Politics

పారిస్‌లో కేటీఆర్. తిరుగుబాటుకు చంద్రబాబుకు పిలుపు-తాజావార్తలు

పారిస్‌లో కేటీఆర్. తిరుగుబాటుకు చంద్రబాబుకు పిలుపు-తాజావార్తలు

* కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి సమైక్య వాదం వినిపించారు. సీఎం కేసీఆర్‌ సమైక్య వాదంతో ముందుకొస్తే తాను మద్దతిస్తానని స్పష్టం చేశారు. ‘‘ఉద్యమ సమయంలోనూ సమైక్య వాదాన్నే వినిపించా. అందరూ తెలంగాణ ద్రోహి అన్నప్పటికీ ఎమ్మెల్యేగా గెలిచాను. సమైక్యం.. నా వ్యక్తిగత అభిప్రాయం, పార్టీకి సంబంధం లేదు. ఆంధ్ర, తెలంగాణ నాయకులు మళ్లీ సమైక్యాన్ని తెరపైకి తెచ్చారు. ఈ విషయంలో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి అభిప్రాయం వేరు, నా వ్యక్తిగత అభిప్రాయం వేరు. ప్రజల ఆలోచన మేరకే వెళ్తా.. ఏ ప్రాంతానికీ నేను వ్యతిరేకం కాదు. ఇది ప్రజల డిమాండ్‌ కాదు..నాయకుల అభిప్రాయం మాత్రమే. ప్రత్యేక రాష్ట్రం వస్తే మెరుగైన జీవితం ఉంటుందని భావించి కొట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాలు అన్న నినాదంతోనే ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడాం. కానీ, ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. గతంలో నేను అన్నట్టుగానే ఇప్పుడు ఒక్కొక్కరు సమైక్యానికి అనుకూలంగా మాట్లాడుతున్నారు. రాష్ట్ర విభజన జరిగినా.. ఆంధ్ర, రాయలసీమ ప్రజలు కోటిమందికి పైగా తెలంగాణలో ఉన్నారు. ఆరోజు నన్ను తప్పుబట్టిన వారు .. ఇప్పుడు సమైక్యానికి మద్దతు పలుకుతున్నారు. ఆంధ్రాలో పార్టీ పెట్టమని కోరుతున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పార్టీ పెట్టడం ఎందుకు రాష్ట్రాన్ని కలిపేద్దాం అని ఏపీ మంత్రి పేర్ని నాని ప్రతిపాదించారు. సమైక్యం విషయంలో ఎవరి అభిప్రాయాలను నేను తప్పుపట్టను.. ఎవరి అభిప్రాయాలు వారివి’’ అని జగ్గారెడ్డి అన్నారు.

* ఆవిష్కరణలకు సంబంధించి ప్రపంచస్థాయి నెట్‌వర్క్‌ అయిన ప్లగ్‌ అండ్‌ ప్లే టెక్‌ సెంటర్‌ హైదరాబాద్‌లో తమ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. భారత్‌లో తమ మొదటి కేంద్రాన్ని హైదరాబాద్‌ వేదికగా డిసెంబరులో ప్రారంభించనున్నట్టు పారిస్‌లో మంత్రి కేటీఆర్‌తో సమావేశం సందర్భంగా నెట్‌వర్క్‌ ప్రతినిధులు ప్రకటించారు. ఆవిష్కరణలకు ఇప్పటికే ప్రాధాన్యం ఇస్తున్న తెలంగాణలో ఇన్నోవేషన్‌ ఎకోసిస్టంకు మరింత ఊతమిస్తుందని కేటీఆర్‌ అన్నారు. ఫ్రాన్స్‌ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌ బృందం సాఫ్రాన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ సంస్థ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఏరో స్పేస్‌, డిఫెన్స్‌ రంగాల్లో నైపుణ్యాభి వృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. బోర్డెక్స్‌ మెట్రో పోలిస్‌తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది. చారిత్రక లక్సెంబర్గ్‌ ప్యాలెస్‌లో కేటీఆర్‌ సమక్షంలో ఒప్పందం జరిగింది. సుస్థిర పట్టణాల రూపకల్పనలో బోర్డెక్స్‌ మెట్రోపోలిస్‌ సహకారం అందించనుంది. 2015లో చేసుకున్న సహకార ఒప్పందానికి అనుగుణంగా తాజా ఒప్పందం జరిగింది. ఫార్మా కంపెనీ సర్వియర్‌ ప్రతినిధులతోనూ కేటీఆర్‌ బృందం సమావేశమైంది. తెలంగాణలో ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌ రంగాల అభివృద్ధి, ఇక్కడ ఉన్న అవకాశాలను వివరించారు. 2022 లో జరగనున్న బయోఏసియా సదస్సులో పాల్గొనాలని సర్వియర్ ప్రతినిధులను కేటీఆర్ ఆహ్వానించారు. హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహణలో భాగస్వామ్య సంస్థ అయిన కియోలిస్ గ్రూప్ ప్రతినిధులతోనూ కేటీఆర్ సమావేశమయ్యారు. ఫ్రెంచ్ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ ఆసియా డైరెక్టర్ పిలిఫ్ తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. డిజిటల్ టెక్నాలజీ సంస్థ థేల్స్ గ్రూప్ ప్రతినిధులతో సమావేశమైన కేటీఆర్… మెడిసిన్ ఫ్రం ది స్కై సహా ఎమర్జింగ్ టెక్నాలజీస్ ను తెలంగాణ వినియోగిస్తున్న తీరును వివరించారు.

