Politics

పిలగాన్ని పంపారు…ప్రజలు సమాధానమిచ్చారు-తాజావార్తలు

పిలగాన్ని పంపారు…ప్రజలు సమాధానమిచ్చారు-తాజావార్తలు

* ఈనెల 14న జరగనున్న సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశం నేపథ్యంలో తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. కౌన్సిల్‌ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై అధికారులతో సీఎం జగన్‌ చర్చించారు. హోం మంత్రి మేకతోటి సుచరిత, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ సహా పలు విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అధ్యక్షతన జరిగే సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ సహా కేరళ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్ఛేరి రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు. అండమాన్‌ నికోబార్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌, పుదుచ్ఛేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌, లక్షద్వీప్‌ అడ్మినిస్ట్రేటర్‌ కూడా హాజరవుతారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చేలా చూడాలని అధికారుకు సీఎం జగన్‌ ఆదేశించారు. దీనివల్ల సమావేశంలో చర్చ జరిగి మేలు జరిగే అవకాశం ఉంటుందన్నారు. ఏపీ విభజన చట్టానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలను అజెండాలో పొందుపరిచామని అధికారులు తెలిపారు.

* భాజపాకు ఓటేస్తే పెన్షన్‌ పోతుందని వృద్ధులను బెదిరించారు. దళితబంధు కూడా ఆపేస్తామని భయపెట్టారు. నా సభలకు ప్రజలకు రాకుండా డబ్బులు ఇచ్చి ఆపే ప్రయత్నం చేశారు. కుట్రదారులు ఎప్పుడూ కుట్రలతోనే నాశనం అవుతారు. నాపై పోటీకి రావాలని కేసీఆర్‌, హరీశ్‌రావుకు సవాల్‌ చేస్తే రాకపోగా పిలగాన్ని నిలబెట్టారు. రెండు గుంటలు ఉన్న వ్యక్తి ఇన్ని రూ.కోట్లు ఎలా ఖర్చు చేశాడు? గతంలో నేను నిర్వహించిన పదవులకు వన్నె తెచ్చాను.. ఇప్పుడు కూడా అలాగే పనిచేస్తా. ఈ పదవి నా తల్లిదండ్రులు ఇచ్చింది కాదు.. ప్రజలిచ్చింది. మరోసారి నా జన్మ ధన్యమైందని భావిస్తున్నా. హుజూరాబాద్‌ వచ్చి కుట్రలు చేసిన మంత్రులు, ఎమ్మెల్యేల భరతం పడతా. వాళ్ల నియోజకవర్గాల్లో పర్యటిస్తా. హుజూరాబాద్‌లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తా’’ అని ఈటల అన్నారు.

* ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల వ్యవధిలో 37,985 పరీక్షలు నిర్వహించగా.. 326 కొవిడ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. గుంటూరులో ఇద్దరు, కృష్ణా, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. దీంతో కొవిడ్‌ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,386కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 466 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో ఇప్పటివరకు 20,48,971 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 3,898 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.

* అమరావతినే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ రాజధాని రైతులు, మహిళలు చేపట్టిన మహాపాదయాత్ర మూడో రోజు దిగ్విజయంగా సాగింది. న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో చేపట్టిన ఈ యాత్ర ఇవాళ గుంటూరు శివారు అమరావతి రోడ్డు నుంచి ప్రారంభమై… పుల్లడిగుంట, వింజనంపాడు గ్రామాల వద్ద ముగిసింది. గుంటూరు జిల్లాలో ప్రజల నుంచి అడుగడుగునా అపూర్వ ఆదరణ లభిస్తోంది. యాత్రకు హారతులు పడుతూ నిరాటంకంగా సాగాలని ఆకాంక్షిస్తున్నారు. గుంటూరు నగరం దాటుకుని సాయంత్రం 4గంటలకు ప్రత్తిపాడు నియోజకవర్గంలోకి అడుగుపెట్టగా..ఏటుకూరు బైపాస్‌ వద్ద స్థానిక ప్రజలు, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, తెలుగుదేశం నాయకులు అఖండ స్వాగతం పలికారు. యాత్రలో కదిలి వస్తున్న వేంకటేశ్వరుడి వాహనంతో పాటు, రైతులు, మహిళలపై బంతిపూలు చల్లుతూ స్వాగతం పలికారు. రాజధాని రైతులను పూల బాటపై నడిపించారు. ఫ్లైఓవర్‌ పైనుంచి పూలు చల్లుతూ యాత్ర విజయవంతం కావాలని నినాదాలు చేశారు. రాజధాని కోసం 33వేల ఎకరాలు త్యాగం చేసిన రైతుల సంకల్పం నెరవేరుతుందని, అమరావతికి ఎలాంటి ఢోకా ఉండదని అభిప్రాయపడ్డారు. అనంతరం పాదయాత్ర పుల్లడిగుంట, వింజనంపాడు చేరుకోగా మహిళలు గుమ్మడికాయలతో హారతులు ఇచ్చి స్వాగతం పలికారు.

* విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ నూతన పైవంతెనను తెదేపా ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా నాని మీడియాతో మాట్లాడారు. దశాబ్దాల సమస్య పరిష్కారం అవుతుండటం సంతోషమన్నారు. విజయవాడకు ఏది అడిగినా కేంద్ర మంత్రి గడ్కరీ కాదనకుండా చేశారన్నారు. చంద్రబాబు విజన్‌, గడ్కరీ సహకారంతో రెండు పై వంతెనలు వచ్చాయని చెప్పారు. అనుకున్న సమయానికి ముందే హైవే అభివృద్ధి అధికారులు పూర్తి చేశారని నాని తెలిపారు. రెండు పైవంతెనలతో పాటు సర్వీస్‌ రోడ్డు అభివృద్ధికి కూడా కేంద్రం నిధులు ఇచ్చిందన్నారు. కేంద్రమే నిధులు ఇచ్చేలా తెదేపా ప్రభుత్వం కృషి చేసిందని తెలిపారు.

* గాంధీభవన్‌లో జరిగిన కాంగ్రెస్‌ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) భేటీలో నాయకుల మధ్య వాడీవేడి చర్చ జరిగింది. హుజూరాబాద్ ఓటమి, పార్టీ సభ్యత్వ నమోదు తదితర అంశాలపై పీఏసీ చర్చించింది. మరోవైపు ఖమ్మం జిల్లాలో పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోకుండా బలహీనపడేటట్లు చేస్తున్నారని భట్టి విక్రమార్కపై కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను సీఎల్పీ నేతనని.. పార్టీ అభివృద్ధి కోసమే పనిచేస్తున్నట్లు భట్టి సమాధానమిచ్చినా ఆమె సంతృప్తి చెందలేదు.

* హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం దేవన్నపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వరంగల్‌లో ‘విజయ గర్జన’ సభను తెరాస నిర్వహించనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సభ ఏర్పాట్లలో భాగంగా ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ వినయ్‌ భాస్కర్‌, మాజీ మంత్రి కడియం శ్రీహరి, తెరాస నాయకులు దేవన్నపేటలో సభా స్థలి పరిశీలన కోసం వెళ్లారు. దీంతో అక్కడి స్థానిక రైతులు సభ కోసం పంట పండే తమ పొలాలను ఇచ్చేది లేదని ఆందోళనకు దిగారు.

* దేవాదాయశాఖలో సంస్కరణలు చేపట్టినట్లు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. ఆలయాల్లో గోశాలల అభివృద్ధికి ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. సంస్కృతి, సంప్రదాయాలు గుర్తు చేసేలా త్వరలో ధర్మపథం కార్యక్రమాన్ని తీసుకురానున్నట్లు వెల్లడించారు. అన్యాక్రాంతమైన దేవాదాయ భూముల రికవరీకి ప్రయత్నాలు ముమ్మరం చేశామన్నారు. ఆలయాల వద్ద ఎక్కువగా అన్యమత ప్రచారం జరగడం లేదని మంత్రి స్పష్టం చేశారు. ఇటీవల శ్రీశైలం, తిరుపతిలో జరిగిన ఘటనలపై చర్యలు తీసుకున్నామన్నారు.

* ఆంధ్రప్రదేశ్‌ అప్పులమయం కావడంతో చీకట్లు కమ్ముకొస్తున్నాయని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య ఆందోళన వ్యక్తం చేశారు. గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ పేరుతో అప్పులు తెచ్చి ఆయననూ ఊబిలోకి నెట్టారన్నారు. గవర్నర్‌కు.. అప్పులకు ఏం సంబంధమో ఆర్థిక మంత్రి బుగ్గన సమాధానం చెప్పాలని గోరంట్ల డిమాండ్‌ చేశారు. అమరావతిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గవర్నర్‌.. అధికారులను పిలిచి మందలించే పరిస్థితి వచ్చిందన్నారు.

