* జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం (Accident) లో ఏఎస్సై మృతిచెందారు. ఆదివారం తెల్లవారుజామున ఘనపురం మండలం గాంధీనగరం వద్ద ఆగిఉన్న ఇసుక లారీని పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొట్టింది. దీంతో అందులో ఏఎస్సై హరిలాల్ (ASI Harilal) తోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఏఎస్సై పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించారు. దవాఖానలో చికిత్స పొందుతూ ఏఎస్సై హరిలాల్ మరణించారు.
* ఒకే కుటుంబంలో ముగ్గురిని పాము కాటు వేయడంతో మూడు నెలల చిన్నారి మృతి చెందగా ప్రాణప్రయా స్థితిలో చిన్నారి తల్లితండ్రులు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సంఘటన మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని శనిగపురం లో చోటుచేసుకుంది.
* పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం గ్రామ శివార్లలో గల పామాయిల్ తోటలో కోడిపందాలు నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు జంగారెడ్డిగూడెం DSP రవికిరణ్ మరియు సిబ్బంది అర్థరాత్రి 2 గంటల సమయంలో దాడి చేశారు.ఈ దాడులలో కోడిపందాలు నిర్వహిస్తున్న 65 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 33 మంది వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.32 మంది వ్యక్తులు పరారీలో ఉన్నారు.వీరి వద్ద నుండి 4 లక్షల 90 వేలు రూపాయలు నగదు,26 కార్లు, 35 బైక్ లు, ఒక ఆటో మరియు 38 సెల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.పోలీసులు స్వాధీనం చేసుకున్న కోడి పుంజులు విలువ 25 లక్షలు రూపాయలు విలువ ఉంటుందని పోలీసులు తెలిపారు.పరారీలో ఉన్న నిర్వాహకుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
* విశాఖలో కలకలం రేపిన విద్యుత్‌శాఖ లైన్‌మెన్ బంగార్రాజు హత్యకేసులో ప్రధాన నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. పద్మనాభం మండలం ఏనుగులపాలెంలో వారం రోజుల క్రితం బంగార్రాజు హత్యకు గురైన విషయం తెలిసిందే. కేసు నమోదు చేయడం, నిందితులను అరెస్టు చేయడంలో పోలీసులు జాప్యం చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబుతో పాటు, బాధితులు ఆరోపించారు. దీనిపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు చంద్రబాబు లేఖ కూడా రాశారు. దీంతో స్పందించిన పోలీసులు హత్యకేసు దర్యాప్తును వేగవంతం చేశారు.
* గంజాయి రవాణా, వినియోగంపై ఉక్కుపాదం మోపుతూ గంజాయి రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుకోవాలని స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పోలీసు, ఎక్సైజ్ శాఖలు గంజాయి వినియోగ నివారణకు ప్రత్యేక డ్రైవ్‌లతో విస్తృత తనిఖీలు చేపడుతున్నా ఫలితం లేకుండా పోతుంది. కొంతమందిలో ఏమాత్రం మార్పు రావడం లేదు. కొంతమంది ఒక అడుగు ముందుకేసి ఏకంగా ఇంట్లోని పూలకుండీల్లోనే గంజాయి మొక్కలు పెంచడం మొదలుపెట్టారు. సికింద్రాబాద్ యాప్రాల్‌లో ఇంట్లోనే గంజాయి మొక్కలు పెంచుతున్న ముఠాను పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. పక్కా సమాచారంతో దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లో 7 పెద్ద కుండీల్లో గంజాయి మొక్కలను పెంచుతూ స్థానిక యువతకు విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ తరహా ఘటనలు మరెక్కడైనా జరుగుతున్నాయా.. అనే కోణంలో ఆరా తీస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.