* ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి(AP CM YS Jagan Mohan Reddy)ని చూసి చాలా రోజులైందని, అందుకే తాను విజయవాడ వచ్చినట్లు సినీ నటుడు, నిర్మాత నాగార్జున (Nagarjuna) అన్నారు. గురువారం ఏపీ మంత్రి వర్గ సమావేశం అనంతరం నాగార్జునతో సీఎం జగన్ భేటీ అయ్యారు. ఇద్దరూ కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా పలు అంశాలను ఇరువురు చర్చించినట్లు తెలుస్తోంది. రాబోయే రెండు నెలల్లో తెలుగు చిత్ర పరిశ్రమ(Tollywood)లో సందడి నెలకొననుంది. వరుసగా అటు అగ్ర హీరోలు, ఇటు యువ కథానాయకుల సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. సినిమా ప్రదర్శనల విషయంలో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం నిర్మాతలకు నష్టం కలిగించేది ఉందనే అభిప్రాయం ఇండస్ట్రీలో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆన్లైన్ టికెట్ల విక్రయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో టికెట్ల రూపంలో వచ్చిన డబ్బును నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్‌కు వీలైనంత త్వరగా ప్రభుత్వం ఇవ్వకపోతే వారు నష్టపోయే ప్రమాదం ఉందని సినీ పెద్దలు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్‌తో నాగార్జున భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. సినిమాటోగ్రఫీ చట్టంలో మార్పులు, టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలు తదితర అంశాలపై ఇరువురు చర్చించినట్లు తెలుస్తోంది. సీఎం క్యాంపు కార్యాలయం నుంచి నాగార్జున నేరుగా గన్నవరం విమానాశ్రయానికి వెళ్లిపోయారు. అక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. ‘జగన్ నా శ్రేయోభిలాషి. ఆయనను చూసి చాలా రోజులవుతోంది. అందుకే విజయవాడకు వచ్చా. సీఎం జగన్‌తో కలిసి లంచ్ చేశా. విజయవాడ రావడం నాకు ఆనందంగా ఉంది’ అని వెళ్లిపోయారు. నాగార్జున వెంట నిర్మాతలు ప్రీతంరెడ్డి, నిరంజన్‌రెడ్డిలు ఉన్నారు.
* మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ కేసుకు సంబంధించి మొత్తంగా నలుగురు నిందితులపై ఛార్జ్‌షీట్ దాఖలైంది. వివేకా హత్య కేసులో నిందితులుగా ఉన్న టి.గంగిరెడ్డి, వై.సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి, షేక్ దస్తగిరిపై సీబీఐ అభియోగపత్రం దాఖలు చేసింది.
* ఆకలి బాధను నివారించడానికి సామాజిక వంటశాలలు ఏర్పాటు చేసే విషయమై విధానపర నిర్ణయాన్ని తీసుకోవాలని సుప్రీంకోర్టు బుధవారం కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే ఇలాంటి పథకాలు అమలవుతున్నందున వాటితో సమన్వయం చేసుకోవాలని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం లేకపోతే ఈ పథకం అమలు కష్టమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. సామాజిక కార్యకర్తలు అరుణ్ ధావన్, ఇషాన్ ధావన్, కుంజన సింగ్‌లు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా ఈ సూచనలు చేసింది. కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ మాధవీ దివాన్ వాదనలు వినిపిస్తూ పిల్లల్లో పౌష్టికాహార లోపం తలెత్తకుండా లేకుండా చూసేందుకు సామాజిక వంటశాలలు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని చెప్పారు. పిల్లల్లో పౌష్టికాహార లోపంతో పాటు, ఆకలి చావులు ఉన్నాయన్న ఆరోపణలపై సంక్షిప్తంగా సమాధానాలు ఇవ్వాలని ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్, ఒడిశా రాష్ట్రాలను ఆదేశించింది. ఈ సంఘటనలపై జిల్లాలు, తాలూకాలు, గ్రామాల వారీగా వివరాలు ఇవ్వాలని సూచించింది. సామాజిక వంటశాలల అంశంపై సమాచారం ఇవ్వని మణిపుర్ రాష్ట్రానికి జరిమానా విధిస్తూ రెండు వారాల్లో చెల్లించాలని ఆదేశించింది. ఇదివరకే జరిమానా విధించినా చెల్లించని రాష్ట్రాలు నాలుగు వారాల్లో ఆ మొత్తాన్ని బ్యాంకుల్లో ఫిక్సిడ్ డిపాజిట్ చేయాలని సూచించింది. తదుపరి విచారణను నవంబరు 16వ తేదీకి వాయిదా వేసింది.
