* హుజూరాబాద్ ఉప ఎన్నికలో తెరాసదే విజయమని అన్ని సర్వేలు చెబుతున్నాయని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు. ఓటమి ఖాయమని తెలిసే విపక్షాలు తెరాసపై దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. సంక్షేమ పథకాలే తెరాసకు విజయాన్ని అందిస్తాయన్నారు. గోబెల్స్ ప్రచారంతో గెలవాలని భాజపా యత్నిస్తోందని విమర్శించారు. ఇవాళ్టితో ఉప ఎన్నిక ప్రచార గడువు ముగియడంతో హుజూరాబాద్‌లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. ‘‘2001 నుంచి తెరాస విజయబావుటా కొనసాగుతోంది. రైతుబంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, పింఛన్లను మేం నమ్ముకున్నాం. కేంద్ర నిధులపై తెరాస విసిరిన సవాలుకు భాజపా నేతల వద్ద సమాధానం లేదు. ఇవాళ లీటర్ డీజిల్‌పై కేంద్రం రూ.31 వసూలు చేస్తోంది. యూపీఏ పాలనలో చమురుపై కేంద్రం పన్ను రూ.4 మాత్రమే ఉండేది. పెట్రోల్, డీజిల్ ధరను భాజపా తగ్గిస్తుందా?ఏడేళ్లలో రాష్ట్రానికి భాజపా ఏం చేసిందో ఆ పార్టీ నేతలు చెప్పాలి. దళితబంధును ఆపింది ముమ్మాటికీ భాజపా నేతలే. ధళితబంధుపై ప్రేమేందర్ రెడ్డి ఈసీకి లేఖ రాశారు. ప్రజా సమస్యలపై భాజపా నేతలు ఎప్పుడైనా చర్చించారా? విద్వేషాలు రెచ్చగొట్టి గెలవాలనేది భాజపా ఉద్దేశం. సాగు చట్టాలు రద్దు చేయాలని ఏడాదిగా రైతులు పోరాడుతున్నారు. ధర్నా చేస్తున్న రైతులను కేంద్ర మంత్రి కుమారుడు కారుతో తొక్కించారు. రైతుల చావుకు కారణమైన కేంద్ర మంత్రిపై ఇప్పటికీ చర్యల తీసుకోలేదు. ధర్నా చేస్తున్న రైతులను కొట్టాలని ఒక భాజపా సీఎం పిలుపునిచ్చారు. రైతులను కారుతో తొక్కించిన చరిత్ర భాజపాది. త్వరలోనే భాజపా నెత్తిన గ్యాస్ బండ పడటం ఖాయం’’ అని హరీశ్‌రావు తెలిపారు.
* తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫోన్‌లో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో తెదేపా కార్యాలయాలపై జరిగిన దాడి వివరాలు, ఇతరత్రా అంశాలపై చర్చించేందుకు చంద్రబాబు ఇటీవల దిల్లీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. దిల్లీ పర్యటనలో భాగంగా చంద్రబాబు.. అమిత్ షా అపాయింట్‌మెంట్ కోరారు. అదే సమయంలో కశ్మీర్ పర్యటన, వరుస కార్యక్రమాల కారణంగా అమిత్ షా సమయం ఇవ్వలేకపోయారు. కశ్మీర్ పర్యటన నుంచి తిరిగొచ్చిన అమిత్ షా ఇవాళ చంద్రబాబుకు ఫోన్ చేసి మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలపై అమిత్ షాతో చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం నడుస్తోందని ఈ సందర్భంగా రాష్ట్ర పరిణామాలను చంద్రబాబు అమిత్‌షాకు వివరించినట్లు సమాచారం. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా తెదేపా నేతలు పోరాడుతుంటే వైకాపా దాడులకు తెగపడటంతో పాటు పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ బాధితులపైనే అక్రమ కేసులు బనాయిస్తోందని ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
* నగరంలోని నల్లగండ్లలో జరిగిన నర్సు నాగచైతన్య హత్య కేసులో చందానగర్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడు కోటిరెడ్డిని పోలీసులు ఒంగోలు నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. విచారణలో తానే హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. కత్తితో నాగచైతన్య గొంతు కోసి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. కోటిరెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం రిమాండ్‌కు తరలించనున్నారు. ఘటన అనంతరం గాయాలతో ఉన్న నిందితుడు భయంతో ఒంగోలు పారిపోయి అక్కడ ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు.
