Food

ఉద్దానం గూనచారు

ఉద్దానం గూనచారు

ఉద్దానం ప్రాంతంలో చేసే విందుల్లో విశేష వంటకం ‘గూనచారు’. వేడివేడి అన్నంలో గూనచారు వేసుకుంటే ‘ఆహా ఏమి రుచి.. తినరా మైమరచి’ అంటూ పాట పాడక తప్పదు. ఈ వంటకం అంత రుచికరంగా ఉంటుంది మరి. అరచేతికి అంటిన గూనచారు వాసన వారం రోజులపాటు పోదంటే అతిశయోక్తి కాదు. శ్రీకాకుళం జిల్లాలో ‘భోజీ పులుసు’గా పిలిచే గూనచారు కేవలం ఉద్దానం ప్రాంతానికే సొంతం. మట్టి బాన (పెద్ద కుండ)లో తయారు చేసే ఈ చారు 10 నుంచి 15 రోజులపాటు నిల్వ ఉంచినా చెక్కు చెదరకుండా.. రంగూ, రుచి పోకుండా అంతే రుచిగా ఉంటుంది. ఈ చారును ఉద్దానం వాసులు ఇతర రాష్ట్రాల్లో ఉండే మిత్రులు, బంధువులు, సహోద్యోగులకు పంపిస్తుంటారు.
***పోషకాల రారాజు
గూనచారులో అన్నిరకాల పోషక విలువలు ఉంటాయని విశ్రాంత వైద్యాధికారి డాక్టర్‌ పూడి రామారావు తెలిపారు. ముఖ్యంగా ఇందులో ఏ, బీ, సీ, డీ, కే విటమిన్లు ఉంటాయని చెప్పారు. ఇది క్యాన్సర్‌ నిరోధకంగా పని చేస్తుందని.. రక్తహీనతను తగ్గించే ఔషధ గుణాలు, నరాల బలహీనతను తగ్గించే గుణాలు, వీర్యకణాల వృద్ధి, ఐరన్, మాంసకృత్తులు, శరీర నిర్మాణానికి అవసరమైన ప్రొటీన్లు పుష్కలంగా ఉన్నాయని ఆయన వివరించారు. గూనచారు ఎసిడిటీని రూపుమాపుతుందని పేర్కొన్నారు.
**ఇలా తయారు చేస్తారు
* మొదట చింతపండు నానబెట్టి రసం తీయాలి. ఆ రసాన్ని కనీసం గంటపాటు బానలో మరిగించాలి. మరిగించిన రసంలో బెల్లం, పసుపు పొడి, కారం, అరటి ముక్కలు, మునగ, పనస ఇత్యాది కూర ముక్కలు కలపాలి.
* ఇలా తయారైన రసాన్ని మరో గంటసేపు మరిగించాలి. అందులో బాగా వేయించిన బియ్యం పిండిని కలుపుకుని పక్కన పెట్టుకోవాలి.
*పోపు పెట్టడం చాలా ముఖ్యమైన ఘట్టం. మొదటిగా వంటనూనెను పావుగంట మరిగించాలి. తరువాత ఉల్లికి గాట్లు పెట్టి ఆ నూనెలో వేసి బాగా వేయించాలి. తర్వాత ఎండుమిరప కాయల్ని దోరగా వేయించాలి. తర్వాత అల్లం, వెల్లుల్లి ముద్దలు వేయాలి. ఈ పోపు కార్యక్రమం ఇంచుమించు గంటసేపు సాగాలి.
* తయారైన పోపుని బియ్యం పిండి కలిపి, మరిగించిన చింతపండు రసంలో కలిపి తగినంత ఉప్పు, కారం పొడి అందులో వేయాలి. ఆ తరువాత బానపై మూతపెట్టి అరగంట సేపు ఉంచాలి. అంతే.. భోజీ పులుసు అదేనండీ.. అదే ఉద్దానం ‘పేటెంట్‌’ గూనచారు తయార్‌.