Politics

తెలంగాణా కాంగ్రెస్‌లో “ఈట”ల

తెలంగాణా కాంగ్రెస్‌లో “ఈట”ల

తెలంగాణ కాంగ్రెస్‌లో హుజురాబాద్‌ చిచ్చు ఇంకా చల్లారలేదు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా బల్మూరి వెంకట్‌ పోటీ చేస్తే..కేవలం 3 వేల ఓట్లు మాత్రమే రావడం ఆ పార్టీలో నేతల మధ్య వర్గపోరుకు వేదికైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థికి దాదాపు 60వేల ఓట్లు రాగా.. ఆ సంఖ్య ఇప్పుడు 3వేలకు పడిపోవడం కాంగ్రెస్‌ శ్రేణులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఈ పరిణామానికి పలువురు నేతలు కారణమంటూ ఏఐసీసీకి ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ తెలంగాణ నేతలను దిల్లీకి పిలిపించి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హుజూరాబాద్‌ ఫలితంపై ఏఐసీసీ సమీక్షలో వాడివేడి చర్చ జరిగింది. హుజూరాబాద్‌ ఉపఎన్నిక ఓటమికి మీదంటే మీదే బాధ్యత అంటూ నేతలు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. ఈటలను పార్టీలో చేర్చుకొని ఉంటే బాగుండేదని, ఆయన్ను కాంగ్రెస్‌లోకి రానివ్వకుండా కొందరు నేతలు అడ్డుకున్నారని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క ఆరోపించారు. కాగా, భట్టి వ్యాఖ్యలపై కేసీ వేణుగోపాల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటలను పార్టీలోకి తీసుకోవద్దని భట్టి విక్రమార్కే చెప్పారని, తిరిగి ఇతరుల మీద నిందలు వేస్తున్నారని వేణుగోపాల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో కొందరు నేతలు తెరాసకు సహకరిస్తున్నారని సీనియర్‌ నేత పొన్నం ప్రభాకర్‌ అగ్రనాయకత్వం దృష్టికి తీసుకెళ్లారు. కౌశిక్‌ రెడ్డి పార్టీ వీడేందుకు ఉత్తమ్‌ సహకరించారని ఆరోపించారు. కౌశిక్‌రెడ్డికి ఆయనే ఎమ్మెల్సీ పదవి ఇప్పించారని ఆరోపించారు. హుజూరాబాద్‌తోపాటు దుబ్బాక, నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలు, జీహెచ్‌ఎంసీ ఫలితాలపైనా సమీక్ష జరపాలని కేసీ వేణుగోపాల్‌ను పొన్నం ప్రభాకర్‌ కోరినట్టు సమాచారం. కౌశిక్‌రెడ్డి పార్టీ వీడిన 4నెలల వరకు అభ్యర్థిని ఎందుకు ఖరారు చేయలేదని ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. ఎవరుచెబితే బల్మూరి వెంకట్‌కు దరఖాస్తు చేయకుండానే టికెట్‌ ఇచ్చారని వీహెచ్‌ నిలదీశారు. రాహుల్‌కు కొండా సురేఖ రాసిన లేఖను వీహెచ్‌ .. వేణుగోపాల్‌కు అందజేశారు. అందరి అభిప్రాయాలతో ముందుకెళ్లానని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. హూజూరాబాద్‌లో భాజపా, తెరాస రూ.వందల కోట్లు ఖర్చు చేశాయని నేతలు వివరించారు. నేతల అభిప్రాయాలను కేసీ వేణుగోపాల్‌ నోట్‌ చేసుకున్నారు. నేతలతో కేసీ వేణుగోపాల్‌ విడివిడిగా మాట్లాడి సోనియాకు నివేదిక ఇవ్వనున్నారు.