Health

క్యాన్సర్ రోగులకు వ్యాయామం ఉత్తమం

క్యాన్సర్ రోగులకు వ్యాయామం ఉత్తమం

వ్యాయామం ఎవరికైనా ఆరోగ్యకరమే. అయితే క్యాన్సర్‌ రోగులు వ్యాయామం చేస్తే మరీ మంచిది. కండర బలాన్ని పెంచే ఏరోబిక్స్‌ చేయడం వల్ల క్యాన్సర్‌ కణాల పెరుగుదల తగ్గుతుందని ఆస్ట్రేలియాకి చెందిన ఎడిత్‌ కొవాన్‌ విశ్వవిద్యాలయ నిపుణులు పేర్కొంటున్నారు. వ్యాయామం వల్ల ట్యూమర్‌ కణాల సంఖ్య తగ్గడానికి కారణమయ్యే ప్రొటీన్ల శాతం పెరుగుతుందట. ఇందుకోసం పదిమంది ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ బాధితుల్ని ఎంపికచేసి వాళ్లకి చికిత్సతోపాటు వరసగా పన్నెండు వారాలపాటు వ్యాయామం చేయించారు. అప్పుడు ఎముక కండరాల నుంచి విడుదలయ్యే మయోకైన్స్‌ అనే ప్రొటీన్ల శాతాన్ని లెక్కించారట. వీటి ప్రభావం క్యాన్సర్‌ కణాల మీద ఎలా ఉందో తెలుసుకోవడానికి వ్యాయామానికి ముందూ తరవాతా ల్యాబ్‌లో పరీక్షించగా- అందులో వ్యాయామం తరవాత క్యాన్సర్‌ కణాల సంఖ్య తక్కువగా ఉన్నట్లు తేలింది. అయితే మయోకైన్స్‌ నేరుగా క్యాన్సర్‌ కణాలను నాశనం చేయడం లేదు. అవి రోగనిరోధక టి-కణాలను ప్రేరేపించడం ద్వారా వాటిని నాశనం చేస్తున్నాయి అంటున్నారు. మొత్తమ్మీద వ్యాయామం చేయడం అనేది క్యాన్సర్‌ రోగులకీ మంచిదే అని చెబుతున్నారు.