ఆకలి బాధను నివారించడానికి సామాజిక వంటశాలలు ఏర్పాటు చేసే విషయమై విధానపర నిర్ణయాన్ని తీసుకోవాలని సుప్రీంకోర్టు బుధవారం కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే ఇలాంటి పథకాలు అమలవుతున్నందున వాటితో సమన్వయం చేసుకోవాలని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం లేకపోతే ఈ పథకం అమలు కష్టమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. సామాజిక కార్యకర్తలు అరుణ్ ధావన్, ఇషాన్ ధావన్, కుంజన సింగ్‌లు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా ఈ సూచనలు చేసింది. కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ మాధవీ దివాన్ వాదనలు వినిపిస్తూ పిల్లల్లో పౌష్టికాహార లోపం తలెత్తకుండా లేకుండా చూసేందుకు సామాజిక వంటశాలలు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని చెప్పారు. పిల్లల్లో పౌష్టికాహార లోపంతో పాటు, ఆకలి చావులు ఉన్నాయన్న ఆరోపణలపై సంక్షిప్తంగా సమాధానాలు ఇవ్వాలని ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్, ఒడిశా రాష్ట్రాలను ఆదేశించింది. ఈ సంఘటనలపై జిల్లాలు, తాలూకాలు, గ్రామాల వారీగా వివరాలు ఇవ్వాలని సూచించింది. సామాజిక వంటశాలల అంశంపై సమాచారం ఇవ్వని మణిపుర్ రాష్ట్రానికి జరిమానా విధిస్తూ రెండు వారాల్లో చెల్లించాలని ఆదేశించింది. ఇదివరకే జరిమానా విధించినా చెల్లించని రాష్ట్రాలు నాలుగు వారాల్లో ఆ మొత్తాన్ని బ్యాంకుల్లో ఫిక్సిడ్ డిపాజిట్ చేయాలని సూచించింది. తదుపరి విచారణను నవంబరు 16వ తేదీకి వాయిదా వేసింది.
సామాజిక వంటశాలలపై విధానపర నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీంకోర్టు
Related tags :