కృష్ణా జిల్లా మైలవరం మండలం వెల్వడం గ్రామానికి చెందిన ప్రవాసాంధ్ర ప్రముఖుడు లకిరెడ్డి బాలిరెడ్డి(85) సోమవారం సాయంత్రం కాలిఫోర్నియా రాష్ట్ర ఓక్‌ల్యాండ్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో శ్వాస సంబంధ రుగ్మతల కారణంగా మృతిచెందారు. బాలిరెడ్డి…1980ల్లో…1990ల్లో దాదాపు 300కు పైగా కుటుంబాలను అమెరికా తీసుకువచ్చి, ప్రత్యక్షంగా జీవనోపాధి కల్పించారు. ఆయా కుటుంబాలు కనీసం మరో 700కుటుంబాలను అమెరికా కలకు దగ్గర చేశాయి. తద్వారా వారికి బాలిరెడ్డి పరోక్షంగా జీవనోపాధి కల్పించారు. మైలవరంలోని ప్రఖ్యాత లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజినీరింగ్ కళాశాలకు బాలిరెడ్డి చైర్మన్‌గా ఉన్నారు. బాలిరెడ్డికి ముగ్గురు కుమారులు. ప్రసాదరెడ్డి, విజయకుమార్‌రెడ్డి, రాజకుమార్‌రెడ్డి. రాజకుమార్‌రెడ్డి మృతిచెందారు. బాలిరెడ్డికి నలుగురు సోదరులు ఒక సోదరి ఉన్నారు. ప్రముఖ ప్రవాసాంధ్ర వైద్యులు డా.లకిరెడ్డి హనిమిరెడ్డితో పాటు బాలకోటారెడ్డి, జయప్రకాశరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి బాలిరెడ్డి సోదరులు. స్వస్థలంలో తన అంత్యక్రియలు నిర్వాహించాలని బాలిరెడ్డి చివరి కోరికగా పేర్కొన్నట్లు సమాచారం. దీనిపై మరింత స్పష్టత రావల్సి ఉంది.
*** కోమటి జయరాం గురువుగా…
తానా మాజీ అధ్యక్షుడు, ప్రవాసాంధ్ర ప్రముఖుడు కోమటి జయరాం బాలిరెడ్డికి సన్నిహితులు. తాను అమెరికా వచ్చిన తొలిరోజుల్లో బాలిరెడ్డి మార్గనిర్దేశం మరువలేనిదని జయరాం పేర్కొన్నారు. జయరాం కుమార్తె వివాహానికి బాలిరెడ్డి ప్రత్యేకంగా హాజరయ్యారు. ముందు వరుసలో కూర్చుని వేడుకను వీక్షించారు.