* హుజూరాబాద్ ఉపఎన్నిక నాలుగు కోట్ల మందికి … నలుగురు కుటుంబ సభ్యులకు మధ్య జరిగే కొట్లాట అని మాజీమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. హుజూరాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లి, చిన్నపాపయ్యపల్లి గ్రామాల్లో బుధవారం ఆయన భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో కలిసి ప్రచారం చేశారు.. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అహంకారాన్ని దించాలంటే ఈ బిడ్డ అసెంబ్లీకి వెళ్లాలన్నారు. తెరాస జెండాకు ఓనర్లమని కొట్లాడితేనే హరీశ్‌రావుకు మంత్రి పదవి వచ్చిందన్నారు. ఆ పదవి కోసం ఇప్పుడు ఆయన నోరుమూసుకున్నారన్నారు. పార్టీలో ఉన్నంతకాలం ఏ పదవి ఇచ్చినా దానికి వన్నె తెచ్చానని ఈటల తెలిపారు. డీకే అరుణ మాట్లాడుతూ రాష్ట్రంలో దొరల పాలన వచ్చిందన్నారు. బంగారు తెలంగాణ చేస్తానన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. తన కుటుంబాన్ని మాత్రం బంగారంగా మార్చుకున్నారన్నారు. ఈ ఉపఎన్నికలో భాజపా గెలుపును ఎవరూ ఆపలేరన్నారు.
* వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సిందేనని పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో కోటి ఎకరాల మాగాణి పండిస్తామని, తెలంగాణను రైస్ బౌల్ చేస్తామని చెప్పిన కేసీఆర్ మాటలు ఏమయ్యాయని నిలదీశారు. అకస్మాత్తుగా వరి వేయొద్దంటే ఎలాగన్నారు. సిద్దిపేట కలెక్టర్ వెంకటరామరెడ్డి తీరును పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. సుప్రీంకోర్టుకు వెళ్లినా వినను అని చెప్పడానికి ఆయనకు ఉన్న అధికారాలేంటని ప్రశ్నించారు. రైతుల పక్షాన పార్టీ పోరాటం చేస్తుందని ఉత్తమ్ స్పష్టంచేశారు. హుజూరాబాద్ ఓటర్లు కాంగ్రెస్‌కు మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. రైతులు వరి సాగుకు సిద్ధమైన సమయంలో ప్రభుత్వం హఠాత్తుగా భయాందోళనలకు గురిచేస్తోందని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ రాష్ట్ర ఛైర్మన్ మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. ఏ పంట సాగు చేయాలో రైతులకు స్వేచ్ఛ ఉండాలని, ఆంక్షలు సరికాదని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి అన్నారు. విలేకరుల సమావేశంలో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ పాల్గొన్నారు.
* భారత్ 2018 తర్వాత తొలిసారి అగ్ని-5 క్షిపణిని పరీక్షించింది. ఓ పక్క చైనాతో వివాదం చిక్కుముడులు పడుతున్న వేళ ఈ ఖండాంతర క్షిపణి పరీక్ష జరిగింది. ఈసారి పరీక్షను భారత్ వ్యూహాత్మక దళాల కమాండ్ (స్ట్రాటజిక్ ఫోర్స్ కమాండ్) చేపట్టింది. అగ్ని-5ను దళాల్లోకి చేర్చేందుకు వీలుగా చేపట్టిన యూజర్ ట్రయల్ ఇది. ఈ పరీక్షలో డీఆర్డీవో రాడార్ నౌకలు, టెలీమెట్రీల్లో గమనించింది. కేవలం 18 నిమిషాల్లోపే ఇది లక్ష్యాన్ని ఛేదించింది.
* సీఎం జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సమావేశం అనంతరం రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను మంత్రి పేర్ని నాని మీడియాకు వెల్లడించారు. ఆన్లైన్లో టికెట్ల విక్రయాలకు వీలుగా సినిమాటోగ్రఫీ చట్ట సవరణ ఆర్డినెన్స్‌కు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసినట్లు పేర్ని నాని తెలిపారు. దేవాదాయశాఖ స్థలాలు, దుకాణాల లీజు అంశంపై చట్ట సవరణ, దేవాదాయ శాఖలో విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ ఏర్పాటు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ‘అమ్మఒడి’ పథకం అమలుపై కేబినెట్లో చర్చ జరిగినట్లు చెప్పారు. అమ్మఒడి పథకానికి 75 శాతం హాజరు ఉండాలన్న అంశంపై విస్తృతంగా ప్రచారం చేసే అంశానికి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. 2021 నవంబరు 8 నుంచి 2022 ఏప్రిల్ 30 వరకు హాజరును పరిగణనలోకి తీసుకుంటామని.. మొత్తం 130 రోజుల్లో 75 శాతం హాజరు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. గత ఏడాది కొవిడ్ కారణంగా హాజరుకు మినహాయింపు ఇచ్చినట్లు వివరించారు.
* వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్ యూజీ ఫలితాలను ప్రకటించేందుకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. ఈ మేరకు నీట్ యూజీ ఫలితాలు ఇవ్వొద్దని గతంలో బాంబే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. ఫలితాలను ప్రకటించాలని జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)ను ఆదేశించింది. ఈ ఏడాది సెప్టెంబరు 12న నీట్ ప్రవేశ పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. అయితే మహారాష్ట్రలో ఈ పరీక్షకు హాజరైన ఇద్దరు అభ్యర్థుల టెస్టు బుక్లెట్, ఓఎంఆర్ షీట్లు పరీక్షా కేంద్రంలో తారుమారయ్యాయి. దీంతో వీరు బాంబే హైకోర్టును ఆశ్రయించగా.. నీట్ ఫలితాలపై ఉన్నత న్యాయస్థానం స్టే విధించింది. అంతేగాక, ఆ ఇద్దరు విద్యార్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించి ఆ తర్వాత ఫలితాలను ప్రకటించాలని ఆదేశించింది. దీనిపై ఎన్టీఏ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఫలితాల ప్రకటన ఆలస్యమైతే అది వైద్య విద్యలో ప్రవేశాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని పేర్కొంది. ఎన్టీఏ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. బాంబే హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది. ‘‘ఈ ఫలితాల కోసం 16లక్షల మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. కేవలం ఇద్దరి కోసం ఫలితాల విడుదలను ఆపలేం. అందుకే హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తున్నాం. ఎన్టీఏ ఫలితాలను ప్రకటించొచ్చు. ఆ ఇద్దరు విద్యార్థుల సమస్యను మళ్లీ పరిశీలిస్తాం’’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనిపై తదుపరి విచారణను నవంబరు 12కి వాయిదా వేసింది.
* ఏపీలో వైద్య విద్య, కుటుంబ సంక్షేమ శాఖలో కొత్త ఉద్యోగాలకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ భేటీ నిర్ణయాలను మంత్రి పేర్ని వెల్లడించారు. వైద్య శాఖలో కొత్తగా 1,285 ఉద్యాగాలు, అర్బన్ హెల్త్ క్లినిక్స్‌లో 560 ఫార్మాసిస్టులు, వైద్య కళాశాలల్లో 2,190 మంది నియామకానికి కేబినెట్ ఆమోదం తెలిపినట్లు చెప్పారు. ఆన్లైన్లో టికెట్ల విక్రయాలకు వీలుగా సినిమాటోగ్రఫీ చట్ట సవరణ ఆర్డినెన్స్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు.
* తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో సీఎం కేసీఆర్ రైతులను గందరగోళానికి గురి చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఈ అయోమయ స్థితిలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రతి గింజ కొనుగోలు చేస్తామని సీఎం గతంలో చెప్పారన్నారు. వరి సాగుపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నాంపల్లిలోని భాజపా కార్యాలయంలో బండి సంజయ్ దీక్షకు దిగారు. ఏ ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వరిసాగు చేయొద్దంటోందని ప్రశ్నించారు.
* సోషల్ మీడియాలో జడ్జిలు, కోర్టులపై అనుచిత వ్యాఖ్యల కేసుపై గురువారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు తొలగించేందుకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఈ సందర్భంగా హైకోర్టు సీబీఐని ప్రశ్నించింది. సీబీఐ ఎస్పీ రేపు కోర్టుకు హాజరుకావాలని ధర్మాసనం ఆదేశించింది. అనంతరం విచారణ రేపటికి వాయిదా పడింది. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 11 మందిని సీబీఐ అరెస్టు చేసింది.