* విడాకుల అనంతరం సింగిల్‌గా ఉన్న నటుడు మంచు మనోజ్ త్వరలో మరోసారి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఓ విదేశీ యువతిని ఆయన పెళ్లి చేసుకోనున్నారని.. అందుకు కుటుంబసభ్యులు సైతం పెళ్లి ఏర్పాట్లలో బిజీ అయ్యారని గత కొన్నిరోజుల నుంచి వరుస కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో సదరు వార్తలపై తాజాగా మంచు మనోజ్ షాక్‌కు గురయ్యారు. అవన్నీ అవాస్తవాలేనని తేల్చి చెప్పేశారు. ‘‘దయచేసి.. నన్ను కూడా పెళ్లికి పిలవండి. ఇంతకీ పెళ్లి ఎక్కడ చేస్తున్నారు? ఆ బుజ్జి, తెల్ల పిల్ల ఎవరు?! మీ ఇష్టం రా అంతా మీ ఇష్టం!!’’ అని మనోజ్ ట్వీట్ చేశారు. దీంతో మనోజ్ పెళ్లి వార్తల్లో ఎలాంటి నిజం లేదని మరోసారి స్పష్టత వచ్చింది.
* మాదకద్రవ్యాల కేసులో బెయిల్ కోసం బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ఎదురుచూపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆర్యన్‌తో పాటు అర్బాజ్ మర్చెంట్, మూన్‌మూన్ ధమేచా దాఖలు చేసిన బెయిలు పిటిషన్‌పై వరుసగా రెండో రోజూ సుదీర్ఘ వాదనలు కొనసాగినా ఎవరికీ బెయిల్ రాలేదు. ఈ కేసులో వాదనలను గురువారం వింటామని వెల్లడించిన బాంబే హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం తదుపరి విచారణను వాయిదా వేసింది. రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ కేసు విచారణను కొనసాగిస్తామని న్యాయమూర్తి జస్టిస్ సాంబ్రే ప్రకటించారు. మరోవైపు, ఎన్‌సీబీ తరఫున ఏఎస్‌సీ అనిల్ సింగ్ కోర్టుకు హాజరయ్యారు. నిందితుల తరఫున ముకుల్ రోహత్గీ, అమిత్ దేశాయ్, అలీ కాశీఫ్ ఖాన్ దేశ్‌ముఖ్ వాదనలకు ఆయన సమాధానం ఇవ్వాల్సి ఉండగా.. మరో గంటలో తన వాదనలను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తానని ఏఎస్‌జీ అనిల్ సింగ్ తెలిపారు. దీంతో ఈ కేసులో తదుపరి వాదనలను రేపటికి వాయిదా వేశారు.
* ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. రాష్ట్రంలో భారీ పర్యాటక ప్రాజెక్టులపై బోర్డు సమావేశంలో చర్చించారు. పలు ప్రతిపాదనలకు స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్‌ఐపీబీ) ఆమోదం తెలిపింది. ఒక్కో ప్రాజెక్టుపై కనీసం రూ.250 కోట్ల పెట్టుబడులు వస్తాయని.. వివిధ ప్రాజెక్టులపై మొత్తంగా రూ.2,868.60 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్నట్లు ఎస్‌ఐపీబీ వెల్లడించింది. ఈ ప్రాజెక్టుల ద్వారా 1,564 గదులు అందుబాటులోకి రానున్నట్లు పేర్కొంది. రానున్న ఐదేళ్లలో 1,564 గదులను పూర్తి చేస్తామని కంపెనీల ప్రతినిధులు తెలిపారు.
