Fashion

పాపికొండల విహారయాత్ర మొదలైంది

పాపికొండల విహారయాత్ర మొదలైంది

పాపికొండల విహారయాత్ర మొదలైంది. రెండేళ్ల విరామం తర్వాత యాత్ర ప్రారంభం కావడంపై పర్యాటకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం పోశమ్మగండి ఆలయం నుంచి యాత్రికులతో 2 బోట్లు పాపికొండల విహారానికి బయల్దేరాయి. వివిధ ప్రాంతాల నుంచి యాత్రికులు చాలా ఉత్సాహంగా తరలి వచ్చారు. యాత్ర నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను రంపచోడవరం ఏఎస్పీ కృష్ణకాంత్ పటేల్‌ పర్యవేక్షించారు. యాత్ర సజావుగా సాగేందుకు రెవెన్యూ, పోలీసు, నీటిపారుదల, పర్యాటక శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. పోలీసు సిబ్బంది ఆధ్వర్యంలో ముందస్తుగా డ్రైరన్‌ను నిర్వహించినట్లు చెప్పారు. ఈసారి కొత్తగా పైలట్ బోట్‌ను ప్రవేశపెట్టినట్టు పేర్కొన్నారు. గజ ఈతగాళ్లు ఈ పైలట్‌ బోట్లలో ముందుగా ప్రయాణిస్తూ.. యాత్ర మార్గంలో సుడిగుండాలు, ఇతర ఆటంకాలను గుర్తించి.. ప్రమాదాలు సంభవించకుండా మార్గదర్శకులుగా వ్యవహరిస్తారని తెలిపారు. ప్రతి బోట్‌లో శాటిలైట్ ఫోన్, జీపీఎస్ ట్రాకర్స్‌ను అందుబాటులో ఉంచినట్టు వివరించారు. తద్వారా యాత్రికుల కదలికలను ప్రతి 15 నిమిషాలకొకసారి పర్యవేక్షించే వీలు కలుగుతుందని పేర్కొన్నారు. యాత్రికులతో దురుసుగా ప్రవర్తించేవారికి మరోసారి బోట్‌లోకి ప్రవేశం కల్పించకుండా చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.