* వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబర్చి, ఉత్తమ సేవలందించిన వారికి వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుల ప్రదానోత్సవం సోమవారం జరగనుంది. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేయనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు విజయవాడ ఏ-కన్వెన్షన్ సెంటర్‌లో అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. 2021 సంవత్సరానికి 59 అవార్డులు ఇవ్వనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. 29 వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్, 30 వైఎస్సార్ అచీవ్‌మెంట్ అవార్డులు ప్రదానం చేయనున్నారు. 9 సంస్థలకు, వ్యవసాయం, అనుబంధ రంగాలకు సంబంధించి 11 అవార్డులు ఇవ్వనున్నారు. కళలు, సంస్కృతికి 20 అవార్డులు, సాహిత్యం-7, జర్నలిజం-6, కొవిడ్ సమయంలో సేవలందించిన ప్రభుత్వ వైద్య సిబ్బందికి-6 అవార్డులు ఇవ్వనున్నారు. నగదు పురస్కారంతో పాటు మెమొంటో, మెడల్‌ను రాష్ట్ర ప్రభుత్వం అందజేయనుంది. రాష్ట్రంలో తొలిసారిగా వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు, వైఎస్సార్ అచీవ్‌మెంట్ అవార్డులు ఇస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది.
* ‘విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు’ నినాదంతో విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఉక్కు ఉద్యమానికి జనసేన పార్టీ మద్దతు ప్రకటించింది. ఇందులో భాగంగా విశాఖలోని స్టీల్ ప్లాంట్ కూర్మన్నపాలెం గేటు వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొని సంఘీభావం తెలిపారు. జనసేన నేతలు నాదెండ్ల మనోహర్, హరిప్రసాద్, విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి నేతలు సభలో పాల్గొన్నారు. అంతకుముందు విశాఖ విమానాశ్రయం నుంచి కూర్మన్నపాలెంగేటు సభా స్థలి వరకు పవన్ కల్యాణ్ వెంట జనసైనికులు భారీ ర్యాలీగా తరలివచ్చారు. పవన్ కల్యాణ్ ఉపన్యాసం ప్రారంభంలో శ్రీశ్రీ రాసిన ‘నేను సైతం’ కవితను చదివి వినిపించారు. ‘‘నాయకుడు, కవి ఎప్పుడూ కార్మికులవైపు నిలబడాలి. దేశ ప్రగతికి ఉక్కు కర్మాగారాలు చాలా ముఖ్యం. ఉక్కు కర్మాగారాలు లేకపోతే ఆ దేశం ముందుకు వెళ్లదు. ఉక్కు పరిశ్రమ రావడంలో ఏయూ విద్యార్థుల పాత్ర కూడా ఉంది. ఎందరో పోరాటం చేస్తేనే విశాఖ ఉక్కు పరిశ్రమ ఇక్కడకు వచ్చింది. ఉక్కు ఉద్యమంలో ఆనాడు పోలీసు కాల్పుల్లో 32 మంది చనిపోయారు. విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు నినాదం అందరిలో భావోద్వేగం నింపింది’’ అని పవన్ వివరించారు.
* తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇవాళ సాయంత్రం స్వల్పంగా భూమి కంపించింది. రాష్ట్రంలోని జగిత్యాల, రామగుండం, మంచిర్యాల జిల్లా లక్షేటిపేట, గోదావరి పరివాహక గ్రామాల్లో సాయంత్రం 6:49 గంటలకు దాదాపు 3 సెకన్ల పాటు స్వల్పంగా భూమి కంపించింది. ఒక్కసారిగా వచ్చిన భూప్రకంపనలతో జగిత్యాల, రామగుండం ప్రజలు ఉలిక్కిపడ్డారు.