* ప్రభుత్వంలో విలీనం చేయాలని ఎయిడెడ్ విద్యా సంస్థలను సర్కార్ బలవంతం చేయడం లేదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు. విద్యా సంస్థల అంగీకారంతోనే ప్రభుత్వం వాటిని తీసుకుంటుందన్నారు. విద్యా సంస్థలను ఎవరు నడిపినా ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొన్నారు. తామే నడుపుకుంటామంటే వెనక్కి తీసుకోవచ్చని స్పష్టం చేశారు.
* హుజూరాబాద్ ఉప ఎన్నికలో తమ అభ్యర్థి ఈటల రాజేందర్ భారీ మెజారిటీతో గెలవబోతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రజలు తమ పార్టీ సామర్థ్యాన్ని నమ్మి ఓట్లేయబోతున్నారని చెప్పారు. కరీంనగర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హుజూరాబాద్ ప్రజల్ని అయోమయానికి గురి చేయాలని తెరాస నేతలు చూస్తున్నారని ఆరోపించారు. దళితబంధు విషయంలో వాళ్లు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారన్నారు.
* మంత్రి పదవిలో ఉన్నప్పుడే ఈటల రాజేందర్ హుజూరాబాద్ నియోజకవర్గానికి ఏమీ చేయలేదని.. ఎమ్మెల్యేగా గెలిస్తే ఏం చేస్తారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నించారు. ఈటలను తెలంగాణకు పరిచయం చేసింది సీఎం కేసీఆరేనని చెప్పారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా హుజూరాబాద్ వచ్చిన ఆయన.. మీడియాతో మాట్లాడారు. అవినీతి ఆరోపణలు ఈటలపైనే ఎందుకొచ్చాయని శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నించారు. ఆయనది బయట బీసీ కార్డు.. లోపల ఓసీ కార్డు అని ఎద్దేవా చేశారు.
* సీఎం జగన్ పాలనలో రైతుల ఇళ్లలో చీకటి నిండిందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. రైతు భరోసా కింద ఎన్ని నిధులు విడుదల చేశారో చెప్పగలరా అని ప్రశ్నించారు. రూ.30 కోట్లు విడుదల చేసి.. రూ. 1,213 కోట్లు ఇచ్చినట్లు రైతుల్ని మోసగిస్తారా అని నిలదీశారు. తప్పుడు ప్రకటనలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న జగన్ క్షమాపణలు చెప్పాలని అచ్చెన్న డిమాండ్ చేశారు.
* అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ.. పంజాబ్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి పదవిని వీడిన అమరీందర్ సింగ్.. త్వరలో కొత్త పార్టీని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. దీనిపై బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పంజాబ్‌లో త్వరలో పార్టీ పెట్టబోతున్నట్లు, కొద్ది రోజుల తర్వాత ఆ వివరాలు వెల్లడిస్తానని చెప్పారు.
* దేశంలో పెట్రోల్ ధరలు రోజురోజుకు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. లీటరు ధర వంద రూపాయల మార్కు దాటిన అనంతరం ఇవి మరింత వేగంగా పైపైకి ఎగబాకుతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఓ జిల్లాలో ఏకంగా లీటరు పెట్రోల్ ధర రూ.120 మార్కును దాటింది. ఇక్కడే కాకుండా దేశంలో చాలా ప్రాంతాల్లోనూ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.110కిపైగా ఉండడం వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది.
