* భూకొలతల శాఖ సహాయ సంచాలకుడు(ఏడీ), జూనియర్ సహాయకుడు అనిశా(ఏసీబీ) వలలో చిక్కిన ఘటన సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. అనిశా డీఎస్పీ ఆనంద్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పటాన్‌చెరు మండలం నందిగామకు చెందిన ఓ మహిళ తన 1.29 ఎకరాల వ్యవసాయ భూమిని సర్వే చేయాలని కోరినా అధికారులు పట్టించుకోలేదు. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. సర్వే చేసి మహిళకు నివేదిక ఇవ్వాలని కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ ఏడాది సెప్టెంబరులో అధికారులు సర్వే చేసినప్పటికీ.. నివేదిక ఇవ్వడంలో తాత్సారం చేస్తున్నారు. ఇందుకోసం రూ.20 వేలు ఇవ్వాలని భూకొలతల శాఖ ఏడీ మధుసూదన్‌రావు, జూనియర్ సహాయకులు అసిఫ్ డిమాండ్ చేశారు. దీంతో ఆమె అనిశా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సోమవారం భూకొలతల శాఖ కార్యాలయంలో ఏడీ, జూనియర్ సహాయకుడికి ఆమె రూ.20 వేలు ఇస్తుండగా పట్టుకున్నామని డీఎస్పీ వెల్లడించారు.
* ఆస్తి ఇవ్వలేదనే అక్కసుతో కన్న తండ్రిని తెలియని చోట వదిలేసి వేరే ప్రాంతానికి మకాం మార్చిన కుమారుడి ఉదంతమిది.. తెలుగువారైన వి.కృష్ణారావు(65) పశ్చిమ బెంగాల్‌లోని పశ్చిమ మిడ్నాపూర్ జిల్లా ఖరగ్‌పుర్‌లో నివసిస్తున్నారు. రైల్వేలో పనిచేసి, ఇటీవల రిటైర్ కాగా, ప్రభుత్వ పింఛన్ వస్తోంది. స్థిరాస్తిని తన పేరిట రాయాలని కృష్ణారావుపై కుమారుడు విజయ్‌కుమార్ ఒత్తిడి చేశారు. అందుకు అంగీకరించకపోవడంతో జులైలో అక్కడే ఓ షాపింగ్‌మాల్ ప్రాంతంలో తండ్రిపై దాడి చేశాడు. స్పృహ కోల్పోయిన కృష్ణారావును వదిలేసి వెళ్లిపోగా.. షాపింగ్‌మాల్ సిబ్బంది ఆసుపత్రిలో చేర్పించారు. 10 రోజుల చికిత్స తర్వాత ఇంటికి చేరుకున్న కృష్ణారావుతో విజయ్‌కుమార్ మళ్లీ గొడవపడ్డారు. ఓ రోజు తన స్నేహితులతో కలిసి తండ్రిని బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్లిన విజయ్… మిడ్నాపూర్‌లోని వృద్ధుల పునరావాస కేంద్రంలో చేర్పించాడు. తన తండ్రికి మానసిక రోగం ఉందని చెప్పి.. హైదరాబాద్‌కు మకాం మార్చాడు. ఇక్కడ తండ్రి పింఛన్ తీసుకుంటూ, ప్రతినెలా రూ.5 వేలు పునరావాస కేంద్రానికి పంపించాడు.