* ఇచ్చోడ మండలం గుండాలలో 27న జరిగిన ఘర్షణకు కారకులైన ఎవరిని వదిలిపెట్టమని, వారికి కఠిన శిక్షలు పడేలా చూస్తామని జిల్లా ఇన్‌ఛార్జి ఎస్పీ రాజేష్‌చంద్ర పేర్కొన్నారు. దాడికి వినియోగించిన కత్తులు, గొడ్డళ్లు, కర్రలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఇచ్చోడ పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు.

* రాజకీయాల పట్ల కాంగ్రెస్‌ సీరియస్‌గా ఉండట్లేదని, అందుకే ప్రధాని మోదీ మరింత శక్తిమంతంగా మారుతున్నారని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. గోవా పర్యటనలో ఉన్న దీదీ.. అక్కడ ఓ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు గుప్పించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చే అవసరాన్ని కాంగ్రెస్‌ గుర్తించట్లేదని దుయ్యబట్టారు.

* చిత్తూరు జిల్లాలోని గ్రానైట్‌ పరిశ్రమను హస్తగతం చేసుకొని వైకాపా నాయకులు దోచుకుంటున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. త్వరలోనే వైకాపా నాయకుల ఆటకట్టిస్తామన్నారు. పన్నులతో దోచుకుంటున్న ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సొంత నియోజకవర్గమైన కుప్పంలో చంద్రబాబు రెండో రోజు పర్యటిస్తున్నారు.

* హుజూరాబాద్‌లో ఉప ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. కాగా ఆ నియోజకవర్గంలోని ఘన్ముక్లలో తెరాస నేత పాడి కౌశిక్‌రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఆయన ఘన్ముక్ల పోలింగ్‌ కేంద్రం వద్దకు రాగా.. స్థానికేతరులకు ఇక్కడ ఏం పని అని అంటూ భాజపా శ్రేణులు నిలదీశారు. ఈ క్రమంలో కౌశిక్‌రెడ్డి, భాజపా శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది. ఫలితంగా పోలింగ్‌ కేంద్రం కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం కౌశిక్‌రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఉదయం 9 గంటల వరకు హుజూరాబాద్‌లో 10.50 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.