* ఇద్దరు వైకాపా నేతలు చంపుతామని బెదిరించారని అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని ఓ యువకుడు లేఖ రాసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గుంటూరు జిల్లా నరసరావుపేటలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. నరసరావుపేట మండలం రావిపాడు గ్రామానికి చెందిన పీటర్ పాల్ (30) గతంలో ఓ యువతిని ఇంటికి తీసుకురాగా.. ఆమె కుటుంబ పెద్దలు అతని ఇంటికి వచ్చి మాట్లాడి యువతిని తీసుకెళ్లారు. అనంతరం యువతి కుటుంబ సభ్యులు పీటర్‌పాల్ చరవాణిలో ఆమెకు సంబంధించిన ఫొటోలు ఉన్నాయని, వాటిని తొలగించాలని నరసరావుపేట గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
* బెజవాడ ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఘాట్‌రోడ్ ప్రవేశాన్ని నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఘాట్‌రోడ్డుపై రాళ్లు జారిపడే ప్రాంతాల్లో పనులు జరుగుతున్నందున రానున్న మూడు రోజుల పాటు ఘాట్‌రోడ్ ప్రవేశాన్ని మూసేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కొండపైకి వచ్చే వాహనాలకు అర్జున వీధి నుంచి అనుమతించనున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు.
* నగరంలోని రామ్మోహన్ గ్రంథాలయాన్ని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా వెంకయ్యకు కలెక్టర్ నివాస్, సీపీ శ్రీనివాసులు, మేయర్ భాగ్యలక్ష్మి స్వాగతం పలికారు. గ్రంథాలయ నిర్వాహకులను ఉప రాష్ట్రపతి ఆత్మీయంగా పలకరించారు. గ్రంథాలయాన్ని సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోనే ఈ గ్రంథాలయానికి విశేష చరిత్ర ఉందని తెలిపారు. ‘ఊరికో గ్రంథాలయం.. ఇంటికో స్వచ్ఛాలయం’ నినాదం కావాలన్న వెంకయ్యనాయుడు.. చారిత్రక ప్రదేశాలను యువత సందర్శించాలని సూచించారు. స్వచ్ఛ భారత్ మాదిరిగా గ్రంథ పఠనం ప్రజాఉద్యమ రూపు దాల్చాలని ఆకాంక్షించారు. ఇంటర్నెట్, టీవీ సంస్కృతి వల్ల ఎదురయ్యే సమస్యలకు పుస్తక పఠనమే పరిష్కారమని వెంకయ్యనాయుడు అన్నారు. విద్యార్థులకు పుస్తక పఠనం అనేది ఆటపాటల్లా అలవాటు చేయాలని తెలిపారు.
* ధాన్యం బస్తాల మధ్యలో రూ.60వేలు విలువైన ఖైనీ, గుట్కాను ఒడిశా జయంతిపురం నుంచి ఆంధ్రాలోని పూండి ప్రాంతానికి తరలిస్తుండగా కవిటి పోలీసులు పట్టుకున్నారు. శనివారం శిలగాం జాతీయ రహదారి కూడలి వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా, బొలెరోలో ధాన్యం బస్తాల మధ్యలో ఖైనీ, గుట్కా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ విషయమై ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి వాహనాన్ని అదుపులోకి తీసుకున్నట్టు ఎస్సై అప్పారావు తెలిపారు.
* అంతర్గతంగా లేదా బయటనుంచి ఎదురయ్యే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనే సామర్థ్యం భారత్‌కు ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రజలందరూ ఐక్యంగా ఉంటేనే దేశం తన లక్ష్యాలను చేరుకుంటుందని అన్నారు. భారత తొలి ఉపప్రధాని, తొలి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 146వ జయంతి సందర్భంగా వర్చువల్ పద్ధతిలో ప్రసంగించిన ప్రధాని మోదీ.. భూమి, జలం, గగనతలాల్లో భారత్ శక్తిసామర్థ్యాలు మునుపెన్నడూ లేనంత అద్భుతంగా ఉన్నాయన్నారు.
* హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా వీవీ ప్యాట్లు తారుమారయ్యాయనే వార్తలొచ్చాయి. దీంతో పాటు భాజపా నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో)కి ఫిర్యాదు కూడా చేశారు. ఈ నేపథ్యంలో దీనిపై వివరణ ఇవ్వాలని కరీంనగర్ కలెక్టర్, హుజూరాబాద్ ఆర్వోకు సీఈవో ఆదేశాలు జారీ చేశారు. ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై ఆయన ఎన్నికల అధికారులతో నిర్వహించిన సమీక్ష సందర్భంగా ఈ మేరకు ఆదేశించారు.