* విశాఖ నగరానికి చెందిన పీతల అప్పలరాజు అలియాస్ రాజు (47) విజయవాడలో హత్యకు గురైన ఘటన కలకలం సృష్టించింది. దీనిపై పోలీసులు భిన్న కోణాల్లో విచారణ చేస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖ ఎంవీపీకాలనీకి చెందిన అప్పలరాజు విజయవాడకు వెళ్లి బిల్డర్‌గా ఎదిగారు. అక్కడే ప్రేమ వివాహం చేసుకున్నారు. అజిత్‌సింగ్‌నగర్ కృష్ణా హోటల్ కూడలిలో ఆర్.పి. కన్‌స్ట్రక్షన్స్ పేరుతో కార్యాలయం నడుపుతున్నారు. రాజుకు భార్య ఉమా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమారుడు ప్రవీణ్ ఎంబీఏ చదువుతున్నారు. కుమార్తె రేష్మకు ఆగస్టులో విశాఖలోనే వివాహం చేశారు. సుమారు మూడేళ్ల క్రితం భార్య, పిల్లలను తీసుకుని ఎంవీపీ సెక్టారు-9లో సొంతింటికి వచ్చి అక్కడే ఉంచారు. తాను విజయవాడలోనే ఉంటూ భవన నిర్మాణ కాంట్రాక్ట్‌లు చేస్తున్నారు. దసరా పండగకు విశాఖకు వచ్చిన అప్పలరాజు ఐదురోజుల క్రితమే విజయవాడకు వెళ్లగా..ఇంతలోనే హత్యకు గురవడంతో బంధువులు, స్నేహితులు విషాదంలో మునిగిపోయారు.
* ఓ మ్యాట్రిమోని సైట్‌లో పరిచయమై, పెళ్లి పేరుతో ఓ యువతి రూ.17.89 లక్షలు దోచేసిందంటూ బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసు ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఎస్సై నరేష్ కథనం ప్రకారం.. బోయినపల్లికి చెందిన కుమార్ వధువు కోసం ఓ వెబ్‌సైట్‌లో బయోడేటా పోస్టు చేశారు. ఓ మహిళ ఫోన్ చేసి ప్రముఖ వైద్యురాలినని పరిచయం చేసుకొని, తనకు నచ్చారని చెప్పింది. ‘త్వరలోనే హైదరాబాద్‌కు వస్తున్నా.. రాగానే పెళ్లి చేసుకుందాం.. తర్వాత మీరు అంగీకరిస్తే యూకే వెళ్తా.. లేదంటే హైదరాబాద్‌లోనే ప్రాక్టీస్ పెట్టుకుంటా’నని చెప్పింది. వాట్సాప్ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. కొంతకాలం తరువాత ఇండియాకు వస్తున్నానని మీకు విలువైన బహుమతి తెస్తానంది. రెండు రోజుల తరువాతే దిల్లీ విమానాశ్రయం నుంచి కస్టమ్స్ అధికారుల పేరుతో వ్యక్తి ఫోన్ చేసి ఓ అమ్మాయి వచ్చింది.. మీ పేరుతో యూకే కరెన్సీలో కోటి రూపాయలు వెంటతెచ్చింది. కస్టమ్స్, ఇన్‌కంటాక్స్ కట్టాలని రూ.17.89 లక్షలు వసూలు చేశారు. తర్వాత అమ్మాయి, అధికారుల ఫోన్‌లు పని చేయడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించారు.
* అమెరికా వెళ్లేందుకు వీసాలతోపాటు బహుళజాతి సంస్థల్లో ఉద్యోగాలిప్పిస్తామంటూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లను మోసం చేస్తున్న ఘరానా నిందితుడు తిప్పులరెడ్డి భాస్కర్‌రెడ్డిని హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. అమీర్‌పేటలో డొమైన్ నెట్‌వర్క్ జోన్ పేరుతో కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న భాస్కర్‌రెడ్డి.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు అమెరికాలో ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ.4 కోట్లు వరకు వసూలు చేశాడు. రెండు నెలల క్రితం కన్సల్టెన్సీకి తాళమేసి పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన ఎస్సై మహేశ్, చిత్తూరు జిల్లాలో ఉన్నాడని తెలుసుకొనిపుత్తూరులో పట్టుకొన్నారు. స్థానిక కోర్టులో హాజరుపరచి హైదరాబాద్‌కు తీసుకొచ్చి సోమవారం జైలుకు తరలించారు.