Business

దయచేసి…ఆ ఇంధన ధరల పెంపు ఆపండి-వాణిజ్యం

దయచేసి…ఆ ఇంధన ధరల పెంపు ఆపండి-వాణిజ్యం

* గత ఏడాది కరోనా మహమ్మారి కారణంగా వివిధ వ్యాపార రంగాల్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోవలసి వచ్చింది. కానీ ఐటీ రంగం మాత్రం అందుకు మినహాయింపు. అంతేగాదు, ఇప్పుడు కొత్త ఉద్యోగాలు కల్పించటంలోనూ ఐటీ రంగం అగ్రగామిగా మారింది. కరోనా మహమ్మారి వల్ల అన్ని రకాలైన పనులు డిజిటల్‌ వైపు మళ్లిన ఫలితంగా ఐటీ కంపెనీలకు ప్రాజెక్టులు పెద్ద సంఖ్యలో లభిస్తున్నాయి. దీంతో ఆయా కంపెనీలకు భారీగా ఐటీ నిపుణులు అవసరమవుతున్నారు. ఈ నేపథ్యంలో జోరుగా ‘కేంపస్‌’ నియామకాలు చేపడుతున్నాయి. ఈ ఏడాదిలో ఐటీ కంపెనీలు కేంపస్‌ నియామకాల ద్వారా దాదాపు ఒక లక్ష మంది ‘ఫ్రెషర్ల’ ను ఎంపిక చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో సగం మందికి పైగా పెద్ద కంపెనీలైన టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, కాగ్నిజెంట్‌ తీసుకునే అవకాశం ఉంది. దీని ప్రకారం చూస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐటీ నియామకాలు ఎంతో ఆకర్షణీయంగా ఉండబోతున్నట్లు స్పష్టమవుతుంది.

* ఈ సారి దీపావళికి బంగారం మరింత మెరవనుంది. కరోనా ముందు స్థాయిలతో పోలిస్తే 30 శాతం వృద్ధితో విక్రయాలు నమోదవుతాయని ఆభరణ తయారీదార్లు విశ్వసిస్తుండడం ఇందుకు కారణం. ఆర్థిక వ్యవస్థ అంచనాల కంటే వేగంగా రికవరీ అవుతుండడం, ధరలూ తక్కువగా ఉండడంతో గిరాకీ భారీగా పెరగవచ్చని వారు అంచనా వేస్తున్నారు. గతేడాది దీపావళి, ధనత్రయోదశి సమయంలో రత్నాభరణాల పరిశ్రమ దాదాపు సున్నా విక్రయాలను నమోదు చేసిన విషయం తెలిసిందే.

* దాదాపు ఒక నెల విరామం తర్వాత స్టాక్‌ మార్కెట్‌లో ఐపీఓల జోరు మళ్లీ కొనసాగనుంది. నవంబరు తొలి 15 రోజుల్లో ఐదు సంస్థలు పబ్లిక్‌ ఇష్యూకు రానున్నాయి. వీటిలో ప్రముఖ డిజిటల్‌ చెల్లింపుల సంస్థ పేటీఎం మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌; పాలసీ బజార్‌ మాతృసంస్థ పీబీ ఫిన్‌టెక్‌; కేఎఫ్‌సీ, పిజ్జాహట్‌లను నిర్వహిస్తున్న సఫైర్‌ ఫుడ్స్ ఇండియా‌; సౌందర్య ఉత్పత్తుల తయారీ, సరఫరా సంస్థ ఎస్‌జేఎస్‌ ఎంటర్‌ప్రైజెస్‌, సెల్యూలోజ్‌ తయారీ కంపెనీ సిగాచీ ఇండస్ట్రీస్‌ ఉన్నాయి.

* చైనాలో రియల్‌ ఎస్టేట్‌ రంగం సంక్షోభం ముంగిట నిలిచింది. విక్రయాల ఆధారంగా చైనాలోని 30 అతిపెద్ద రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు ప్రభుత్వ విధించిన ఆంక్షల చట్రంలోకి వెళ్లే ప్రమాదం పొంచి ఉంది. ఈ విషయాన్ని అక్టోబర్‌ 29న బ్లూమ్‌బెర్గ్‌ పత్రిక పేర్కొంది. చైనా ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు అడ్డగోలుగా రుణాలు సమీకరించకుండా గతేడాది త్రీ రెడ్‌లైన్స్‌ పేరిట ఓ పాలసీని తెచ్చింది. సదరు సంస్థ అప్పులు వాటి ఆస్తుల్లో 70శాతానికి మించకూడదు, నికర ఆస్తుల కన్నా నికర అప్పులు తక్కువ ఉండాలి, స్వల్పకాల రుణాల స్వీకరించాలంటే అంతకు సమానమైన మిగులు నగదు చేతిలో ఉండాలి. దీంతో చైనాలోని నియంత్రణ సంస్థలు వీటిని కఠినంగా అమలు చేయడం మొదలుపెట్టాయి. ఫలితంగా ఆయా రియల్‌ ఎస్టేట్‌ సంస్థల వద్ద నగదు ప్రవాహం తగ్గిపోయింది. చెల్లింపులకు నిధులు లేక అప్పులు కొండలా పెరిగిపోయాయి. ఎవర్‌గ్రాండె, చైనా రైల్వే కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌ ఇప్పటికే మూడు ఎర్రగీతల్లో రెండింటిని దాటేశాయి.

* దేశంలో పెరుగుతున్న ఇంధన ధరలతో వాహనదారులు అల్లాడిపోతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో వాహనాలను బయటకి తీయాలంటేనే భయపడుతున్నారు. ఈ పరిణామాల మధ్య విడుదలైన కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ నివేదిక కీలక విషయాలను బయటపెట్టింది. పెట్రోలియం ఉత్పత్తులపై విధించే ఎక్సైజ్‌ సుంకం ద్వారా వచ్చే వసూళ్లు ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో 33 శాతం పెరిగినట్లు తేలింది. కొవిడ్‌ మునుపటితో పోలిస్తే 79 శాతం ఎగబాకడం విశేషం. కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ (సీజీఏ) వద్ద ఉన్న ఏప్రిల్‌-సెప్టెంబరు గణాంకాలు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి.

* దేశంలో ఇంధన ధరల పెంపు ఆగడం లేదు. రోజురోజుకీ ఎగబాకుతున్న ధరలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బండి బయటకు తీయాలంటేనే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పైగా ఇంధన ధరలు పెరగడంతో రవాణా, సరఫరా ఖర్చులు పెరిగి ఇతర నిత్యావసర వస్తువుల ధరలపైనా ఆ ప్రభావం పడుతోంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా పెరగడంతో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ భయాలు అలముకుంటున్నాయి.