దీపావళి సమయంలో లక్ష్మీదేవిని పూజిస్తే… ఆ తరువాతి రోజునుంచీ హరిహరులను స్తుతించే భక్తులతో, అయ్యప్ప దీక్షను స్వీకరించే స్వాములతో ఆలయాలన్నీ కళకళలాడే పవిత్ర కార్తికమాసం మొదలవుతుంది. అంతటా భక్తిభావం కనిపించే ఈ సమయంలో దీపావళి రోజున లక్ష్మీదేవినే ఎందుకు పూజించాలీ, కార్తికంలో శివారాధన, అయ్యప్ప దీక్షనే ఎందుకు తీసుకోవాలీ అనే ప్రశ్నలకు పురాణాలు ఏం చెబుతున్నాయంటే…
**లక్ష్మీదేవి… సిరి, సంపదలకు ప్రతీక. తనని త్రికరణశుద్ధిగా ఆరాధించే భక్తులకు అష్టైశ్వర్యాలను ప్రసాదించే ఐశ్వర్య స్వరూపిణి. అలాంటి లక్ష్మీదేవిని దీపావళి రోజున శ్రద్ధగా పూజిస్తే సుఖశాంతులతోపాటూ చేసే ప్రతి పనిలో విజయం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. లక్ష్మీదేవి ఉద్భవం వెనుక ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. ఒకసారి దుర్వాస మహర్షి ఇంద్రుడికి ఓ విలువైన హారాన్ని కానుకగా ఇచ్చాడట. ఇంద్రుడు దానిపైన ఏ మాత్రం ఆసక్తి లేదన్నట్లుగా ఆ హారాన్ని వెంటనే తన దగ్గరున్న ఐరావతం మెడలో వేయడంతో అది ఆ హారాన్ని నేలమీద పడేసి తొక్కేసిందట. అది చూసి అవమానంగా భావించిన దుర్వాసుడు ఇంద్రుడి గర్వానికి రాజ్యభోగాలే కారణం కాబట్టి ఇకపైన అవేవీ ఉండవని శపించి వెళ్లిపోయాడట. ఆ తరువాతి నుంచి ఇంద్రుడికి కష్టాలు మొదలయ్యాయట. అదే అవకాశంగా రాక్షసులు కూడా ఇంద్రుడి రాజ్యంపైన దండెత్తి విజయం సాధించడంతో దేవేంద్రుడు విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లి మొరపెట్టుకుని, పరిష్కారం అడిగాడట. దాంతో విష్ణువు క్షీరసాగర మథనం చేయమని సూచించాడట. ఓ వైపు అసురులూ, మరోవైపు దేవతలూ క్షీరసాగర మథనం చేసేందుకు సిద్ధమయ్యారట. కాసేపటికి గరళం, పారిజాతం చెట్టూ లాంటివే కాదు, చంద్రుడూ, ధన్వంతరి కూడా క్షీరసాగరమథనం నుంచే వచ్చారట. అదేవిధంగా లక్ష్మీదేవి కూడా తామరపువ్వుమీద కూర్చుని ఉద్భవించి ఆ తరువాత విష్ణుమూర్తి చెంతకు చేరిందట. అలా వచ్చిన లక్ష్మీదేవి అనుగ్రహం వల్లే ఇంద్రుడు తన వైభోగాన్నంతా మళ్లీ పొందాడనీ… అమ్మవారు అమావాస్య నాడు జన్మించడం వల్ల తల్లి రాకను పురస్కరించుకుని దీపావళి నాడు దీపాలు వెలిగించి పూజించడాన్ని ఓ సంప్రదాయంగా పాటించడం మొదలుపెట్టారనీ అంటారు. అలాగే మరో కథా ప్రాచుర్యంలో ఉంది. ఇంద్రుడు విష్ణుమూర్తి వద్దకు వెళ్లినప్పుడు దీపం వెలిగించి దాన్నే మహాలక్ష్మి స్వరూపంగా భావించి ప్రార్థించమని చెప్పాడట. అలా ప్రార్థించిన ఇంద్రుడు తిరిగి తన సంపదను పొందినట్లుగా చెబుతున్నాయి పురాణాలు. అందుకే దీపావళి పండుగ నాడు లక్ష్మీదేవి ప్రతీకగా దీపలక్ష్మిని పూజించే సంప్రదాయం మొదలైందనీ… ఈరోజున లక్ష్మీదేవిని ఆరాధిస్తే సకల సంపదలు కలుగుతాయనీ అంటారు.
**కార్తికం-పవిత్రం
దీపావళి తరువాతి రోజునుంచే పవిత్ర కార్తిక మాసం ఆరంభమవుతుంది. పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన ఈ మాసంలో హరిహరులను పూజిస్తే జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోతాయని కార్తిక పురాణం పేర్కొంటోంది. ఈ నెలరోజులూ తెల్లవారుజామున చేసే స్నానం, జపం, ధ్యానం, సాలగ్రామ దర్శనం, శివకేశవుల నామస్మరణ… అన్నీ శుభాలను కలిగించేవేనని అంటారు. శివారాధనకు అత్యంత ప్రాధాన్యమున్న మాసంగా పరిగణించే కార్తికంలో సోమవారాలు చేసే ఉపవాసాలకూ, సాయంత్రంపూట తులసికోట వద్ద వెలిగించే దీపాలకూ ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. అదేవిధంగా ఎంతో పర్వదినంగా పరిగణించే కార్తికపౌర్ణమినాడు 365 వత్తులను వెలిగించడం వల్ల సర్వ శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. పేరుకు ఈ నెల కార్తికం అయినా… ఈ మాసంలో మహావిష్ణువును కూడా ఆరాధించాలనీ, హరిహరులను కలిపి పూజించడం వల్ల కోరిన కోర్కెలు నెరవేరతాయనీ అంటారు.
**స్వామి దీక్ష ఎందుకంటే…
కార్తిక మాసం అనగానే చాలామంది అయ్యప్ప దీక్షను చేపట్టేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ మాసంలోనే అయ్యప్ప దీక్షను ఎందుకు స్వీకరిస్తారంటే… అయ్యప్పను హరిహర సుతుడిగా, శివకేశవుల స్వరూపంగా పూజిస్తారు. మకర సంక్రమణ సమయంలో స్వామి మకర జ్యోతి స్వరూపంలో ఆవిర్భవిస్తాడని భక్తుల నమ్మకం. ఆ జ్యోతిని చూడాలంటే మండలంపాటు అయ్యప్ప దీక్షను స్వీకరించాలి కాబట్టి కార్తిక శుక్ల పాడ్యమి మొదలుకొని… మంచి రోజుల్లో మాలను ధరించి… నియమనిష్టలతో మండలం రోజులు దీక్షను చేపట్టి ఆ తరువాత స్వామి సన్నిధానానికి చేరుకోవడాన్ని ఓ నియమంగా పెట్టుకుంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే కార్తికం అంటే… దీక్షలకూ, నియమాలకూ, వ్రతాలకూ, ఉపాసనకూ అనువైన మాసం కాబట్టి ఈ నెలలో ఏ పని చేసినా భగవంతుడి అనుగ్రహం పొందవచ్చని భక్తుల విశ్వాసం.
దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజించాలి
Related tags :