మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన కారు డ్రైవర్ షేక్ దస్తగిరి బాంబ్ పేల్చారు. వివేకా హత్యపై ఆగస్ట్ 30న దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌ను మిగతా నిందితుల లాయర్లకు కోర్టు ఇచ్చింది. కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో బడా నేతల పేర్లు ప్రస్తావించారు. వివేకా హత్య జరిగిన తీరును వివరిస్తూ దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో ఎంపీ అవినాష్‌రెడ్డి పేరును కూడా ప్రస్తావించారు. సీఆర్‌పీసీ 164(1) సెక్షన్ కింద ప్రొద్దుటూరు కోర్టులో స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. హత్యలో నలుగురు పాల్గొన్నట్టు కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో ఉంది. ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, గుజ్జుల ఉమాశంకర్‌రెడ్డితో కలిసి వివేకాను హత్య చేసినట్టు దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. వివేకా హత్యకు ఎర్ర గంగిరెడ్డి ప్లాన్ చేసినట్టు కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు. బెంగళూరు ల్యాండ్ వివాదంలో వాటా ఇవ్వకపోవడంపై ఆగ్రహంతో ఎర్ర గంగిరెడ్డి రగిలిపోయినట్లు చెబుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గంగిరెడ్డి మోసం చేశారని, మీ సంగతి తేలుస్తానంటూ గంగిరెడ్డి, అవినాష్‌లకు వివేకా వార్నింగ్ ఇచ్చినట్టు కన్ఫెషన్ స్టేట్‌మెంట్ పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తర్వాత అవినాష్ ఇంటి దగ్గర వాగ్వాదం జరిగిందని స్టేట్‌మెంట్‌లో తెలిపారు. తనను కావాలనే ఓడించారని, మీ కథ తేలుస్తానంటూ అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డి, డి.శంకర్‌రెడ్డిలకు వివేకా వార్నింగ్ ఇచ్చినట్లు కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో మోసం చేయడంతో ఎర్ర గంగిరెడ్డి, గుజ్జుల జగదీశ్వర్‌రెడ్డిని ఆఫీసుకు పిలిపించి తిట్టినట్టు కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో వెల్లడించారు. తర్వాత కొన్ని రోజుల పాటు వైఎస్ వివేకా, గంగిరెడ్డి మధ్య మాటలు బంద్ అయ్యాయని తెలిపారు. కోటి రూపాయిలు ఇస్తాం.. వివేకాను హత్యచేయాలని, గంగిరెడ్డి ఆఫర్ చేసినట్టు కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో దస్తగిరి వెల్లడించారు. మొత్తం హత్యకు 40 కోట్ల రూపాయిల సుపారీ ఇచ్చినట్లు తెలిపారు. తనకు 5 కోట్లు ఇస్తానని ఆఫర్ చేసి.. కోటి రూపాయలు అడ్వాన్స్ ఇచ్చినట్టు దస్తగిరి వెల్లడించారు. తనకు ఇచ్చిన అడ్వాన్స్‌లో 25 లక్షలు, సునీల్ యాదవ్ తిరిగి తీసుకున్నాడని చెప్పారు. తన స్నేహితుడు మున్నా దగ్గర మిగతా 75 లక్షలు దాచానని దస్తగిరి తెలిపారు. సునీల్ యాదవ్, ఉమాశంకరరెడ్డి కలిసి వివేకా ఇంటి దగ్గర.. కుక్కను కారుతో తొక్కించి చంపేసినట్టు దస్తగిరి వెల్లడించారు. సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డిలతో కలిసి తాను వివేకా ఇంటి కాంపౌండ్ దూకి లోపలికి వెళ్లినట్టు దస్తగిరి పేర్కొన్నారు. అప్పటికే ఇంట్లో ఉన్న ఎర్ర గంగిరెడ్డి తలుపు తీయడంతో లోపలికి వెళ్లినట్టు దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు.
ఎవరు ఏంటి?
* ఎర్ర గంగిరెడ్డి: 40 ఏళ్లుగా వివేకాకు సన్నిహితుడు. ఆయనతో పాటే ఉండేవారు.
* గజ్జల ఉమాశంకర్‌రెడ్డి: వివేకా వద్ద పీఏగా పనిచేసిన జగదీశ్వరరెడ్డికి సోదరుడు. పాలడెయిరీ నిర్వహిస్తుంటారు.
* యాదటి సునీల్ యాదవ్: పులివెందుల మండలం మెట్నంతలపల్లె. జగదీశ్వరరెడ్డి ద్వారా వివేకాకు పరిచయమయ్యారు.
* దస్తగిరి: వివేకా వద్ద 2017, 2018 సంవత్సరాల్లో డ్రైవర్‌గా పనిచేశారు.
* డి.శంకర్‌రెడ్డి: వైకాపా రాష్ట్ర కార్యదర్శి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అనుచరుడు
* వైఎస్ అవినాష్‌రెడ్డి: కడప ఎంపీ
* వైఎస్ మనోహర్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి: వైఎస్ కుటుంబీకులు