* మెట్రో రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్. ఇకపై ఉదయం ఆరు గంటల నుంచే మెట్రో రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ (హెచ్ఎంఆర్) వేళల్లో మార్పులు చేసింది. రేపటి ( నవంబర్ 10) నుంచే ఉదయం 6 గంటలకు తొలి మెట్రో రైలు ప్రారంభం కానుంది. అలాగే రాత్రి 10.15 గంటలకు చివరి స్టేషన్ నుంచి మెట్రో రైలు బయలుదేరి.. రాత్రి 11.15 గంటలకు గమ్యస్థానానికి చేరుకోనుంది. మెట్రో సేవలు పొడిగించాలని మంత్రి కేటీఆర్‌ను ఓ ప్రయాణికుడు కోరడంతో దానికి మంత్రి సానుకూలంగా స్పందించి మెట్రో ఎండీ దృష్టికి తీసుకెళ్లడంతో వేళ్లలో మార్పులు చోటుచేసుకున్నాయి.
* ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా 2020 సంవత్సరానికి గానూ పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు. వాణిజ్యం, పరిశ్రమల రంగంలో ఆయన చేసిన సేవలను గుర్తించిన కేంద్రం.. ఆయనను దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించింది. అయితే ఈ అవార్డుకు తాను అనర్హుడినని అనిపిస్తోందని మహీంద్రా అంటున్నారు. ఈ మేరకు ట్విటర్లో ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు. ‘‘ఈ ప్రభుత్వం.. పద్మ పురస్కారాల గ్రహీతల ఎంపికలో పరివర్తనమైన మార్పులు చేసింది. ఇప్పుడు అట్టడుగు స్థాయిలలో సమాజం అభివృద్ధి కోసం కృషి చేస్తున్న వ్యక్తులపై ఎక్కువగా దృష్టి పెట్టింది. ఇలాంటి గొప్ప వారి పక్కన ఈ పురస్కారం తీసుకునేందుకు నేను నిజంగా అనర్హుడిగా భావిస్తున్నా’’ అని ఆనంద్ మహీంద్రా రాసుకొచ్చారు. వేల సంఖ్యలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తోన్న కర్ణాటకకు చెందిన తులసి గౌడను కేంద్రం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించిన విషయం తెలిసిందే. ఆమె అవార్డు తీసుకుంటున్న ఫొటోను షేర్ చేస్తూ ఆనంద్ మహీంద్రా ఇలా వ్యాఖ్యానించారు. తులసి గౌడతో పాటు.. పండ్లు అమ్ముకుంటూ పేద విద్యార్థుల కోసం పాఠశాల నిర్మించిన హరేకల హజబ్బాకు కూడా నిన్న పద్మశ్రీ అవార్డును అందించారు. కాగా.. మహీంద్రా ట్వీట్‌కు నెటిజన్ల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. ‘‘మీ నిజాయతీ చాలా గొప్పది సర్. కానీ మీరు కూడా ఈ సమాజం కోసం ఎంతగానో సేవ చేస్తున్నారు. ఓ గొప్ప పారిశ్రామికవేత్తగా ఎప్పటికీ గుర్తుండిపోతారు’’ అంటూ నెటిజన్లు కొనియాడారు.
* ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీల జాబితాలో మైక్రోసాఫ్ట్ మళ్లీ తొలి స్థానానికి ఎగబాకింది. 2.53 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగిన ఈ సంస్థ.. ఇటీవలే యాపిల్(2.468 ట్రి.డా)ను వెనక్కి నెట్టింది. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ షేరు ధర రూ.336.99 డాలర్లుగా ఉంది. అయితే, ఈ షేరు ధర చూసి మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ బహుశా పశ్చాత్తాపపడుతూ ఉండి ఉంటారు! ఆయనకేమోగానీ, మనకైతే నిజంగానే ఉసూరుమనిస్తుంది! ఎందుకంటే మైక్రోసాఫ్ట్ తొలిసారి 1998 సెప్టెంబరులో ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా అవతరించిన నాటికి ఆయనకు ఈ కంపెనీలో రెండు బిలియన్ల షేర్లు ఉండేవి. అంటే ఆయన సంపద ఇప్పటికి 690 బిలియన్ డాలర్లు దాటి ఉండేది. ప్రస్తుతం ప్రపంచ కుబేరుల జాబితాలో తొలి రెండు స్థానాల్లో ఉన్న ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్ సంపద కలిపినా కూడా దీనికి సమానమయ్యేది కాదు. టెస్లా, స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడైన ఎలాన్ మస్క్ సంపద ప్రస్తుతం 340.4 బిలియన్ డాలర్లు. అమెజాన్ సహవ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సంపద 200.3 బిలియన్ డాలర్లు. 2020లో మైక్రోసాఫ్ట్ బోర్డు నుంచి వైదొలిగిన సందర్భంగా బిల్‌గేట్స్ ఆయన ఖాతాలోని మెజారిటీ వాటాలను అమ్మేశారు. బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ తరఫున నిర్వహిస్తున్న దాతృత్వ కార్యక్రమాలపై దృష్టి సారించేందుకే వైదొలుగుతున్నానని ఆయన అప్పట్లో ప్రకటించారు. తర్వాత ఆయనపై చాలా ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన తన భార్య మిలిందా గేట్స్‌కు విడాకులు కూడా ఇచ్చారు.
* దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఉదయం ఊగిసలాట మధ్య ట్రేడింగ్ ప్రారంభించిన సూచీలు కాసేపు లాభాల్లో కదలాడి తర్వాత పూర్తిగా నష్టాల్లోకి జారుకున్నాయి. అక్కడి నుంచి రోజంతా నష్టాల్లోనే కదలాడాయి. ముఖ్యంగా హెచ్డీఎఫ్సీ జంట షేర్లు, బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, వంటి భారీ కంపెనీ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడం సూచీల సెంటిమెంటును దెబ్బ తీసింది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. ఐరోపా మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి.
* భారత్‌లో 5జీ స్మార్ట్ ఫోన్ విడుదల చేసిన తొలి దేశీయ కంపెనీగా లావా ఇంటర్నేషనల్ నిలిచింది. ‘అగ్ని’ పేరిట వస్తున్న ఈ మొబైల్‌ను నోయిడాలోని తయారీ కేంద్రంలో ఉత్పత్తి చేస్తున్నారు. ప్రపంచంలో ‘మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్సెట్’పై 5జీ స్మార్ట్‌ఫోన్ తీసుకొచ్చిన రెండో కంపెనీ లావాయేనని సంస్థ అధ్యక్షుడు, బిజినెస్ హెడ్ సునీల్ రైనా తెలిపారు. ప్రస్తుతం దీని ధర రూ.19,999గా నిర్ణయించినట్లు తెలిపారు. అయితే, ప్రారంభ ఆఫర్ కింద ముందస్తు బుకింగ్ చేసుకునే వారికి రూ.17,999కే అందించనున్నట్లు కంపెనీ వెబ్సైట్ ద్వారా తెలుస్తోంది.