* హుజూరాబాద్‌లో ఓటర్లను ఆకర్షించేందుకు కొందరు తాయిలాలు ఇద్దామనుకొంటే.. అది కాస్తా వికటించి సరికొత్త గొడవలకు దారి తీస్తోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో నువ్వా.. నేనా.. అనే విధంగా పార్టీలు ప్రచారం చేశాయి. ప్రస్తుతం ప్రచార గడువు ముగియడంతో పలు గ్రామాల్లో డబ్బులు రాలేదని గొడవలు మొదలయ్యాయి. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ప్రతి గ్రామానికి సీల్డ్ కవర్లలో డబ్బు చేరిన విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
* దిల్లీలో నిర్వహించిన సీరోలాజికల్ సర్వేలో ఆసక్తికర ఫలితాలు వెల్లడయ్యాయి. నగరంలోని 90 శాతం మందిలో యాంటీబాడీస్ ఉన్నట్లు సర్వే రిపోర్టులో తేలింది. సెప్టెంబర్ 23 నుంచి నిర్వహించిన ఆరో దశ సీరో సర్వేలో ఈ విషయం తేలింది. అయితే, సీరో సర్వేలో దాదాపు 90 శాతం మందిలో యాంటీబాడీలు ఉన్నట్లు గుర్తించినప్పటికీ హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చినట్లు చెప్పలేమని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
* ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్.. పల్సర్ 250 మోడల్‌ను భారత్‌లో విడుదల చేసింది. పల్సర్ ఎన్250 పేరుతో విపణిలోకి వచ్చిన ఈ బైక్ ధర రూ.1.38లక్షలు, దీంతో పాటు, పల్సర్ ఎఫ్250 రూ.1.40లక్షల ధర (ఎక్స్ షోరూమ్ దిల్లీ)తో మరో మోడల్‌ను విడుదల చేసింది. 220ఎఫ్‌కు ప్రత్యామ్నాయంగా పల్సర్ 250ఎఫ్‌ను విడుదల చేశారు. గురువారం నుంచే బుకింగ్స్ చేసుకోవచ్చని బజాజ్ తెలిపింది.
* గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్.. చంద్రబాబుపై వాడిన భాష జుగుప్సాకరమని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు. గురువారం దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… వైకాపా నేతల తీరును తప్పుబట్టారు. ‘‘ భాష గురించి ఇప్పుడు జగన్ మాట్లాడటం దౌర్భాగ్యం. చంద్రబాబుపై మంత్రులు ఇష్టారీతిన మాట్లాడారు. ఇలాంటి భాష, సంస్కృతికి వైకాపానే కారణం. తెదేపా కార్యాలయంపై పోలీసులే దగ్గరుండి దాడి చేయించారు. కానీ, దాడి చేసిన వారిపై బెయిలబుల్ కేసులు పెట్టి, తెదేపా నేతలపై నాన్‌బెయిలబుల్ కేసులు పెట్టారు. చంద్రబాబు నివాసంపై దాడికి యత్నించిన వైకాపా ఎమ్మెల్యే జోగి రమేష్‌ను డీజీపీ వెనకేసుకొచ్చారు. చంద్రబాబుతో చర్చించడానికి జోగి రమేశ్ వచ్చారని డీజీపీ చెప్పుకొచ్చారు. పరుష వ్యాఖ్యలు చేసినందుకు పార్టీ గుర్తింపు రద్దు చేయాల్సి వస్తే… మొదట వైకాపా గుర్తింపు రద్దు చేయాల్సి ఉంటుంది’’ అని కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు.
* వైకాపా నేతల బృందం ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి తెలుగుదేశం పార్టీపై ఫిర్యాదు చేసింది. ఈసీని కలిసిన అనంతరం రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. తెదేపా నేతలు లోకేశ్, పట్టాభి చేసిన పరుష వ్యాఖ్యలను ఈసీకి వివరించినట్టు చెప్పారు. తెలుగుదేశం పార్టీ గుర్తిపును రద్దు చేయాలని కోరామని వివరించారు. శాసనమండలిలో 14 స్థానాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేయాలని కోరామని తెలిపారు. తమ విజ్ఞప్తులపై ఈసీ సానుకూలంగా స్పందించిందని విజయసాయి వెల్లడించారు. తెదేపా కార్యాలయం, పట్టాభి నివాసంపై వైకాపా శ్రేణులు దాడి చేయడాన్ని నిరసిస్తూ తెదేపా అధినేత చంద్రబాబు రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదుచేసిన విషయం తెలిసిందే. అందుకు పోటీగా ఇవాళ వైకాపా నేతలు ఈసీని కలిసి తెదేపాపై ఫిర్యాదు చేశారు.