* హుజూరాబాద్ ఉప ఎన్నికలో ప్రజాభిప్రాయం భాజపా వైపు ఉండడంతో తెరాస అధికార బలంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. నిన్న అర్ధరాత్రి జరిగిన వివి ప్యాట్ల తరలింపు విషయంలో అది బహిర్గతమైందన్నారు. ఈ మేరకు బండి సంజయ్ ఒక ప్రకటన విడుదల చేశారు.
* తెలంగాణ జనసమితి వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ కోదండరామ్‌ను అమరావతి రైతుల ఐకాస నేతలు కలిశారు. ఆదివారం విజయవాడలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన కోదండరామ్‌ను కలిసిన ఐకాస నేతలు మహా పాదయాత్రకు ఆహ్వానించారు. ఈ మేరకు మహా పాదయాత్రకు సంబంధించిన ఆహ్వాన పత్రికను అందించారు. నవంబర్ 1 నుంచి న్యాయస్థానం టు దేవస్థానం పేరిట అమరావతి రైతు ఐకాస మహా పాదయాత్రను చేపట్టిన విషయం తెలిసిందే.
* బద్వేలు ఉప ఎన్నికలో వైకాపా అధికార దుర్వినియోగానికి పాల్పడిందని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. ఉప ఎన్నికలో భారీగా రిగ్గింగ్ జరిగిందని, వైకాపా ఆగడాలకు హద్దు లేకుండా పోయిందని మండిపడ్డారు. పోలీసులు కూడా వైకాపాకు అనుకూలంగా వ్యవహరించారని విమర్శించారు. భాజపా ఏపీ వ్యవహారాల ఇన్‌ఛార్జి సునల్ దేవ్‌ధర్‌తో కలిసి జీవీఎల్ మీడియా సమావేశంలో మాట్లాడారు.
* చైనాలో రియల్ ఎస్టేట్ రంగం సంక్షోభం ముంగిట నిలిచింది. విక్రయాల ఆధారంగా చైనాలోని 30 అతిపెద్ద రియల్ ఎస్టేట్ సంస్థలు ప్రభుత్వ విధించిన ఆంక్షల చట్రంలోకి వెళ్లే ప్రమాదం పొంచి ఉంది. ఈ విషయాన్ని అక్టోబర్ 29న బ్లూమ్‌బెర్గ్ పత్రిక పేర్కొంది. చైనా ప్రభుత్వం రియల్ ఎస్టేట్ సంస్థలు అడ్డగోలుగా రుణాలు సమీకరించకుండా గతేడాది త్రీ రెడ్‌లైన్స్ పేరిట ఓ పాలసీని తెచ్చింది.
* స్పిన్ దిగ్గజం, ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు షేన్‌వార్న్ తాజాగా ట్విటర్ వేదికగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆ జట్టు ప్రధాన బ్యాట్స్‌మెన్‌లో ఒకరైన స్టీవ్‌స్మిత్ టీ20 జట్టులో ఉండకూడదని విమర్శలు చేశాడు. శనివారం రాత్రి ఆసీస్.. ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాభవం ఎదుర్కొన్న నేపథ్యంలో అతడీ వ్యాఖ్యలు చేశాడు. కాగా, ఈ ట్వీట్‌పై ఆసీస్ అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు. స్మిత్ ఇదొక్క మ్యాచ్‌లోనే విఫలమయ్యాడని, ఇలాంటి పనికిమాలిన సూచనలు చేయొద్దని అతడిపై మండిపడుతున్నారు.
* హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి వీవీ ప్యాట్ తరలింపు విషయం చర్చనీయాంశమైన నేపథ్యంలో హుజూరాబాద్ రిటర్నింగ్ అధికారి(ఆర్వో) రవీందర్‌రెడ్డి వివరణ ఇచ్చారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న పుకార్లను నమ్మొద్దని ప్రకటనలో వెల్లడించారు. పనిచేయని వీవీప్యాట్‌ను ఒక అధికారిక వాహనం నుంచి మరో అధికారిక వాహనంలోకి తరలించిన సమయంలో ఎవరో వీడియో తీసి దానిపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆర్వో అన్నారు. పోలింగ్ ప్రారంభం కావడానికి ముందు మాక్ పోలింగ్ నిర్వహించే క్రమంలో వీవీ ప్యాట్ పని చేయలేదని దాని స్థానంలో మరో దానితో పోలింగ్ నిర్వహించామని ఆయన తెలిపారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని నవంబర్ 2వ తేదీ జరగనున్న లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.