1918 మొదటి ప్రపంచయుద్ధ కాలంలో అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో అంబేద్కర్ – ఎం.ఎన్.రాయ్ ఉన్నారు. కాని ఒకర్ని మరొకరు చూచుకో లేదు! వారిరువురూ చారిత్రక కారణాల వలన కలియలేదు. అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నారు. ఎం.ఎన్.రాయ్ భారత విమోచన పోరాటంలో బ్రిటిష్ వారి నుండి తప్పించుకొని, అక్కడకు చేరారు. 1918లో మొదటి ప్రపంచయుద్ధం ఆరంభం కాగా, ఇండియాలో నిషేధానికి గురై, లాలా లజపతిరాయ్ కొలంబియా విశ్వవిద్యాలయంలో బ్రిటన్ వ్యతిరేక ఉపన్యాసాలిస్తూ వున్నారు. అక్కడే ఎం.ఎన్.రాయ్, ఆయన మొదటి భార్య ఎవిలిన్ ట్రెంట్ కలుసుకున్నారు. ఎవిలిన్ యధాశక్తి లజపతి రాయ్ కు సహాయపడగా ఆయన కొంతమేరకు ఆమెకు ఆర్థిక సహాయం అందించారు. లజపతిరాయ్ బ్రిటన్ వ్యతిరేక ఉపన్యాసాలు యూనివర్సిటీలో యిస్తుండేవాడు. అలాంటి ఉపన్యాసం విని ఒకనాడు బయటకు వస్తుండగా బ్రిటిష్ పోలీస్ వారు ఆయన్ను అరెస్టు చేశారు. మొత్తం మీద అంబేద్కర్ – ఎం.ఎన్.రాయ్ కలయిక 1918లో జరగలేదు. ఆ తరువాత 1930లో మహమూద్ పేరుతో రాయ్ ఇండియాలో ప్రవేశించినప్పుడు, కమ్యూనిస్టుల విద్రోహ చర్యవల్ల రాయ్ అరెస్టు అయ్యాడు. 12 సంవత్సరాల జైలుశిక్షపడింది. స్వయంగా కోర్టులో పోరాడి ఆ ఏళ్ళకు తగ్గించుకోగలిగాడు. జైలు నుండి బయటకు వచ్చిన తరువాత ఎం.ఎన్.రాయ్, అంబేద్కర్ లు కలిశారు. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో బ్రిటన్ కు అనుకూలంగా రాయ్, అంబేద్కర్ లు ఉపన్యాసాలిచ్చారు. అతి త్వరలో యుద్ధం వలన బలహీనపడిన బ్రిటన్ ఇండియా వదలబోతుందని అప్పుడు వామపక్షశక్తులు కీలక స్థానంలోకి రావాలని వారు వాదించారు. యుద్ధ ప్రచారానికి అనుకూలంగా వున్నందుకు కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వారు రాయ్ పై అంబేద్కర్ పై దుమ్మెత్తి పోశారు. కానీ వారే సరైన వాదన చేసినట్లు చరిత్ర చూపింది. యుద్ధ సమయంలో తాత్కాలికంగా బ్రిటన్ ను సమర్ధిస్తూ ఫాసిస్టు రాజ్యాలకు వ్యతిరేకంగా మాట్లాడిన ఎం.ఎన్.రాయ్, అంబేద్కర్ వాదన సరైనదని రుజువైంది. 1940-42 ప్రాంతంలో బొంబాయిలో ఎం.ఎన్.రాయ్ ప్రసంగాలు వినడానికి అంబేద్కర్ వచ్చి, హాలులో ముందు స్థానంలో కూర్చొని, రాయ్ ప్రసంగానికి హర్షధ్వానాలు చేసేవాడు. ఇది ప్రత్యక్షంగా చూచిన ఎలవర్తి రోశయ్య (గుంటూరులో ఎ.సి.