* డ్రోన్ల వినియోగం పెరుగుతుండడంతో వాటి ‘ట్రాఫిక్’ను క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఏర్పడింది. దాంతో కేంద్ర పౌర విమానయాన శాఖ ‘డ్రోన్ల ట్రాఫిక్ నిర్వహణ ప్రణాళిక’ను రూపొందిస్తూ ఆదేశాలు ఇచ్చింది. వీటికి అనుగుణంగా ప్రభుత్వ, ప్రైవేటు, తృతీయపక్ష సేవలు అందించే సంస్థలు విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది. డ్రోన్లన్నీ 1,000 అడుగుల ఎత్తుకు మించకుండా ఎగరాల్సి ఉన్నందున ఆ మేరకు నిబంధనలు రూపొందించింది.
* డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ అరెస్టు కంటే మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ చేస్తోన్న ఆరోపణలే అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆర్యన్ కేసులో కీలకంగా వ్యవహరించిన ఎన్‌సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై గత కొద్ది రోజులుగా ఆయన సంచలన ఆరోపణలు చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా పలు ఫొటోలు, లేఖలు విడుదల చేస్తున్నారు. బుధవారం మరోసారి తన ఆరోపణల్ని కొనసాగించారు. ‘క్రూయిజ్ నౌక డ్రగ్స్ కేసుల దర్యాప్తును నిర్వీర్యం చేసేందుకు నేను ప్రయత్నిస్తున్నానని ఆరోపిస్తున్నారు. కానీ, వాస్తవాలను బయటకు తీసుకురావడమే నా పని. ఆ నౌకలో డ్రగ్ మాఫియా ఉంది. దాని గురించి అధికారులందరికీ తెలుసు. అక్కడున్న వ్యక్తుల గురించి మీకు త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తాను. అలాగే ఈ కేసులో ఎలక్ట్రానిక్ సాక్ష్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని ఎన్‌సీబీ చెప్తోంది. అయితే, సమీర్ వాంఖడే, ప్రభాకర్ సాయీల్, కిరణ్ గోసావి, వాంఖడే డ్రైవర్‌కు సంబంధించిన కాల్ వివరాలను పరిశీలించాలి. ఒకసారి దర్యాప్తు చేస్తే మొత్తం స్పష్టంగా తెలిసిపోతుంది. గతంలో దీపికా, సారా అలీఖాన్, శ్రద్ధా కపూర్‌ను కూడా ఎన్‌సీబీ విచారణకు పిలిచింది. కానీ, ఒక్క అరెస్టు చేయలేదు. ఈ విషయాన్ని మనం ఒకసారి లెక్కలోకి తీసుకోవాలి. నిజం తెలుసుకునేందుకు మాల్దీవుల పర్యటనను కూడా గమనించాలి’ అంటూ మరోసారి సమీర్ వాంఖడేపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
* దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించిన పెగాసస్ స్పైవేర్‌తో ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపేందుకు స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఆర్.వి. రవీంద్రన్ ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారని పేర్కొంది. నిపుణుల కమిటీ పనితీరును తామే పర్యవేక్షిస్తామని స్పష్టం చేసింది. పెగాసస్‌పై వచ్చిన ఆరోపణలను క్షుణ్ణంగా పరిశీలించి నివేదికను కోర్టుకు సమర్పించాలని కమిటీని ఆదేశించింది. వ్యక్తుల గోప్యత హక్కు ఉల్లంఘన జరిగిందా లేదా అన్నది ఈ కమిటీ పరిశీలిస్తుందని పేర్కొంది. దీనిపై తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. పెగాసస్ స్పైవేర్ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు చేయించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై గతంలో విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. తాజాగా బుధవారం తీర్పును వెలువరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం.. కీలక వ్యాఖ్యలు చేసింది. తప్పనిసరి పరిస్థితుల దృష్ట్యా ఈ కమిటీని ఏర్పాటు చేయాల్సి వచ్చిందని తెలిపింది. దేశ పౌరులపై వివక్షాపూరితమైన నిఘాను తాము ఎన్నటికీ అనుమతించబోమని కోర్టు వెల్లడించింది.