Business

డా.రెడ్డీస్ ఘనత. శక్తికాంతదాస్‌కే తిరిగి పట్టం-వాణిజ్యం

డా.రెడ్డీస్ ఘనత. శక్తికాంతదాస్‌కే తిరిగి పట్టం-వాణిజ్యం

* ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయంతో ఐఆర్‌సీటీసీ షేర్లు శుక్రవారం భారీ స్థాయిలో పతనమయ్యాయి. దీంతో వ్యాపార వర్గాలు, మార్కెట్‌ నిపుణులు సర్కార్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. గత్యంతరం లేక వెనక్కి తగ్గిన సర్కార్‌.. ఆ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకుంది. దీంతో షేర్లు మళ్లీ పుంజుకున్నాయి. రైల్వేలో క్యాటరింగ్‌, టికెట్‌ బుకింగ్‌, ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌.. వంటి సేవల్ని ఐఆర్‌సీటీసీ అందిస్తోంది. ఈ రంగంలో ఐఆర్‌సీటీసీదే గుత్తాధిపత్యం. టికెట్‌ బుకింగ్‌లో 73 శాతం, ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌లో 45 శాతం వాటా ఈ సంస్థదే. దీంతో ఈ సంస్థలో వాటాలున్న సర్కార్‌.. టికెట్‌ బుకింగ్‌ ద్వారా వస్తోన్న కన్వీనియెన్స్‌ రుసుము ఆదాయంలో 50 శాతం తమకు ఇవ్వాలంటూ గురువారం ఐఆర్‌సీటీసీకి రైల్వేశాఖ లేఖ రాసింది. కరోనాకి ముందు కన్వీనియెన్స్‌ ఫీజు ద్వారా ఐఆర్‌సీటీసీకి 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.349.64 కోట్ల ఆదాయం సమకూరింది. ఇక కరోనా విజృంభించిన 2020-21లోనూ రూ.299.13 కోట్ల ఆదాయం వచ్చింది. మరోవైపు కరోనా నేపథ్యంలో క్యాటరింగ్‌ సహా ఇతర సేవల నుంచి వచ్చే ఆదాయం గణనీయంగా పడిపోయింది. దీంతో 2020-21లో కన్వీనియెన్స్‌ ద్వారా వచ్చిన ఆదాయమే అత్యధికం. దీంతో ప్రస్తుతం ఐఆర్‌సీటీసీ ప్రధాన ఆదాయ వనరు నుంచి ప్రభుత్వం వాటా అడగడంతో మదుపర్లు ఒక్కసారిగా కలవరానికి గురయ్యారు. అమ్మకాలకు దిగారు. దీంతో కంపెనీ షేర్లు ఓ దశలో 29 శాతం కుంగి 650 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేశాయి. మరోవైపు ప్రభుత్వ నిర్ణయంపై మార్కెట్‌ నిపుణులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మదుపర్లకు మంచి లాభాల్ని తెచ్చిపెడుతున్న కంపెనీలో సర్కార్‌ జోక్యం ఏమాత్రం సరికాదని అభిప్రాయపడ్డారు. కంపెనీకి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని విశ్లేషించారు.

* భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ మరో మూడేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు ఆయన పదవీకాలాన్ని పొడిగిస్తూ ప్రధానమంత్రి నేతృత్వంలోని కేబినెట్‌ నియామకాల కమిటీ నిర్ణయం తీసుకుంది. డిసెంబరు 10తో ఆయన తొలి మూడేళ్ల పదవీకాలం ముగియనుంది. మాజీ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ రాజీనామా చేయడంతో 2018లో దాస్‌ గవర్నర్‌ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.

* క్రిప్టో క‌రెన్సీ భారతదేశంలో వేగంగా వృద్ధి చెందుతోంది. గత కొన్నెళ్లుగా ఇందులో పెట్టుబ‌డులు పెట్టే వారి సంఖ్య క్ర‌మంగా పెరుగుతూ వ‌స్తుంది. ఇది కేవ‌లం పెద్ద‌ పెద్ద మెట్రో పాలిట‌న్ న‌గ‌రాల‌కు మాత్ర‌మే ప‌రిమితం కావ‌డం లేదు. చిన్న చిన్న ప‌ట్ట‌ణాలు, గ్రామాల్లో సైతం పెట్టుబ‌డిదారులు ఉన్న‌ట్లు విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఇటీవ‌లె బ్రోక‌ర్ చూస్ అనే సంస్థ అందించిన నివేదిక‌ల ప్ర‌కారం మ‌న దేశంలో 10.07 కోట్ల మంది వ‌ద్ద‌ క్రిప్టోక‌రెన్సీ ఉంది.

* డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికన రూ.5,763.2 కోట్ల ఆదాయాన్ని, రూ.992 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదేకాలంలో రూ.4,896.7 కోట్ల ఆదాయంపై రూ.762.3 కోట్ల నికర లాభం నమోదైంది. అంటే లాభాల్లో 30 శాతం వృద్ధి నమోదైంది. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు 1.95 శాతం పెరిగి రూ.4,659.20 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ.4,917.85 వద్ద గరిష్ఠాన్ని తాకింది.