కాలేజి లెక్చరర్ కి) స్వయంగా చెప్పారు. అందుకు నేను సాక్షి. ఆనాడు అంబేద్కర్ రాయ్ లు కలసి వున్న ఫోటోట కొరకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటరాని వారికి కాంగ్రెస్ పార్టీ, గాంధీ చేసిందేమిటి అనే శీర్షికన అంబేద్కర్ పెద్ద రచన చేశారు. అధికారికంగా రాజ్యాంగం రాకముందే, ఎం.ఎన్.రాయ్ ముసాయిదా రాజ్యాంగాన్ని రాసి ప్రకటించారు 1945లో. ఆ తరువాత అంబేద్కర్ రాజ్యాంగ రచనలో కీలక పాత్ర వహించారు. అంబేద్కర్ రాయ్ కలసి పనిచేయడం చారిత్రాత్మకం – కీలక విషయం. వారిరువురూ కలసి వున్న ఫోటో కొరకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
#############
లెనిన్ – ఎం.ఎన్. రాయ్ సంబంధం – నెహ్రూ పాత్ర
సోవియట్ విప్లవ విజేత లెనిన్ తో దీటుగా అగ్రస్తాయి సంఘంలో మాస్కోలో నిలచిన ఎం.ఎన్.రాయ్ ఆశ్చర్యకర పాత్ర వహించాడు. లెనిన్ కు మార్గాంతర సిద్ధాంతాన్ని ప్రతిపాదించి, గుర్తింపు పొంది, సోవియట్ యూనియన్ లో గౌరవం చేకూర్చుకున్న ఎం.ఎన్.రాయ్ గౌరవం చేకూర్చుకున్న ఎం.ఎన్.రాయ్ ఆసాధారణ పాత్ర నిర్వహించాడు. ఇదంతా ఆశ్చర్యకర పరిణామం అయినా ఆనాటి పరిస్థితుల వలన వెంటనే భారతదేశానికి తెలియలేదు. అయితే ఎం.ఎన్.రాయ్ పాత్ర గురించి తెలిసిన జవహర్ లాల్ నెహ్రూ ఆయన్ను కలుసుకోవాలనుకున్నాడు. 1927లో మాస్కో వెళ్ళినప్పుడు రాయ్ నెహ్రూలు కలిశారు. ఇదంతా నాటి పరిస్థితుల వలన ప్రాధాన్యత పొందలేదు. మెక్సికోలో విప్లవ పాత్ర నిర్వహించిన రాయ్ ను లెనిన్ గుర్తించి, మాస్కో ఆహ్వానించి తనతో సమానంగా కమిటీలో స్థానం యిచ్చాడు. ఇండియాలో నాటి కమ్యూనిస్టులకు యిదంతా కంటకంగా వుంది. అయితే రాయ్ ను కలుసుకోవాలనే కోరికను మాస్కో సందర్శనం ద్వారా నెహ్రూ తీర్చుకున్నాడు. ఆ తరువాత రాయ్ ఇండియా రావడం, జైలు శిక్ష అనుభవించి బయటకు రావడం చరిత్ర. అప్పుడు జవహర్ లాల్ ఫైజ్ పూర్ కాంగ్రెస్ లో రాయ్ ను కలసి, కొన్నాళ్ళు అలహాబాద్ లో తన అతిథిగా వుండమన్నాడు. అంగీకరించి, నెహ్రూతో గడపి, ఉత్తర ప్రదేశ్ లో పర్యటించిన రాయ్, కాంగ్రెస్ లో చేరాడు. నెహ్రూ కాంగ్రెస్ లో కీలక నాయకుడుగా గాంధీకి వారసుడయ్యాడు. రాయ్ స్వతంత్రంగా మానవవాదాన్ని పెంపొందించాడు. నెహ్రూ పాత్రను నిశితంగా పరిశీలించిన, రాయ్, కాంగ్రెస్ రాజకీయాలలో ఆయన పాత్రను గమనిస్తూ వచ్చాడు. నెహ్రూ తటపటాయింపు రాజకీయాలను వ్యాఖ్యానిస్తూ, హామ్లెట్ గా చిత్రించాడు. వుందామా వద్దా అనే హామ్లెట్ తో నెహ్రూను పోల్చుతూ రాయ్ రాశాడు. వారిద్దరి సంబంధం మిత్రత్వంగానే సాగింది. ఎవరి రాజకీయాలు వారివి. చరిత్రలో యీ విషయాలు ఆసక్తికరమైనవి!
నరిసెట్టి ఇన్నయ్య