* హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన తర్వాత తొలిసారి భాజపా కార్యాలయానికి విచ్చేసిన ఈటల రాజేందర్‌ను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బండి సంజయ్, జితేందర్‌రెడ్డి, వివేక్, భాజపా శ్రేణులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. నీతి, నిజాయితీకి ప్రతిరూపంగా ఈటల రాజేందర్ పనిచేశారని అభినందించారు. ‘‘అబద్దాలు చెప్పడం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య. కేసీఆర్ మాటలను హుజూరాబాద్ ప్రజలు నమ్మలేదు. ఈటల రాజేందర్ సతీమణి జమున విస్తృతంగా ప్రచారం చేశారు. హుజూరాబాద్ ఆడబిడ్డలకు పేరు పేరున నమస్కరిస్తున్నా. హుజూరాబాద్ ఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు తీసుకొస్తుంది. ఉప ఎన్నికలో లబ్ధిపొందేందుకే దళితబంధు పథకం తెచ్చారు. తెరాస కుటుంబ పాలనకు వ్యతిరేకంగా కవులు, కళాకారులు, మేధావులు పనిచేశారు. హనుమకొండలో విజయగర్జన కాదు కల్వకుంట్ల గర్జన పెట్టుకోండి. నిజమైన ఉద్యమకారులకు ఉద్వాసన పలుకుతున్నారు.. కానీ, తెలంగాణ వ్యతిరేక శక్తులు ప్రగతి భవన్‌లో ఉన్నాయి. అసలైన ఉద్యమ కారులు తెరాసలో ఉండటానికి ఇష్టపడటం లేదు. ఉద్యమ కారులు, కవులు, కళాకారులు, మేధావులు భాజపాలోకి ఆహ్వానిస్తున్నాం. కుటుంబ పాలనకు చరమగీతం పాడాలి. తెలంగాణ ప్రజలు డబ్బుకు లొంగరని హుజూరాబాద్ ప్రజలు నిరూపించారు’’ అని కిషన్‌రెడ్డి అన్నారు.
* కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఏడాదిగా నిరసనలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో అన్నదాతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భాజపా నేత, మాజీ మంత్రి మనీష్ గ్రోవర్‌కు శుక్రవారం హరియాణాలోని రోహ్‌తక్ జిల్లాలో నిరసనల సెగ తగిలింది. తమకు క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ.. ఓ ఆలయంలో ఉన్న ఆయన్ను బయటికి రాకుండా భారీ సంఖ్యలో రైతులు అడ్డుకున్నారు. ఎట్టకేలకు ఆయన బయటకురాగలిగారు. అయితే.. ఈ ఘటన విషయంలో శనివారం భాజపా స్థానిక ఎంపీ అరవింద్ శర్మ.. సంబంధిత వ్యక్తులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మనీష్ గ్రోవర్‌ను ఎదురించేవారి కళ్లు పీకేస్తానని, చేతులు నరికేస్తానని ఎంపీ హెచ్చరించారు. ఓ బహిరంగ కార్యక్రమంలో ఆయన ఈ తీవ్ర వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. దీంతోపాటు ఆయన కాంగ్రెస్ పార్టీపై విమర్శలకు దిగారు. ఇదిలా ఉండగా.. భాజపా రాజ్యసభ ఎంపీ రాంచందర్ జాంగ్రా సైతం ‘నిరసనకారులంతా పనీపాట లేని తాగుబోతులంటూ’ చేసిన వ్యాఖ్యలు ఇటీవల వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీంతో హిసార్ జిల్లా నార్‌నౌంద్‌కు వచ్చిన ఆయన్ను రైతులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆయన కారు సైతం ధ్వంసమైంది.
* భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వాస్తవాధీనరేఖ(ఎల్‌ఏసీ) వెంబడి డ్రాగన్ దురాక్రమణలను అగ్రరాజ్యం అమెరికా కూడా గుర్తించింది. ఈ మేరకు ఆ దేశ రక్షణశాఖ తమ పార్లమెంటుకు ఓ నివేదిక సమర్పించింది. సైనిక సామర్థ్యం పెంచుకోవటం సహా బహుళ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సరిహద్దుల్లో చైనా పెద్దఎత్తున మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నట్లు ఆ నివేదిక పేర్కొంది. అందులో భాగంగానే అరుణాచల్‌ప్రదేశ్ భూభాగంలో చైనా వంద ఇళ్లు నిర్మించినట్లు తెలిపింది. మెక్ మెహన్ రేఖకు దక్షిణాన భారత సరిహద్దుల్లో ఈ గ్రామం ఉన్నట్లు వెల్లడించింది. డ్రాగన్ ఓ గ్రామం నిర్మించిన విషయాన్ని ఉపగ్రహ ఛాయాచిత్రం ఆధారంగా ఓ ఇంగ్లిష్ టీవీ ఛానెల్ ఈ ఏడాది ఆరంభంలో ఓ వార్తా కథనం ప్రసారం చేసింది. టిబెట్ స్వతంత్ర ప్రతిపత్తి ప్రాంతం, భారత్‌లోని అరుణాచల్ ప్రదేశ్ మధ్య ఈ గ్రామాన్ని చైనా 2020 మధ్యలో నిర్మించి ఉంటుందని అమెరికా రక్షణ శాఖ పేర్కొంది. అరుణాచల్‌లోని అప్పర్ సుబాన్‌సిరి జిల్లాలోని సారిచు నది ఒడ్డున చైనా ఈ గ్రామ నిర్మాణం చేపట్టింది. 1962కు ముందు కూడా ఈ ప్రాంతంలోనే రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణలు జరిగాయి. దశాబ్దం క్రితం వరకు దీన్ని చిన్న మిలిటరీ ఔట్ పోస్టుగా పేర్కొంటూ వచ్చిన చైనా.. 2020నాటికల్లా దాన్ని ఓ గ్రామంగా అభివృద్ధి చేసింది. అంతేకాదు భారత భూభాగంలోనే రోడ్డు నిర్మాణ పనులు కూడా చేస్తున్నట్లు సమాచారం. సైనిక ఉద్రిక్తతలను తగ్గించేందుకు సైనిక, దౌత్య మార్గాల్లో భారత్‌తో చర్చలు జరుపుతున్న డ్రాగన్.. ఆ ప్రాంతం తమదేనని వ్యూహాత్మకంగా గట్టిగా వాదిస్తున్న విషయాన్ని అమెరికా రక్షణ శాఖ తన నివేదికలో పొందుపరిచింది.
* కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని సీఎల్పీ కార్యాలయంలో పార్టీ సీనియర్ నేత వీహెచ్‌తో సమావేశమైన అనంతరం మీడియాతో మాట్లాడారు. రేపటి నుంచి తానేంటో చూపిస్తానని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ తన ప్రాణమని తెలిపారు. ‘‘కామారెడ్డిలోని ఎల్లారెడ్డి నుంచి నా ఉద్యమం మొదలుపెడతా. రేపట్నుంచి నేనేంటో చూపిస్తా. కాంగ్రెస్ పార్టీ నా ప్రాణం. సోనియా గాంధీ దేవత’’ అని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ చేసిన అభివృద్ధి వల్లే రాష్ట్రానికి ఇప్పుడే పెట్టుబడులు వస్తున్నాయన్నారు.
* భారత నౌకాదళంలోని యుద్ధ నౌకకు ‘ఏపీ పాలనా రాజధాని విశాఖ’ అని పేరు పెట్టామంటూ తూర్పు నౌకాదళం ప్రకటించడంపై నరసాపురం వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు .. రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ఫిర్యాదు చేశారు. తూర్పు నౌకాదళం హైకోర్టు ఆదేశాల ఉల్లంఘనకు పాల్పడిందని కేంద్ర రక్షణ మంత్రికి రాసిన లేఖలో ఎంపీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి మినహా మరో రాజధాని లేదని, ముంబైలో నిర్మితం అవుతున్న యుద్ధనౌకకు ఏపీ పాలనా రాజధాని విశాఖ పేరు పెట్టామని ప్రకటించడం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని ఫిర్యాదు చేశారు. యుద్ధనౌకకు ఐఎన్‌ఎస్ విశాఖపట్నంగా పేరు పెట్టడంలో ఇబ్బందేమీ లేదని, అయితే కొందరి వ్యక్తిగత ప్రయోజనాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్న కమాండర్ సుజిత్ రెడ్డిపై విచారణ జరపాలని కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌కు ఎంపీ రఘురామ ఫిర్యాదు చేశారు.
* ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను మేకప్ లేకుండా చూసి అవాక్కయ్యాడు ఓ భర్త. ఇన్నాళ్లు తాను ప్రేమించిన అందగత్తె ఈమేనా అని వాపోయాడు. వివాహమైన మర్నాడే అతనికి ఈ విచిత్ర పరిస్థితి ఎదురైంది. ఈజిప్టుకు చెందిన ఈ వ్యక్తికి కొద్దిరోజుల క్రితం ఓ అమ్మాయితో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. రోజూ చాటింగ్ చేసుకుని ఇద్దరూ దగ్గరయ్యారు. ఆమె అందాన్ని ఫొటోల్లో చూసి అతడు మంత్రముగ్ధుడయ్యాడు. ఆమెను నేరుగా కలిసేందుకు తహతహలాడాడు. పలుమార్లు డేటింగ్‌కు కూడా వెళ్లాడు. ఆమెను ఒప్పించి వివాహం చేసుకున్నాడు. పెళ్లయిన మర్నాడే అమె అసలు అందం చూసి కంగుతిన్నాడు. ‘నిన్నమొన్నటి వరకు నేను చూసింది ఈమెనేనా?’ అనుకున్నాడు. మేకప్ లేకుండా తన భార్య అందంగా కనిపిస్తుందేమోనని నెల రోజుల వరకు ఎదురు చూశాడు. ఇక ఫలితం లేకపోవడంతో తనతో కలిసి ఉండలేనని విడాకుల కోసం హెలిపోలిస్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు.
* పోడు భూముల పేరుతో డబ్బు వసూలు చేస్తే జైలుకు పంపిస్తామని తెలంగాణ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. హక్కు పత్రాల పేరుతో అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. శనివారం సిరిసిల్ల కలెక్టరేట్‌లో నిర్వహించిన పోడు భూముల అవగాహన సదస్సులో మంత్రి మాట్లాడారు. లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేస్తున్నట్టు చెప్పారు. ఎక్కడైనా అక్రమాలు జరిగితే కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేయాలని సూచించారు. కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా ఫిర్యాదుల పెట్టెను ఏర్పాటు చేస్తామన్నారు. హరిత హారంలో మూడేళ్లలో 4.5శాతం పచ్చదనం పెరిగిందన్న మంత్రి.. అటవీ ఆక్రమణలు జరగకూడదనే హక్కు పత్రాలు అందిస్తామన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. అవసరమైతే వీడియో చిత్రీకరణ చేయాలన్నారు. అధికారులు తప్పులు చేస్తే ఉద్యోగాలు ఊడుతాయ్..జాగ్రత్త అంటూ హెచ్చరించారు. అటవీ భూములపై అధికారులు కోర్టుల్లోనూ పోరాడాలని.. ఎవరికీ భయపడాల్సిన పనిలేదన్నారు.
* ప్రకాశం జిల్లాలోకి అమరావతి రైతుల మహాపాదయాత్ర ప్రవేశించిన తొలిరోజే పోలీసులు ఆంక్షల అస్త్రం బయటకు తీశారు. పాదయాత్రలో కొవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ పర్చూరు జంక్షన్‌లో చీరాల డీఎస్పీ నోటీసులు ఇచ్చారు. యాత్రకు అనుమతి ఇచ్చినప్పుడు హైకోర్టు, డీజీపీ విధించిన షరతులను రైతులు ఉల్లంఘించినట్టు పేర్కొన్నారు. ఆరో రోజు పాదయాత్ర ముగిసిన తర్వాత రైతులు బస చేసిన కల్యాణ మండపం వద్దకు చేరుకున్న డీఎస్పీ.. అమరావతి ఐకాస నేతలు శివారెడ్డి, తిరుపతిరావు, సుధాకర్, పలువురు ప్రజాప్రతినిధులకు నోటీసులు అందజేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని పోలీసులు ఆదేశించారు.
* ఆంధ్రప్రదేశ్‌ను అదానీప్రదేశ్‌గా మార్చే ఆలోచనలు చేయొద్దని తెదేపా సీనియర్ నేత, ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ అన్నారు. కేంద్ర సౌర విద్యుత్ సంస్థ(సెకీ) అనేది నిరంతరం టెండర్లు పిలుస్తూనే ఉంటుందని ఎవరికి కావాలంటే వాళ్లు వెళ్లి టెండర్ వేసుకుంటారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిదివేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు సెకీతో ఒప్పందం కుదుర్చుకోవడం వెనుక భారీ కుంభకోణం ఉందని ఆయన ఆరోపించారు.
* వాయు కాలుష్యంతో కరోనా తీవ్రత అధికమవుతుందని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా హెచ్చరించారు. ‘‘కాలుష్యం కారణంగా ఆస్తమా రోగులకు శ్వాసకోశ సమస్యలు వస్తాయి. ఊపిరితిత్తుల సమస్య తీవ్రం అవుతుంది. కరోనా సైతం ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో కాలుష్యం వల్ల కరోనా బాధితుల పరిస్థితి విషమించే అవకాశం ఉంది. కొన్నిసార్లు మరణానికి కూడా దారితీయొచ్చు.