* ఆర్యవైశ్య సత్రాలపై ప్రభుత్వ అజమాయిషీ లేకుండా కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. కేబినెట్ సమావేశం అనంతరం వెల్లంపల్లి మీడియాతో మాట్లాడుతూ.. శారదాపీఠానికి భూమి కేటాయిస్తే కొందరు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. హిందూ ధర్మం కాపాడుకునేందుకు, వేద పాఠశాల నిర్మాణం కోసం శారదా పీఠానికి భూమి ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు. అనంతపురంలో గణపతి సచ్ఛిదానంద స్వామి ఆశ్రమానికి 17 ఎకరాల భూమి ఇవ్వాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. అన్నింటిలోనూ రాజకీయాలు చేయొద్దని తెదేపాకి సూచించారు. తెదేపా హయాంలో ఈషా ఫౌండేషన్‌కు కూడా భూమి ఇచ్చారని గుర్తు చేశారు. ధర్మాన్ని కాపాడేవారికి ప్రభుత్వం సహకరిస్తుందని పేర్కొన్నారు. ఆర్యవైశ్య సత్రాల్లో భక్తులకు ఆశ్రయం కల్పిస్తారని, అన్నదాన సదుపాయం ఉంటుందని మంత్రి వెల్లంపల్లి స్పష్టం చేశారు.
* అమరావతి ఉద్యమాన్ని విస్తృతం చేసే క్రమంలో రాజధాని రైతులు మహా పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ పేరుతో 45 రోజుల పాటు పాదయాత్ర చేయాలని అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని రైతు ఐకాస నిర్ణయించాయి. దీంతో పాదయాత్రకు అనుమతి కోరుతూ పోలీసులకు రాజధాని రైతులు లేఖ రాశారు. దీనిపై స్పందించిన డీజీపీ గౌతమ్ సవాంగ్ పాదయాత్రకు అనుమతి ఇవ్వలేమని అమరావతి పరిరక్షణ సమితికి లేఖ రాశారు. శాంతియుతంగా పాదయాత్ర చేస్తామంటే పోలీసులు అనుమతివ్వడంలేదని రాజధాని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనుమతి కోసం హైకోర్టును ఆశ్రయించనున్నట్టు ఐకాస నేతలు తెలిపారు.
* ఉస్మానియా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు హెల్మెట్లు ధరించి వినూత్నంగా నిరసన తెలిపారు. సోమవారం ఓ పీజీ విద్యార్థినిపై ఫ్యాన్ విరిగి పడిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో వైద్య విద్యార్థినికి స్వల్ప గాయాలు కావటంతో ఉస్మానియా జూడాలు ఉదయం కొద్ది సేపు మౌన దీక్ష చేపట్టారు. అనంతరం సూపరిండెంట్‌కి ఘటనపై ఫిర్యాదు చేసి ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని కోరారు. ఈ ఘటన తర్వాత ఆస్పత్రిలో శిథిలమైన సీలింగ్ ఫ్యాన్లు చూసి వైద్యులు ఆందోళనకు గురవుతున్నారు. ఫ్యాన్లు ఎప్పుడు మీద పడతాయోననే భయంతోనే వైద్యులు విధులకు హాజరవుతున్నారు. మరికొందరు పీజీ విద్యార్థులు ఆస్పత్రిలో హెల్మెట్ ధరించి నిరసన తెలిపారు. ఉస్మానియాలో రోగులు, వైద్య సిబ్బదికి రక్షణ లేకుండా పోయిందని వారు ఆరోపించారు.
* రానున్న రోజుల్లో గంజాయి నియంత్రణకు మరిన్ని చర్యలు తీసుకోనున్నట్లు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో అన్ని జిల్లాల ఎస్పీలు, ఉన్నతాధికారులతో మాదకద్రవ్యాల నియంత్రణపై డీజీపీ సమీక్షించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో నెలపాటు గంజాయిపై లోతైన అధ్యయనం చేయనున్నట్లు చెప్పారు. ఎన్ఐఏ సహకారంతో గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని డీజీపీ స్పష్టం చేశారు. ఏపీ, ఒడిశా సరిహద్దుల్లో దశాబ్దాలుగా గంజాయి సాగు చేస్తున్నారన్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 2.90 లక్షల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. గత పదేళ్లతో పోలిస్తే గతేడాది స్వాధీనం చేసుకున్న గంజాయే ఎక్కువ అని డీజీపీ వివరించారు.