* కాంగ్రెస్‌ నియమావళిలో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేసే విషయమై పార్టీలో అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయి. ఎప్పుడో దీన్ని స్వాతంత్య్ర ఉద్యమం సమయంలో రూపొందించడంతో ఇప్పటికి తగ్గట్టుగా సవరణలు చేయాలని పలువురు భావిస్తున్నారు. ఏ నిర్ణయమైనా పార్టీలో అత్యున్నతమైన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీయే తీసుకోవాల్సి ఉంటుంది. గతంలోనూ కొన్ని మార్పులు జరిగాయి. కాంగ్రెస్‌ సంప్రదాయం ప్రకారం..పార్టీ సమావేశాలను నేలపైనే నిర్వహించాలి. కూర్చోవడానికి వీలుగా పరుపులు, దిండ్లు వేయాలి. ఇలా కూర్చోవడం వృద్ధులకు ఇబ్బందికరంగా ఉండడాన్ని 1998లో పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన సోనియా గాంధీ గుర్తించారు. దాంతో ఆ సంప్రదాయాన్ని మార్చి టేబులు, కుర్చీలు ఏర్పాటు చేయించారు. అలాంటివే మరికొన్నింటిని మార్చితే బాగుంటుందన్న చర్చ జరుగుతోంది. సభ్యులు తప్పకుండా ఖాదీ ధరించాలన్న నిబంధన ఉంది. రాహుల్‌ గాంధీ సహా పలువురు యువ సభ్యులు జీన్స్, టీ షర్డులంటే ఇష్టపడుతున్నారు. అలాంటప్పుడు దీన్ని ఎంతవరకు కొనసాగించాలన్న దానిపై చర్చ జరుగుతోంది. పార్టీ నియమావళిలోని 5(ఏ) అధికరణం.. 3వ క్లాజ్‌ ప్రకారం సభ్యులెవరూ మద్యం సేవించకూడదు. నూతనంగా సభ్యత్వం తీసుకునే ముందు దీనిపై స్వీయ ధ్రువీకరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటి కాలంలో ఇది ఆచరణ సాధ్యం కాకపోవడంతో దీన్ని సవరిస్తే బాగుంటుందని రాహుల్‌ గాంధీ భావిస్తున్నారు. ఈ నెల 26న జరిగిన పార్టీ నాయకుల సమావేశంలో విరామం సందర్భంగా ఆయన ఆకస్మికంగా ఓ ప్రశ్న వేశారు. ‘‘ఇక్కడ తాగేవారు ఎవరు?’’ అని అడిగారు. జవాబు ఇవ్వడానికి నాయకులు ఇబ్బంది పడ్డారు. పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధు మాత్రం ‘‘మా రాష్ట్రంలో చాలా మంది తాగుతారు’’ అని సమాధానం ఇచ్చారు. ఈ నిబంధన ఉన్నా ఇంతవరకు అమలు చేయలేదు. కాగితాలకే పరిమితమైన ఇలాంటి నిబంధనలు ఎందుకని రాహుల్‌ భావిస్తున్నారు. ఎలాంటి సవరణలు జరగనందున ప్రస్తుతం జరుగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాత నిబంధనే అయినప్పటికీ.. ఖాదీ ధరిస్తాను, మద్యం తాగను అంటూ సభ్యులు స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది.

* ఇటలీ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం వాటికన్‌ సిటీ చేరుకున్నారు. ఆయనతో పాటు కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌ ఉన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవ మతగురువు పోప్‌ ఫ్రాన్సిస్‌ను మోదీ కలిశారు. దాదాపు 30 నిమిషాల పాటు సమావేశమైన వీరు.. ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు, కొవిడ్‌ మహమ్మారి వంటి పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

* రెండు డోసుల వ్యాక్సిన్‌ వేయించుకున్నాం.. ఇక నిశ్చితగా ఉండొచ్చు అనే భరోసా వద్దు. అందుకు సింగపూరే సాక్ష్యం. ఈ బుల్లి దేశంలోని మొత్తం జనాభాలో 84శాతం మంది రెండు విడతల వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. అందులో 14శాతం మంది బూస్టర్‌ టీకాలు కూడా వేయించుకున్నారు. మిగిలిన వాళ్లలో ఒక డోసు టీకా వేయించుకుంది 85శాతం. అయినా అక్కడ రోజురోజుకీ కొవిడ్‌ కేసులు పెరిగిపోతుండటం ఆందోళనకరంగా మారింది.

* చైనా, తైవాన్‌ మధ్య ఉద్రిక్తతలు ఇటీవల తారస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. అయితే.. చైనాలో భాగం కావడం మినహా తైవాన్‌కు వేరే భవిష్యత్తు లేదని చైనా స్టేట్ కౌన్సిలర్, విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యీ తాజాగా స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ దేశానికి అంతర్జాతీయంగా చట్టపరమైన గుర్తింపు లేదని పేర్కొన్నారు.