* భారత్‌లో విమాన ప్రయాణం సామాన్యులకు ఇప్పటికీ ఓ కలే. అధిక ఛార్జీలే అందుకు కారణం. అయితే, అలాంటి వారి కలలను నిజం చేయడం కోసం ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ ఓ అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చింది. విమాన టిక్కెట్ల ధరలను సులభ వాయిదాల పద్ధతి(ఈఎంఐ)లో చెల్లించేందుకు అనుమతించనుంది. మొత్తం మూడు, ఆరు, 12 నెలల వ్యవధితో ఈఎంఐలు చెల్లించే ఆప్షన్ ఇవ్వనుంది. ఈ ఆఫర్‌ను ఉపయోగించాలనుకునేవారు వన్ టైమ్ పాస్‌వర్డ్ ధ్రువీకరణ నిమిత్తం శాశ్వత ఖాతా సంఖ్య(పాన్), ఆధార్, వీఐడీ వంటి ప్రాథమిక వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రయాణికులు యూపీఐ ద్వారా తొలి ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. తర్వాతి ఈఎంఐలు అదే యూపీఐ నుంచి డిడక్ట్ అవుతాయి. క్రెడిట్, డెబిట్ కార్డు వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదు.
* ఈ ఆర్థిక సంవత్సరం హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ(హెచ్‌ఎఫ్‌సీ)లు 8-10 శాతం వృద్ధి నమోదు చేసే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా రేటింగ్స్ అంచనా వేసింది. తొలి త్రైమాసికంలో కరోనా రెండో దశ ప్రభావం కారణంగా రుణాల మంజూరు, వసూళ్ల సామర్థ్యం తగ్గిందని తెలిపింది. దీంతో వృద్ధిలో ఎలాంటి పెరుగుదల నమోదు కాలేదని పేర్కొంది. కానీ, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో రెండో త్రైమాసికానికి పరిస్థితులు గాడిన పడ్డాయని తెలిపింది. ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడం, వ్యాక్సినేషన్‌తో పాటు ఈ రంగంలో గిరాకీ పెరిగిన నేపథ్యంలో ఈ ఏడాది సానుకూల వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. గృహరుణాలు, ఆస్తులపై రుణాలు, మార్టిగేజ్ రుణాలు, కన్‌స్ట్రక్షన్ ఫైనాన్స్, లీజ్, రెంటల్ డిస్కౌంటింగ్.. అన్నీ కలుపుకొని హౌసింగ్ ఫైనాన్స్ రంగంలో ఆన్-బుక్ పోర్ట్‌ఫోలియో విలువ జూన్ 30, 2021 నాటికి రూ.11 లక్షలకు చేరిందని ఇక్రా తెలిపింది.
* ఐఆర్‌సీటీసీ శ్రీరామాయణ్ యాత్ర రైలు పర్యటనను ఆదివారం రాత్రి ప్రారంభించింది. దేశంలోని రైల్వే ఆధ్వర్యంలో మతపరమైన క్షేత్రాలకు పర్యటకాన్ని ఇది మొదలుపెట్టింది. ఈ రైలు మొత్తం 17 రోజుల్లో ఏడు క్షేత్రాలకు వెళుతుంది. దీనిలో భాగంగా తొలుత అయోధ్యకు చేరుకొంటుంది. రామేశ్వరానికి చేరడంతో యాత్ర ముగుస్తుంది. ఈ రైలును దిల్లీలోని సఫ్దార్ జంగ్ రైల్వే స్టేషన్ నుంచి బయల్దేరింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ ట్విటర్లో షేర్‌చేశారు. రామాయణ సర్క్యూట్‌కు సంబంధించిన రెండో పర్యటన డిసెంబర్ 12వ తేదీన మొదలవుతుందని అశ్వనీ పేర్కొన్నారు.
* దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీ లాభాలతో ముగిశాయి. ఉదయం ఊగిసలాటలో పయనించిన మార్కెట్లు మధ్యాహ్నం తర్వాత పూర్తిగా లాభాల్లోకి వచ్చాయి. బజాజ్ ఫిన్‌సర్వ్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, టైటన్ వంటి దిగ్గజ కంపెనీలకు కొనుగోళ్లు వెల్లువెత్తాయి. దీంతో నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్ ఇంట్రాడే కనిష్ఠాల నుంచి ఓ దశలో ఏకంగా 810 పాయింట్లు పుంజుకోవడం విశేషం. పండగ సీజన్ నేపథ్యంలో రిటైల్ విక్రయాలు రికార్డు స్థాయిలో నమోదు కావడంతో కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రంగ షేర్లు నేడు భారీగా లాభపడ్డాయి. వీటితో పాటు అంతర్జాతీయంగానూ సానుకూల సంకేతాలు ఉండడంతో సూచీలు లాభాల దిశగా సాగాయి. పెట్రో ధరల తగ్గింపు, అమెరికాలో ఉద్యోగ కల్పన పుంజుకోవడం వంటి పరిణామాలు కూడా సూచీలపై సానుకూల ప్రభావం చూపింది.