Business

వారంతా PayTM కోటీశ్వరులు-వాణిజ్యం

వారంతా PayTM కోటీశ్వరులు-వాణిజ్యం

* చాలామంది త‌మ ఆర్థిక విష‌యాల‌ను ఎవ‌రితో పంచుకోవ‌డానికి ఇష్ట‌పడ‌రు. దీంతో వారికి అనుకోకుండా ఏమైనా జ‌రిగినా బ్యాంకు ఖాతాల్లో డ‌బ్బు ఉంద‌న్న సంగ‌తి క‌టుంబ స‌భ్యుల‌కు కూడా తెలియ‌దు. మ‌రోవైపు వేరే ప్రాంతాల‌కు వెళ్లిన‌ప్పుడు పాత బ్యాంకు ఖాతాల‌ను ప‌ట్టించుకోకుండా వ‌దిలేస్తారు. ఇలా క్లెయిమ్ చేసుకోని బ్యాంకు డిపాజిట్లను ఆర్‌బీఐ డిపాజిట‌ర్స్ ఎడ్యుకేష‌న్ అండ్ అవేర్‌నెస్ ఫండ్ (డీఈఏఎఫ్‌) లో జ‌మ‌చేస్తారు. దీనిని 2014 లో ఆర్‌బీఐ ప్రారంభించింది. ఈ ఫండ్‌లో చేరిన మొత్తాన్ని ప్ర‌భుత్వ సెక్యూరిటీలలో ఆర్‌బీఐ ఏర్పాటు చేసిన క‌మిటీ పెట్టుబ‌డి చేస్తుంది. దానిపై వ‌చ్చిన ఆదాయాన్ని డిపాజిట్ల‌కు వ‌డ్డీ చెల్లించేందుకు, పెట్టుబ‌డుల అవ‌గాహ‌న‌, విద్య కోసం ఉప‌యోగిస్తారు. డీఈఏఎఫ్ ఖాతాలో న‌గ‌దు పెరిగేందుకు కార‌ణం క్లెయిమ్ చేసుకొని ఖాతాల డిపాజిట్లు, రాబ‌డి నుంచి వ‌చ్చినదే. ఆర్‌బీఐ ఎప్ప‌టిక‌ప్పుడు ఈ డిపాజిట్ల‌పై వ‌డ్డీ చెల్లిస్తుంటుంది. ఖాతాదారులు లేదా వార‌సులు ఈ ఖాతాల‌ను ఎప్పుడైన అవ‌స‌ర‌మైన డాక్యుమెంట్లు చూపి క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. అయితే బ్యాంకులు ఇటువంటి క్లెయిమ్ చేసుకోని డిపాజిట్ల‌పై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆర్‌బీఐ నిబంధ‌న‌ల ప్ర‌కారం, బ్యాంకు ఖాతాను ప‌దేళ్ల‌కు మించి ఆప‌రేట్ చేయ‌క‌పోతే అందులో ఉన్న డ‌బ్బు డీఈఏఎఫ్ ఖాతాకు చేరుతుంది. రెండేళ్ల వ‌ర‌కు ఆప‌రేట్ చేయ‌ని ఖాతాను ( వ‌డ్డీ, క‌నీస ఛార్జీలు) ప‌నిచేయ‌ని ఖాతాగా ప‌రిగ‌ణిస్తారు. ఇలాంటి వాటిలోకి ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రిక‌రింగ్ డిపాజిట్లు, డిమాండ్ డ్రాఫ్ట్, బ్యాంకు చెక్కులు, పే ఆర్డ‌ర్లు, ప‌రిష్కారం కాని నెఫ్ట్ లావాదేవీలు కూడా వ‌స్తాయి. బ్యాంకు ఇ-మెయిల్ లేదా ఫోన్ ద్వారా వినియోగ‌దారునికి దీని గురించి స‌మాచారం అందించాల్సి ఉంటుంది. కానీ, బ్యాంకులు వినియోగ‌దారులకు ఈ విష‌యాన్ని తెలియ‌జేయ‌డంలో విఫ‌ల‌మ‌వుతున్నాయ‌ని కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మ‌రోవైపు వినియోగ‌దారులు వారి వివ‌రాల‌ను, మొబైల్ నంబ‌ర్‌ను అప్‌డేట్ చేయ‌క‌పోవ‌డం కూడా కార‌ణంగా చెప్తున్నారు.

* ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలోనే అతిపెద్ద ఐపీఓగా పేటీఎం పబ్లిక్‌ ఇష్యూ నిలిచింది. రూ.18,300 కోట్లు సమీకరించడమే లక్ష్యంగా నవంబరు 8న ప్రారంభమైన ఈ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌ 10న ముగిసింది. 18న స్టాక్ మార్కెట్‌ సూచీల్లో నమోదు కానుంది. ఒక్కో షేరుకు రూ.2,150కు కేటాయించారు. దీంతో నవంబరు 18న స్టాక్‌ మార్కెట్‌లో లిస్టయిన వెంటనే భారత్‌లో దాదాపు 350 మంది కోటీశ్వరులుగా మారనున్నారు. పేటీఎంలో గతంలో పనిచేసిన, ప్రస్తుతం ఉద్యోగులుగా ఉన్న దాదాపు 350 మంది నవంబరు 18న కోటీశ్వరులుగా అవతరించనున్నారు. వీరిలో చాలా మందికి పేటీఎంలో భారీ ఎత్తున షేర్లు ఉండడమే అందుకు కారణం. కంపెనీ కేటాయించిన రూ.2,150ల లెక్కన వీరి సంపద విలువ రూ.1 కోటి దాటనుంది.

* యాపిల్‌ స్టోర్లలో పనిచేసే తమ ఉద్యోగులకు 29.9 మిలియన్‌ డాలర్లు(దాదాపు రూ.223 కోట్లు) చెల్లించేందుకు కంపెనీ అంగీకరించింది. 2013 నుంచి కోర్టులో ఉన్న ఓ వ్యవహారం కొలిక్కి రావడంతో ఉద్యోగులకు ఈ పరిహారం లభించనుంది. యాపిల్‌ స్టోర్లలో తమ విధులను ముగించుకొని వెళ్లే ముందు ఉద్యోగులను క్షుణ్నంగా తనిఖీ చేసేవారు. వారేమైనా బ్యాగుల వంటివి తెచ్చుకుంటే వాటిని కూడా నిశితంగా పరిశీలించేవారు. అయితే, పెద్ద మొత్తంలో ఉద్యోగులు ఉన్న స్టోర్ల వద్ద ఈ ప్రక్రియకు చాలా సమయం పట్టేది. కంపెనీ మాత్రం ఈ తనిఖీ సమయాన్ని వారి పనిగంటల్లో చేర్చేది కాదు. దీనిపై గళం విప్పిన ఉద్యోగులు 2013లో కోర్టును ఆశ్రయించారు. తనిఖీ సమయానికి కూడా తమకు వేతనం చెల్లించాల్సిందేనని డిమాండ్‌ చేశారు. కాలిఫోర్నియాలోని నిబంధనల ప్రకారం ఇది చట్టవిరుద్ధమని వాదించారు.

* దేశంలోనే టాప్ బ్రాండింగ్ కంపెనీ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌ (ఐపీఓ)ను జారీ చేసేందుకు సిద్ధమైంది. కొద్ది రోజుల కిందటే బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ అండ్ కాస్మటిక్స్ ప్రొడక్ట్స్ కంపెనీ నైకా తరహాలో దీని అరంగేట్రం ఉంటుందని అభిప్రాయ పడుతున్నాయి. పెట్టుబడిదారుల నుంచి రూ.1,013 కోట్లను సమీకరించాలనే లక్ష్యంతో పబ్లిక్ ఇష్యూకు రెడీ అవుతోంది. ప్రముఖ ఫ్యాషన్ సంస్థ గో-ఫ్యాషన్ ఐపీఓకు సిద్ధమైంది. మహిళలకు సంబంధించిన ప్రొడక్ట్స్ ను మార్కెటింగ్ చేసే సంస్థ కావడం వల్ల మార్కెట్ వర్గాల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

* కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌.. రాష్ర్టాల ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులతో సోమవారం భేటీకానున్నారు. వర్చువల్‌గా ఈ నెల 15న జరగనున్న ఈ సమావేశంలో.. ఆర్థికాభివృద్ధి కోసం ప్రైవేటు పెట్టుబడుల్ని ఆకర్షించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారని కేంద్ర ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్‌ తెలిపారు. ప్రభుత్వం మూలధన వ్యయాల్ని పెంచుతున్న నేపథ్యంలో ప్రైవేటు రంగంలో సానుకూల సెంటిమెంట్‌ నెలకొందని, అయితే ఈ రంగం పెద్ద ఎత్తున వాస్తవ పెట్టుబడుల్ని పెట్టడం లేదని ఆర్థిక కార్యదర్శి శుక్రవారంనాడిక్కడ మీడియాకు వివరించారు. అధిక ఆర్థికాభివృద్ధిని సాధించేందుకు అవసరమైన చర్యల్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నదని చెప్పారు.