* విభజన చట్టం ప్రకారం డీపీఆర్‌లను సీడబ్ల్యూసీకి పంపించాలని గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ఈఎన్‌సీ మరళీధర్‌ లేఖ రాశారు. ‘‘చౌటుపల్లి హన్మంతరెడ్డి లిఫ్ట్‌, ముక్తేశ్వర లిఫ్ట్‌, తుపాకులగూడెం, మోడికుంటవాగు, సీతారామ ప్రాజెక్టులు కొత్తవి కాదు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు 967.94 టీఎంసీలు కేటాయించారు. నిర్దేశిత టీఎంసీలకు అనుగుణంగానే ప్రాజెక్టులు చేపట్టాం. వీటి వల్ల ఏపీ ప్రాజెక్టులపై ఎలాంటి ప్రభావం ఉండదు. వీటి డీపీఆర్‌ల వెంటనే సీడబ్ల్యూసీకి పంపించాలి’’ అని పేర్కొన్నారు.

* ఈనెల 14న జరగనున్న సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశం నేపథ్యంలో తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. కౌన్సిల్‌ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై అధికారులతో సీఎం జగన్‌ చర్చించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్నీ సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించాలని సన్నాహక సమావేశంలో నిర్ణయించారు. కేఆర్‌ఎంబీ పరిధిలోకి జూరాల ప్రాజెక్టును తీసుకురావాలన్న అంశాన్ని సమావేశంలో ప్రస్తావించాలని సీఎం జగన్‌ సూచించారు.

* కరోనా టీకా డోసుల పంపిణీలో వెనకబడిన జిల్లాల కలెక్టర్లతో బుధవారం ప్రధాని నరేంద్రమోదీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘మనం టీకా కార్యక్రమంలో మైలురాళ్లు దాటడంలో వైద్య సిబ్బంది కృషి ఎనలేనిది. ఈ 100 కోట్ల డోసుల పంపిణీ తర్వాత మనం నిరుత్సాహం కనబరిస్తే.. కొత్త సంక్షోభం రావొచ్చు. 100 ఏళ్లలో చూడని ఈ మహమ్మారి వల్ల మనకు అనేక సవాళ్లు ఎదురయ్యాయి. ఈ సమయంలో కొత్త పరిష్కారాలు కనుగొని ముందుకు సాగుతున్నాం’ అని చెప్పారు.

* ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జికా వైరస్‌ చాపకింద నీరులా వ్యాపించడం కలవరపెడుతోంది. బుధవారం ఒక్కరోజే కొత్తగా 14 కేసులు వెలుగులోకి వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. పరిస్థితి తీవ్రత నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌తో సమావేశం నిర్వహించారు. జికా సోకినవారిలో ఓ గర్భిణి కూడా ఉన్నట్టు సమాచారం. గతంలో 11 కేసులు ఉండగా.. తాజాగా నమోదైన కొత్త కేసులతో కలిపి కాన్పూర్‌లో మొత్తం జికా కేసుల సంఖ్య 25కి పెరిగింది.

* దేశంలో ఆధార్‌ వినియోగంలో ఉల్లంఘనలు జరుగుతోన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్‌ వ్యవస్థను నిర్వహిస్తోన్న ఆధార్‌ ప్రాధికార సంస్థ ‘ఉడాయ్‌’కు ఆధార్‌ ఉల్లంఘనలపై చర్యలు తీసుకునే అధికారాన్ని కల్పించింది. ఈ మేరకు కేంద్రం ప్రకటన విడుదల చేసింది. కేంద్రం ఇచ్చిన అధికారంతో ఉడాయ్‌ సంస్థ ఆధార్‌ చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై వచ్చే ఫిర్యాదులను పరిశీలించి గరిష్ఠంగా రూ. కోటి వరకు జరిమానా విధించవచ్చు.

* టీమ్‌ఇండియా ఫాస్ట్‌బౌలర్ జస్ప్రీత్‌ బుమ్రా అరుదైన రికార్డుకు చేరువయ్యాడు. ఇంకో మూడు వికెట్లు పడగొడితే టీ20 మ్యాచుల్లో భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌ అవుతాడు. ఇవాళ అఫ్గానిస్థాన్‌తో పోరులో బుమ్రా రాణించి రికార్డు సృష్టించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుతం బుమ్రా 52 టీ20 మ్యాచుల్లో 61 వికెట్లు పడగొట్టాడు. భారత బౌలర్లలో అత్యధిక వికెట్లు తీసిన వారిలో బుమ్రా కంటే ముందు చాహల్ ఉన్నాడు.