుకుని మోసానికి పాల్పడిన ఇద్దరు ఎన్‌ఆర్‌ఐలపై జూబ్లీహిల్స్​‍ పోలీస్ స్టేష‌న్‌లో చీటింగ్‌ కేసు నమోదయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్​‍ రోడ్‌ నెం 10లోని ఎంపీ ఎమ్మెల్యే కాలనీకి చెందిన మామిడి చంద్రశేఖర్‌రెడ్డితో పాటు అతడి కొడుకు మామిడి హరీష్‌రెడ్డి అమెరికాలో స్థిరపడ్డారు. అప్పుడప్పుడూ ఇండియాకు వచ్చి వెళ్తుండే చంద్రశేఖర్‌రెడ్డి ఇటీవల జూబ్లీహిల్స్​‍ రోడ్‌ నెం 2లోని ఉమెన్‌ కో అపరేటివ్‌ సొసైటీలో తన కొడుకు పేరుమీద ఉన్న 500గజాల స్థలంలోని ఇంటిని అమ్ముతానంటూ ఫిలింనగర్‌లోని అపర్ణా ఆరాలో నివాసం ఉంటున్న వ్యాపారి శ్రీకాంత్‌ వట్టికూటిని నమ్మించారు. తన కొడుకుపేరుతో ఉన్న ఈ ఇంటిపై ఎలాంటి వివాదాలు లేవని, తానే జీపీఏ హోల్డర్‌ను అని, బ్యాంకుల్లో రుణాలు లేవని, క్లియర్‌ టైటిల్‌తో పొజిషన్‌తో సహా సిద్దంగా ఉందంటూ నమ్మబలకడంతో రూ.7.75కోట్లకు బేరం కుదిరింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అడ్వాన్స్​‍గా రూ.25లక్షలు చెల్లించాలని కోరగా చంద్రశేఖర్‌రెడ్డి సూచనల మేరకు ఆయన కొడుకు హరీష్‌రెడ్డి బ్యాంకు ఖాతాలో చెక్కుద్వారా జమచేశాడు. అయితే నెలలు గడుస్తున్నా రిజిస్ట్రేషన్‌ చేయకపోవడంతో అనుమానం వచ్చిన శ్రీకాంత్‌ వాకబు చేయగా సదరు ఇంటిపై బ్యాంకులో రుణం ఉందని, కేసులు కూడా ఉన్నాయని తేలింది. దాంతో తాను మోసపోయినట్లు గుర్తించి డబ్బులు వెనక్కి ఇవ్వాలని కోరగా ముఖం చాటేశాడు. ఇటీవల ఇదే ఇంటిని రాజేష్‌రెడ్డి అనే వ్యక్తికి అధిక ధరకు అమ్మేందుకు మరో అగ్రిమెంట్‌ కుదుర్చుకోవడమే కాకుండా రూ.2కోట్ల దాకా అడ్వాన్స్​‍ తీసుకున్నట్లు తేలడంతో చంద్రశేఖర్‌రెడ్డితో పాటు అతడి కొడుకు హరీష్‌రెడ్డి ఉద్దేశ్యపూర్వ కంగానే మోసానికి పాల్పడుతున్నారని గుర్తించిన శ్రీకాంత్‌ జూబ్లీహిల్స్​‍ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు చంద్రశేఖర్‌రెడ్డి, హరీష్‌రెడ్డిలపై ఐపీసీ 406,420 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.